ఎలక్షన్లు రాంగనే.. ఓటర్లపై ప్రేమ పుట్టె

జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచుతూ సడన్ గా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆగమేఘాల మీద డబ్బు రిలీజ్ చేయించారు. సమ్మె కాలానికి సంబంధించి ఆర్టీసీ కార్మికుల జీతాలు క్లియర్ చేయాలని నిర్ణయించారు. ఇంటి పన్ను తగ్గించి.. మధ్యతరగతి ప్రజలకు కాస్త ఊరట కలిగించారు. అయితే ఇవన్నీ కేసీఆర్ కు  ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చినట్లు? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే ఈ సమస్యలు పుట్టుకొచ్చాయా? గడిచిన ఆరేండ్లుగా లేవా? మరి జీహెచ్ఎంసీ ఎన్నికల ముందే సడన్ గా ఆ పనులు చేసేస్తున్నారంటే.. ప్రభుత్వం చూపిస్తున్నది కపట ప్రేమ కాదా?

జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేసినయ్.. ఇప్పుడు అర్జంట్ గా ప్రజల కోసమే పని చేస్తున్నట్టు వాళ్లకు భ్రమ కల్పించాలి. ప్రజలకు వీలైనంత మేరకు డబ్బు అందించాలి. ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. ఎవరిస్తున్నారు. ప్రభుత్వం డబ్బు అంటే కేసీఆర్ దో, టీఆర్ఎస్ దో కాదు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు.. ఎన్నికలు రాగానే ప్రజలను ప్రలోభపెట్టేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇది పక్కాగా ప్రజలను మోసగించడం కోసం చేస్తున్న నటనలే తప్ప.. నిజంగా పారిశుద్ధ్య కార్మికుల మీద ప్రేమ ఉంటే 2014 నుండి ఎప్పుడో వారి సర్వీసులు రెగ్యులర్ చేసేవారు. ఎన్నికల ముందు ఇప్పుడే జీతాలు పెంచడం జనాల్ని మోసం చేయడమే. హైదరాబాద్ లో ప్రధాన సమస్య కాలుష్యం. ఈ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, ప్రజల ఇండ్లలోని వేస్ట్ అంతా మూసీ నది హుస్సేన్ సాగర్ లో కలుస్తున్నాయి. ఈ వ్యర్థాలు మూసీలో కలవకుండా ఏ చర్యలు తీసుకున్నారు? ఇక నుంచైనా ఆ కాలుష్యం కంట్రోల్ చేసేందుకు తీసుకుంటున్న చర్యలేంటి? హుస్సేన్ సాగర్ ను మంచి నీటి సరస్సుగా మారుస్తామన్న గత ఎన్నికల వాగ్దానం ఎటుపోయింది?

ఆక్రమణల కూల్చివేత ఏమైనట్టు..

హైదరాబాద్ లో కనీసం నాలుగో వంతు ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు భూకబ్జాదారుల వశమయ్యాయి. యధేచ్ఛగా నిర్మాణాలు కొనసాగాయి. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగిస్తామని కేసీఆర్ గతంలో ప్రగల్భాలు పలికారు. రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని చెప్పారు. ఆ మాటలన్నీ అధికారంలోకి వచ్చినాక మర్చిపోయారు. మొదట్లో జీహెచ్ఎంసీ సిబ్బందిని పంపి.. కొన్ని అక్రమ నిర్మాణాలు కూలదోస్తున్నట్లు హడావిడి చేశారు. ఒక ప్రముఖ సినిమా యాక్టర్ కాంపౌండ్ వాల్ ను తాకీ తాకనట్లు తాకారు. హైదరాబాద్ లో ఎందరో ప్రముఖుల ఆక్రమణలో ఉన్న స్థలాలను బయటకు తీస్తారనే భ్రమలు కల్పించారు. కొన్ని రోజుల్లో సీన్ మారిపోయింది. తరువాత ఏ ఒక్క అక్రమ నిర్మాణాన్నీ కూల్చలేదు. ఇంతెందుకు వక్ఫ్​ భూములు ఆక్రమణలో ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. పేరుమోసిన రాజకీయ నాయకులు లాంకోహిల్స్ లాంటివి వక్ఫ్ భూములను ఆక్రమించి కట్టారని చెప్పుకొచ్చారు. కానీ ఏం జరిగింది? ఎన్ని ఎకరాల వక్ఫ్ భూములు స్వాధీనపరచుకున్నారు? ఎన్ని ఎకరాల చెరువు శిఖాలను ఖాళీ చేయించారు.

రాష్ట్రమంతా బోలెడు సమస్యలున్నయ్..

నేడు మున్సిపల్ కార్మికులే కాదు, ప్రభుత్వ ఆస్పత్రులు, గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? ఎంతమందిని రెగ్యులర్ చేశారు? ఎంతమందికి జీతాలు పెంచారు? ఎంతమందికి సరైన వసతులు రక్షణ కల్పించారు? ఇక హైదరాబాద్ డ్రైనేజీ, రోడ్ల పరిస్థితి మొన్నటి వర్షాలలో బయటపడింది. ఎన్నో కాలనీలలో ఇండ్లలోకి నీళ్లొచ్చాయి. ఈ వర్షాల వల్ల నష్టపోయిన వారికి రూ.10 వేలు పరిహారం ప్రకటించారు. ఇది కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రకటించినది కాదా? నేడు రాష్ట్ర ప్రజలకు సమస్యలు లేవా? రైతులకు సమస్యలు లేవా? సన్నాలను కొనే నాథుడు లేక రైతులు విలవిలలాడుతున్నారు. ప్రభుత్వం కొంత సహాయాన్ని ప్రకటించి కొనుగోలు చేస్తే ఎవరన్నా అడ్డుపడుతున్నారా? కౌలుదార్లకు సహాయం చేయడానికి ఎవరు అడ్డుపడ్డారు. రైతులు, చేనేత కార్మికులు, కుల వృత్తుల, చేతివృత్తుల వారికి సమస్యలు లేవా? డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంగతేంది?

