కత్తులతో వచ్చిన దొంగలు..కుర్చీలతో తరిమిన వృద్ధులు

  •  తమిళనాడులో తిరునల్వేలిలో దొంగల్ని హడలెత్తించిన వృద్ధులు 

అమరావతి, వెలుగు: ఇంట్లో ఉన్నది ముసలోళ్లే కదా.. వాళ్లను కట్టేసి ఇళ్లు దోచుకుందాం అనుకుని వెళ్లిన ఇద్దరు దొంగలు చావుదెబ్బలు తిన్నారు. చేతికి దొరికిందాన్ని ఆయుధాల్లా చేసుకుని వృద్ధ దంపతులు దొంగలకు ముచ్చెమటలు పట్టించారు. దొంగలు కత్తులు తీసి బెదిరించినా వెనక్కి తగ్గలేదా దంపతులు. తమపై దాడికి వచ్చిన ఆ దుండగులను దీటుగా ఎదుర్కొని.. తరిమికొట్టిన ఫైట్ సీన్ సీసీ టీవీలో రికార్డయింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కడియంలో జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. రాత్రి టైంలో ఇద్దరు దుండగులు ఊరికి చివరనున్న ఇంటిని టార్గెట్ చేశారు. ఇంటి ముందు కుర్చీలో కూర్చున్న పెద్దాయనపై వెనక నుంచి వచ్చిన దుండగుడు దాడికి దిగాడు. ఇంతలో రెండో దొంగ సీన్ లోకి ఎంటరయ్యాడు. తువ్వాలతో ఆయన మెడకు బిగించి కట్టేసే ప్రయత్నం చేశాడు. పెద్దాయన తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ కేకలు వేయడంతో భార్య పరిగెత్తుకొచ్చింది. బయట జరుగుతున్న సీన్ చూసి షాకైంది. వెంటనే తేరుకుని చేతికి దొరికన వస్తువును తీసుకుని దొంగపై విసిరికొట్టింది. పట్టు విడిపించుకున్న పెద్దాయన అక్కడే ఉన్న ప్లాస్టిక్ కుర్చీ అందుకుని వాళ్లపై ఎటాక్ చేశాడు. దంపతులిద్దరూ ప్లాస్టిక్ స్టూల్, చెప్పులు, బల్లలు, పేపర్ వెయిట్లు.. ఏది దొరికితే అంది అందుకుని దాడికి దిగడంతో దొంగలు పారిపోయారు. ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఇదంతా రికార్డయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.  ఆపదలోనూ వృద్ధులు చేసిన సాహసాన్ని నెటిజన్లు ప్రశంసించారు.

Latest Updates