ఎందుకు ఓడినం?: ఫలితాలపై ప్రతిపక్షాల పోస్ట్‌‌‌‌మార్టం

eletions-lost-oposition-meeting

న్యూఢిల్లీ:సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్ష పార్టీలు తొలిసారి భేటీకానున్నాయి. శుక్రవారం పార్లమెంట్​ సెంట్రల్​ హాలులో జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశానికి కాంగ్రెస్​ నేతృత్వం వహించనుంది. దీనికి డీఎంకే, ఎన్సీపీ,  టీడీపీ, జేడీఎస్​, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఇండియన్​ ముస్లింలీగ్​, కేసీఎం, ఆర్​ఎస్పీ పార్టీలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ నాయకులు కూడా సమావేశానికి వచ్చే అవకాశాలున్నాయి. వీరంతా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవడంతోపాటు భవిష్యత్​ కార్యాచరణను రూపొందించనున్నారు. జూన్​6 నుంచి పార్లమెంట్​ సమావేశాలు ప్రారంభంకానుండటంతో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించనున్నారు. ఎన్నికల అంశాలతోపాటు ఈవీఎంల పనితీరు, 50 శాతం వీవీప్యాట్​ స్లిప్పుల లెక్కింపు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానిగా మోడీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాతి రోజే ప్రతిపక్షాలు భేటీ కానుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

 సీపీపీ లీడర్​గా రాహుల్​?

ఎన్నికల ఫలితాలు వెలువడి వారం తర్వాతగానీ కాంగ్రెస్​పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) భేటీకి ముహుర్తం ఖరారైంది. శుక్రవారం(జూన్​ 1న) సీపీపీ జరపాలని అధిష్టానం డిసైడైంది. ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్​, 52 సీట్లకే పరిమితం కావడం, నైతిక బాధ్యతగా చీఫ్​ పదవికి రాహుల్​ రాజీనామా చేస్తాననడం తదితర పరిణామాలతో పార్టీలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాటి భేటీలోనే సీపీపీ నేతను ఎన్నుకోనున్నారు. పార్టీ బాధ్యతల నుంచి తప్పుకునే పక్షంలో సీపీపీ లీడర్​ బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్​ ఓకే చెప్పినట్లు సమాచారం.

Latest Updates