వస్తున్నయ్‌ కరెంట్​ విమానాలు

డీజిల్​, పెట్రోల్​ వాహనాలతో కాలుష్యం పెరిగి పర్యావరణం పాడైపోతోంది. మరి, వాటికి ప్రత్యామ్నాయం లేదా? అంటే, బాగా వినిపిస్తున్న మాట కరెంట్​ బండ్లు. ఇప్పటికే కార్లు, బైకుల కంపెనీలు వాటిపై దృష్టి పెట్టాయి. కొన్ని దేశాల్లో నడుస్తున్నాయి కూడా. మరి, విమానాల పరిస్థితేంటి? ఆ దిశగానూ అడుగులు పడ్డాయి. కంపెనీలు ఎలక్ట్రిక్​ విమానాలపై దృష్టి పెట్టాయి. ఫ్రాన్స్​ రాజధాని పారిస్​లో కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఎయిర్​ షోలో కంపెనీలు ఎలక్ట్రిక్​ విమానాలు, వాటి మోడళ్లను ప్రదర్శించాయి. ఆ ఎయిర్​ షోలో ఎలక్ట్రిక్​ విమానాలతో పాటు హైబ్రిడ్​ విమానాలూ కనిపించాయి. చాలా మంది కస్టమర్లు వాటిపైనే ఎక్కువ ఇష్టం చూపించారు. గత ఏడాదితో పోలిస్తే ఎలక్ట్రిక్​ విమానాల తయారీ ఈ ఏడాది 50 శాతం పెరిగి 170 శాతానికి చేరిందని, ఈ ఏడాది చివరినాటికి 200శాతం వరకు చేరుతుందని  రోలండ్​ బెర్జర్​ అనే కన్సల్టెన్సీ అంచనా వేసింది.

అందరి దృష్టి ఇజ్రాయెల్​ కంపెనీపైనే

పారిస్​ ఎయిర్​ షోలో అందరి కళ్లు ఇజ్రాయెల్​ కంపెనీ ఎవియేషన్​ ఎయిర్​క్రాఫ్ట్​పైనే పడ్డాయి. ఆ కంపెనీ ‘యలైస్​’ అనే ఎలక్ట్రిక్​ విమానాన్ని తయారు చేసింది. ఆ విమానాన్ని అమెరికా కంపెనీ కేప్​ ఎయిర్​ కొనుక్కోబోతోంది. తమకు ఫస్ట్​ కస్టమర్​ ఆ కంపెనీయేనని పేర్కొంది. యలైస్​కు ఒక్కసారి చార్జింగ్​ పెడితే, 1,050 కిలోమీటర్లు వెళుతుందని, కంపెనీల ఖర్చు 70% తగ్గిపోతుందని చెప్పింది. ఈ ఏడాదే అమెరికాలో వాటి ఉత్పత్తి ప్రారంభించామని కంపెనీ తెలిపింది. విమానాన్ని ముందుకు నడిపించేలా తోకలో ఓ పుషర్​ ప్రొపెల్లర్​, రెక్కల అంచుల్లో మరో రెండు ప్రొపెల్లర్లు ఉంటాయి. అన్నీ బ్యాటరీలతోనే పనిచేస్తాయి. 10 వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుంది.

2022 నాటికి హైబ్రిడ్​ విమానం

డిఫెన్స్​ కాంట్రాక్టర్​ అయిన రేథియన్​ కంపెనీతో కలిసిపోతున్నట్టు యునైటెడ్​ టెక్నాలజీస్​ అనే కంపెనీ పారిస్​ ఎయిర్​ షోలో ప్రకటించింది. హైబ్రిడ్​ ఎలక్ట్రిక్​ విమానానికి సంబంధించి డిజైన్​ను విడుదల చేసింది. 2022 నాటికి వాటిని నడపాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. విమానమంతా పాత మోడళ్లవాటిలాగానే ఉంటుంది. ఉన్న ఒకే ఒక కొత్తదనం బ్యాటరీలు. 2 మెగావాట్ల హైబ్రిడ్​ ఎలక్ట్రిక్​ ప్రొపల్షన్​ సిస్టమ్​ను ఇందులో వాడుతున్నారు. ఎయిర్​బస్​ కూడా హైబ్రిడ్​ ఎలక్ట్రిక్​ విమానాలపై దృష్టి పెట్టింది. ఆ కంపెనీ కూడా 2022 నాటికి తొలి విమానాన్ని రెడీ చేయాలని భావిస్తోంది. యూరోపియన్​ ఏరోస్పేస్​ కంపెనీలు దాహెర్, సాఫ్రన్​లతో ఒప్పందం చేసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. విమాన విడిభాగాలు, సిస్టమ్​ల అనుసంధానంపై దాహెర్, ‘ఎకోపల్స్​’ అనే ఎలక్ట్రిక్​ ప్రొపల్షన్​ సిస్టమ్​పై సాఫ్రన్​ పనిచేయనున్నాయి.

బ్యాటరీలు, ఏరోడైనమిక్​ డిజైన్​ సంగతి ఎయిర్​బస్​ చూసుకుంటుంది. ఎలక్ట్రిక్​ మోటార్లు, ప్రొపెల్లర్లను నడిపించేలా విమానంలో టర్బోజనరేటర్లు అమర్చుతారు. అంతేకాదు, హైబ్రిడ్, ఎలక్ట్రిక్​ ఎయిర్​క్రాఫ్ట్  సిస్టమ్స్​పై రీసెర్చ్​ చేసేందుకు ఎస్​ఏఎస్​ స్కాండినేవియన్​ ఎయిర్​లైన్స్​తోనూ ఒప్పందం చేసుకున్నట్టు ఎయిర్​బస్​ ప్రకటించింది. బ్రిటన్​కు చెందిన ఫేమస్​ కార్ల కంపెనీ రోల్స్​రాయ్స్​ కూడా ఎలక్ట్రిక్​, హైబ్రిడ్​ ఎలక్ట్రిక్​ ఏరోస్పేస్​ ప్రొపల్షన్​ వ్యవస్థలపై జర్మనీ కంపెనీ సీమెన్స్​తో ఒప్పందం చేసుకుంది. జర్మనీ, హంగరీలో ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఇందుకోసం 180 మంది స్పెషలిస్ట్​ ఇంజనీర్లను కంపెనీ ఇప్పటికే నియమించుకుంది.

Latest Updates