కమిషన్ కత్తికి పదునెక్కువే కానీ…

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్​, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను సమర్థవంతంగా చేపడుతున్న చరిత్ర ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ (ఈసీఐ) సొంతం. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మన దేశంతోపాటు మరికొన్ని దేశాల్లోనూ, వాళ్ల రిక్వెస్ట్​ మేరకు ఎన్నికల నిర్వహణలో సూచనలు, సలహాలు ఇస్తోంది. అప్పుడప్పుడు పర్యవేక్షణ కూడా చేస్తుంటుంది. ఇండియాలో ఇప్పటివరకు16 జనరల్ ఎలక్షన్లను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించింది. ఈ విషయంలో మన ఎన్నికల సంఘానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న 17వ లోక్ సభ ఎలక్షన్లు ప్రారంభానికి కొద్ది రోజుల ముందు 66 మంది మాజీ బ్యూరోక్రాట్లు ఈసీపై దండెత్తారు. ఈసీఐ పనితీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వీళ్లంతా మూకుమ్మడిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి ఈ నెల 8న లెటర్ రాశారు. స్వతంత్రంగా, న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మధ్య రాజీపడుతోందనే భావన కలుగుతోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈసీపై చర్చ తారాస్థాయికి చేరింది.

1989 వరకు వన్ మ్యాన్ ఆర్మీయే
30 ఏళ్ల క్రితం వరకు ఈసీఐ సింగిల్ మెంబర్ కమిషన్ లాగే ఉండేది. 1989 అక్టోబర్‌ 16నరాజీవ్‌ గాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వం మల్టీ మెంబర్ కమిషన్ లా మార్చింది. నాటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రవర్తనతో రాజీవ్‌ అసంతృప్తికి గురై ఈసీ అధికారాల్లో కోత పెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సొంత నామినీలను ఎన్నికల సంఘంలో నియమించేందుకు సర్కారుకు ఛాన్స్​ దొరికింది. కానీ, ఆ సభ్యులు అతి కొద్ది కాలమే(1990 జనవరి 1 వరకే) పదవిలో ఉన్నారు. రాజీవ్​గాంధీ తర్వాత ప్రధాని అయిన తెలుగువాడు పి.వి.నరసింహారావు 1993 అక్టోబర్1న ఈసీఐని పూర్తి స్థాయిలో ముగ్గురు సభ్యులసంఘంగా మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు (పాతికేళ్లకు పైగా) అదే సంప్రదాయం కొనసాగుతోంది. ఈసీ వ్యవహార శైలికి సంబంధించిగతాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎన్నికల్లో మనీ, మజిల్ పవర్లను, ఇతర అవకతవకలను నిక్కచ్చిగా నియంత్రించే అధికారాలు, శక్తిసామర్థ్యాలుదానికి ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

సుప్రీం ఆదేశంతో మేల్కొంది
ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించటమే కాదు. వాటిని స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా పూర్తి చేయటం కూడా ఎలక్షన్ కమిషన్ పనే. కోడ్ ను పాటించని లీడర్లపై చర్యలు తీసుకునే విషయంలో ఈసీ ఇటీవల తనఅధికారాలను రూల్స్​ని, రెగ్యు లేషన్స్​ని మర్చిపోయిందనే ఒపీనియన్ చాలా మందిలో కలిగింది. సుప్రీంకోర్టు మందలింపుతో తిరిగి మేల్కొంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రిమేనకా గాంధీ, బీఎస్పీ చీఫ్ మాయావతి,ఎస్పీ లీడర్ ఆజంఖాన్ వంటివారిపై యాక్షన్ తీసుకుంది. ప్రస్తుత జనరల్‌ ఎలక్షన్‌ ప్రాసెస్‌ వచ్చే 23న ఫలితాల వెల్లడితో ముగుస్తుంది. అప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఇలాగే స్ట్రిక్ట్​గా ఉంటుందా? లేక లైట్​ తీసుకుంటుందా?అనేది చూడాలి.

 

పెదరాయుడిలా పనిచేసిన శేషన్‌
10వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసిన టి.ఎన్.శేషన్.. ఎన్నికల కమిషన్ కి ఉన్న అసలు సిసలు పవరేంటో ఎఫెక్టివ్​గా చూపించారు. 1990 నుంచి 1996వరకు సీఈసీగా ఉన్న ఆయన చట్టాలకు లోబడే ఇండియన్ ఎలక్టోరల్ సర్కస్​లో గ్రేటెస్ట్​ రింగ్ మాస్టర్ గా నిరూపించుకున్నారు. తర్వాత వచ్చిన ఎస్​.వై.ఖురేషీ, జె.ఎం.లింగ్డో కూడా ఆ అడుగు జాడల్లోనే నడిచి ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేశారు. ఓసారి సుప్రీంకోర్టు కూడా​ టి.ఎన్.శేషన్‌​ని చూసి నేర్చుకోండని ఈసీకి సూచించటం ఆయన క్రెడిబిలిటీకి తిరుగులేని నిదర్శనం.

Latest Updates