జనం నిజాలు తెలుసుకోవాలి

నిజంగా సమస్యలు పరిష్కరించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు అక్కడి  ఓటర్లను ఎలా ఆకర్షించాలన్న ఆలోచన తప్ప మరో పని చేయడం లేదు. ఇలాంటి నాయకుల నిజస్వరూపం ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడడానికి కనీసం 3 నెలల ముందు నుంచి ప్రభుత్వాలు మభ్యపెట్టే వాగ్దానాలు చేయకూడదన్న నిబంధన ఉండాలి. ప్రజలకు ప్రభుత్వ డబ్బును ఏదో పేరుతో అందించడం ఎన్నికలను ప్రభావితం చేయడమే అవుతుంది. వీటిని అరికట్టడానికి గవర్నర్, ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలు తగు చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఇటువంటి జిమ్మిక్కులకు పడిపోకూడదు.

అధికార పార్టీకి కొత్తగా మేనిఫెస్టో లేంది?
గ్రేటర్ ఎన్నికల్లో జనాన్ని మోసం చేసేందుకు మరోసారి మేనిఫెస్టో అంటూ సీఎం కేసీఆర్ ఆల్ ఫ్రీ వరాల జల్లు కురిపించారు. సెలూన్లకు, దోబీలకు ఉచిత విద్యుత్ ఆరేండ్లు గా అధికారంలో ఉన్న పార్టీకి ఇప్పుడే గుర్తు రావడమేం టి? కరోనా కాలానికి సంబంధిం చి మోటార్ వెహికల్స్ టాక్స్ రద్దు /మాఫీ అని మేనిఫెస్టో లో పెట్టారు. మరి ఇన్ని నెలలుగా ఈ ఆలోచన ఎందుకు రాలేదు? సిటీ డ్రైనేజీ సిస్టమ్ బాగు చేయడం గత ప్రభుత్వ వైఫల్యమని ఈ రోజుకీ మాట్లాడడం వింతగా ఉంది. ఆరున్నరేండ్లుగా మీ ప్రభుత్వమే ఉంది కదా. ఇన్నేండ్లు గా చేయనిది.. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తే చేస్తామని కొత్తగా ప్రకటించడమేంటి? అసలు అధికారంలో ఉన్న పార్టీకి బల్దియా ఎన్నికల కోసం మేనిఫెస్టో అవసరమే లేదు. వాస్తవానికి ఇన్నేళ్లుగా చేసిన పనులు, గత మేనిఫెస్టో ను అమలు చేసిన తీరు చెప్పుకొని ఓట్లు అడగడం నిజమైన లీడర్ షిప్ అవుతుంది. కానీ అవేవీ ప్రస్తావించకుండా కొత్త మేనిఫెస్టో ప్రకటించడమంటే మళ్లీ జనాల్ని మోసం చేయడమే. అంటే ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేయరా?

ఈ కష్టాలు… ఇన్నాళ్లుగా కనిపించలేదా?

తమ ఆరోగ్యాలను, ప్రాణాలను ఫణంగా పెట్టి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న వాళ్ల సమస్యలు ఇప్పటి దాకా కనిపించలేదా? ఆ కార్మికుల్లో రెగ్యులర్ ఎంప్లాయిస్ తక్కువే. భారీ సంఖ్యలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా పని చేస్తున్నారు. కరోనా టైమ్ లోనూ ప్రాణాలకు తెగించి వాళ్లు పనిచేయడం మీ కండ్లకు కనిపించలేదా? 2014లోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని వాగ్దానం చేసిందెవరు? ఎందుకని ఆ మాటకు కట్టుబడలేదు. 2014 నుంచి పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులు కేసీఆర్, కేటీఆర్ కు తెలియవా? డ్రైనేజీలు శుభ్రపరిచే ప్రమాదకర పనుల్లో ఎంతమంది కార్మికులు చనిపోయారు. కనీసం ఈ కార్మికులకు చెల్లించాల్సిన జీతాలు సకాలంలో చెల్లించారా? ఇంతకాలం జ్ఞాపకం రాని వీరి కష్టాలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాయి. దుబ్బాక ఎన్నికల్లో ఓటమితో కండ్లు తెరుచుకుని.. జనాన్ని మాయ మాటలతో ఎల్లకాలం మోసం చేయలేమని తెలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టెక్కడానికి హడావుడి చేస్తున్నట్టు కనిపిస్తోంది. ‑జస్టిస్ చంద్రకుమార్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి.

for more News…

పేరుకే మహిళా కార్పొరేటర్లు.. పెత్తనమంతా భర్తలదే

ఎన్నికల్లో మేమంతా నోటాకే ఓటేస్తం

ప్రాజెక్టు ఏదైనా.. పేదల భూముల్లే లాక్కుంటున్నారు

పబ్జీ బంపర్ ఆఫర్: టోర్నీ గెలిస్తే కోట్లు, గేమ్ ను డిజైన్ చేస్తే లక్షల్లో జీతాలు

Latest Updates