ఎవరెక్కడ పనిచేయాలో మే 22న చెబుతాం: ద్వివేది

Election officer dwivedi meeting with election staff

ప్రతి ఓటు లెక్కించండి – పక్కాగా, సిద్ధంగా ఉండండి

ఎన్నికల సిబ్బందికి గోపాల కృష్ణ ద్వివేది సూచన

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ప్రతి ఓటు లెక్కించాలని, అందుకు తగ్గ పక్కా ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు.  మంగళవారం సచివాలయంలో జరిగిన కలెక్టర్స్ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపుపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ శిక్షకులు, ఇతర అధికారులతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియని సమర్ధవంతంగా నిర్వహించిన సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. దేశం మొత్తం మీద అత్యధిక మంది దివ్యాంగులు ఏపీలోనే ఓటు వేశారని తెలిపారు. 18-25 సంవత్సరాల వయసు గల యువత ఓటింగ్ శాతంలో కూడా మూడు శాతం వృద్ధి కనిపించిందని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో కూడా ఒక్క సంఘటన కూడా జరగలేదని చెప్పారు. అందరూ బాగా పని చేశారని ప్రశంసించారు. అదే స్పూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా సమర్ధవంతంగా పూర్తి చేయవలసి ఉందన్నారు.

అదే విధంగా మే 23 న జరిగే కౌంటింగ్ విధులలో పాల్గొనే సిబ్బంది విషయంలో ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో చేపడతామని ద్వివేది తెలిపారు.  ఏ సిబ్బంది ఎక్కడ విధులు నిర్వహిస్తారో 24 గంటల ముందు తెలుస్తుందని, ఏ టేబుల్ వద్ద విధులు నిర్వహించాలో మే 23 ఉదయం 5 గంటలకు వారికి తెలియజేస్తామన్నారు. ఈ మొత్తాన్ని ర్యాండమైజేషన్ ప్రక్రియలో చేపడతామని చెప్పారు. కౌంటింగ్ ఏజంట్ల గురించి పోలీస్ శాఖ సమాచారం సేకరిస్తుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ద్వివేది చెప్పారు. వీవీప్యాడ్  ఓట్ల  లెక్కింపులో ఒక నియోజకవర్గ పరిదిలో ర్యాండమ్ గా అయిదు కేంద్రాలను ఎంపిక చేస్తారని ద్వివేది తెలిపారు.

Latest Updates