కరోనా భయంతో ఏసీలు బంద్..సిటీలో తగ్గిన కరెంట్ వాడకం

హైదరాబాద్‌‌, వెలుగుకరోనా భయంతో పట్నం ప్రజలు ఏసీలు వాడడం లేదు. తక్కువ టెంపరేచర్ లో కరోనా వైరస్ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండడంతో ఎండలు మండిపోతున్నప్పటికీ ఏసీలు, కూలర్లు వేసుకోవడం లేదు. దీంతో సిటీల్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌‌డౌన్‌‌ కొనసాగుతుండడంతో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, మాల్స్‌‌, సినియా థియేటర్లు… ఇలా అన్నీ బంద్ కావడంతో కరెంట్ డిమాండ్ మస్తు తగ్గిపోయింది.  పోయిన నెల 28న 13,168 మెగావాట్ల రికార్డు డిమాండ్ నమోదవ్వగా, అదికాస్తా ఆదివారం నాటికి 10వేల లోపుకు పడిపోయింది. అంటే నెల రోజుల్లోనే 3వేల మెగావాట్లు తగ్గిపోయింది. ఈ నెల ప్రారంభం నుంచి భారీ స్థాయిలోనే విద్యుత్‌‌ వినియోగం జరిగినా… 22న జనతా కర్ఫ్యూ విధించడం, అనంతరం లాక్‌‌డౌన్‌‌ ప్రకటించడంతో విద్యుత్‌‌ డిమాండ్‌‌ తగ్గుతూ వస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం శనివారం నాడు 10,211 మెగావాట్లు ఉండగా… అది ఆదివారం నాటికి 9,989 మెగావాట్లకు పడిపోయింది.

జిల్లాల్లో డిమాండ్ ఎక్కువే…

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుల పంప్‌హౌస్ మోటార్లు నడుస్తుండడంతో ఫిబ్రవరి 28న రాష్ట్రంలో 13,168  మెగావాట్లతో రికార్డు స్థాయి విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. కానీ మార్చి 29 నాటికి నెల రోజుల్లోనే 3వేల మెగావాట్లకు పైగా విద్యుత్‌ డిమాండ్‌ తగ్గిపోయింది. పారిశ్రామిక, వాణిజ్య వర్గాలుండే హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఎస్‌పీడీసీఎల్‌  పరిధిలో విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు ఎత్తిపోతల ప్రాజెక్టులు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్న  వరంగల్‌లోని నార్తర్న్‌ డిస్కంలో వినియోగం పోయినేడాది కంటే ఎక్కువున్నది. ఎత్తిపోతల ప్రాజెక్టులున్న ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో విద్యుత్‌ వినియోగం ఎక్కువగానే ఉంది. ఈ జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉండడం కూడా మరో కారణమని విద్యుత్ వర్గాలు పేర్కొంటున్నాయి. పట్టణ ప్రజలు గ్రామాల బాట పట్టడంతో కూడా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ డిమాండ్‌ పెరగడానికి కారణమని తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో తగ్గినా ప్రాజెక్టులతో బ్యాలెన్స్ అవుతోందని లేదంటే భారీగా పడిపోతే ప్రమాదమేనని విద్యుత్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Latest Updates