
హైదరాబాద్‌లో కరెంటు వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది గరిష్ట డిమాండ్ గత రికార్డులను (2,950 మెగావాట్లు) దాటి 3,276 మెగావాట్లకు చేరుకుంది. దేశంలోని 13 రాష్ట్రాల కన్నా హైదరాబాదీలే ఎక్కువ కరెంటును వాడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలన్నీ కలిపినా మన సిటీ (2,848 ఎంవీ) దరిదాపులకు రాలేదు. హిమాచల్ ప్రదేశ్(1,387), జమ్మూకాశ్మీర్(2,826), ఉత్తర ఖండ్(1,922), గోవా(594), సిక్కిం(100), జార్ఖండ్(1,266), అస్సాం(1,712), అరుణాచల్ ప్రదేశ్(139), మణిపూర్(197), మేఘాలయ (336), మిజోరం(116), నాగాలాండ్(157), త్రిపుర(292) మేర కరెంటు వాడుతున్నాయి. రాష్ట్రం ఏర్పడినపుడు హైదరాబాద్‌లో 37.8 లక్షల ఎల్.టి. విద్యుత్ కనెక్షన్లుంటే ఇప్పుడు 47.8 లక్షలున్నాయి. 27 శాతం పెరిగాయి. 2014లో 5,067 హెచ్.టి. కనెక్షన్లుంటే నేడు 7,015కు పెరిగాయి. హైదరాబాద్‌లో కరెంటు డిమాండ్‌లో 10 శాతం స్థిరమైన వృద్ధి ఉండటంతో నగరం చుట్టూ 400 కేవీ రింగు ఏర్పాటు చేసి నాలుగు 400 కేవీ సబ్ స్టేషన్లు నిర్మించారు. అక్కడి నుంచి 220 సబ్‌స్టేషన్లకు కరెంటు సరఫరా చేసే లైన్ల సామర్థ్యం ఎప్పటికప్పుడు పెంచుతున్నట్లు ట్రాన్స్ కో సీఎండీ వెల్లడించారు.
రూ.1,200 కోట్ల ఖర్చును రూ.100 కోట్లకు తగ్గించాం: ట్రాన్స్‌కో సీఎండీ
హైదరాబాద్‌లో కరెంటు డిమాండ్‌కు తగ్గట్టు కొత్త లైన్లు, టవర్లు ఏర్పాటు చేయకుండా కేవలం కండక్టర్లతోనే విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని పెంచామని ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు చెప్పారు. విద్యుత్ సౌధలోని లోడ్ డిస్పాచ్ సెంటర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన కండక్లర్లను బుధవారం ఆయన ప్రారంభించారు. ‘రూ.1,100 కోట్లు ఆదా చేశాం. మూడేళ్ల టైంను 3 నెలలకు తగ్గించాం. నగరంలో విద్యుత్ సరఫరా మెరుగుపరిచాం’ అన్నారు. నగరంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో సరఫరాలో ఇబ్బందులొచ్చాయి. 400 కేవీ లైన్ల నుంచి 220 కేవీ విద్యుత్‌ను తీసుకొచ్చే మామిడిపల్లి-శివరామ్‌పల్లి, మల్కాపురం- షాపూర్‌నగర్, శంకరపల్లి-గచ్చిబౌలి లైన్లపై ఒత్తిడి పెరిగింది. దీన్ని అధిగమించాలంటే 70 కిలోమీటర్లున్న ఈ మూడు లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలి. కొత్తగా టవర్లు నిర్మించి, 220 కేవీ లైన్లు వేస్తే రూ.1,200 కోట్లవుతుంది. టవర్ల నిర్మాణానికి స్థల సేకరణ, నిర్మాణానికి మూడేళ్లు పడుతుంది. ఇవేవీ లేకుండా 3 నెలల్లో లైన్ల సామర్థ్యాన్ని కండక్టర్లతో పెంచారు. ఇందుకు రూ.100 కోట్ల ఖర్చయింది.