ఢిల్లీ సర్కారు పై సుప్రీం సీరియస్

ఢిల్లీ సర్కారు పై సుప్రీం సీరియస్

వాయు కాలుష్యంలోనూ  ఢిల్లీలో పాఠశాలలను  తిరిగి ప్రారంభించడంపై  కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది సుప్రీం కోర్టు. మూడు, నాలుగేళ్ల చిన్నారులు కాలుష్యంలో స్కూళ్లకు వెళుతుంటే.. పెద్దవారైన ఉద్యోగులకు మాత్రం వర్క్‌ఫ్రంహోమ్‌కి అనుమతిస్తారా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలల పున: ప్రారంభంపై పలు చర్చలు జరిగాయని దీంతో ఆన్‌లైన్‌ షరతుని ఎంపిక చేసుకోవవచ్చని  స్కూళ్లకు  సూచించామని ఢిల్లీ ప్రభుత్వం  తెలిపింది. ఆన్‌లైన్‌ ఎంపికను కూడా ఐచ్ఛికంగా ఇచ్చారని.. అయితే ఎవరు ఇళ్లలో కూర్చోవాలనుకోరని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి. రమణ వ్యాఖ్యానించారు. మాకు పిల్లలు, మనవరాళ్లు, మనవలు ఉన్నారని, కరోనా సమయంలో వారు ఎదుర్కొన్న సమస్యలు ప్రత్యక్షంగా చూశామని అన్నారు. 24 గంటల్లో ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాయుకాలుష్య నివారణకు ఇప్పటివరకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్యం పెరుగుతూనే ఉందని, ఏమీ జరగడం లేదని.. సమయం మాత్రం వృధా అవుతోందని చీఫ్‌ జస్టిస్‌ తెలిపారు. దేశ రాజధాని, సమీప నగరాల్లో పెరుగుతున్న కాలుష్యంపై వరుసగా నాలుగో వారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పారిశ్రామిక, వాహనాల కాలుష్యానికి వ్యతిరేకంగా 24 గంటల్లో ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.