ఎల్లంపల్లి ప్రారంభోత్సవమెప్పుడు?

  • 2004లో శంకుస్థాపన చేసిన వైఎస్సార్
  • 2013లో పూర్తి..వినియోగంలోకి ప్రాజెక్టు
  • అధికారికంగా ఇప్పటికీ జరగని ప్రారంభోత్సవం
  • పట్టించుకోని టీఆర్ఎస్ సర్కారు

మంచిర్యాల, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్​ ఇటీవలే అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. ఇంకా కొంతవరకు పనులు మిగిలే ఉన్నా లాంఛనంగా రిబ్బన్​ కట్​ చేశారు. కానీ ఏడేళ్ల ముందే పూర్తయి, వినియోగంలోకి వచ్చిన ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇప్పటికీ అధికారికంగా ప్రారంభోత్సవం జరగలేదు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్​కుమార్​రెడ్డి.. తన పదవీకాలంలో చివర్లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించారు. అధికారులు ప్రాజెక్టు వద్ద పైలాన్​ నిర్మించి, సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేశారు. కానీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న ఆ సమయంలో ఇది ఉద్రిక్తతలు పెంచింది. ఏపీకి చెందిన కిరణ్​ ఎల్లంపల్లిని ప్రారంభించడమేంటని తెలంగాణ వాదులు నిరసనలు వ్యక్తం చేశారు. అప్పట్లో కరీంనగర్ ఎంపీగా ఉన్న కాంగ్రెస్ సీనియర్​ నేత పొన్నం ప్రభాకర్.. ఆంధ్రా ప్రాంత సీఎంలకు తెలంగాణలోని ప్రాజెక్టులను ప్రారంభించే అర్హత లేదని, అలా కాదని వస్తే హెలికాప్టర్​ను గాల్లోనే పేల్చేస్తామని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తీవ్ర నిరసనల నేపథ్యంలో కిరణ్​ ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. 2014లో రాష్ట్రం ఏర్పాటై, టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక ఎల్లంపల్లిని అధికారికంగా ప్రారంభిస్తారని భావించారు. కానీ ఆరేళ్లవుతున్నా దానిని పట్టించుకున్నవారు లేరు.

అన్నింటికీ ఎల్లంపల్లి కీలకం

ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్​రెడ్డి ఎల్లంపల్లికి 2004 జులై 28న శంకుస్థాపన చేశారు. మొదట పనులు వేగంగానే జరిగినా, 2009లో వైఎస్​ మరణించాక జాప్యం జరిగింది. రోశయ్య, కిరణ్​కుమార్​రెడ్డి ప్రభుత్వాల్లో మెల్లగా కొనసాగి 2013 నాటికి ప్రాజెక్టు పూర్తయింది. దీని పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలుకాగా.. 6.5 టీఎంసీలు రామగుండం ఎన్టీపీసీకి, 2 టీఎంసీలు మంథని ఎత్తిపోతలకు కేటాయిస్తున్నారు. కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సైతం ఎల్లంపల్లి నుంచే గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరందిస్తున్నారు.​ హైదరాబాద్​ తాగునీటి అవసరాలు తీర్చేందుకు సుజల స్రవంతి పథకం ద్వారా 10 టీఎంసీలు తరలిస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులోనూ ఎల్లంపల్లి కీలకం. మేడిగడ్డ నుంచి దశలవారీగా నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసి, అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఇంత ప్రాధాన్యమున్న ఈ ప్రాజెక్టుకు అధికారికంగా ప్రారంభోత్సవం చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఫోకస్​ అంతా కాళేశ్వరంపైనే..!

టీఆర్​ఎస్​ సర్కారు తొలిసారి అధికారంలోకి వచ్చాక ప్రాణహిత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైనింగ్​ చేసి, కాళేశ్వరం ప్రాజెక్టుగా చేపట్టింది. మూడేళ్లలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. ఈ నెల 21వ తేదీన మూడు రాష్ట్రాల సీఎంల చేతుల మీదుగా కాళేశ్వరం ప్రాజెక్టును అట్టహాసంగా ప్రారంభించారు. ప్రభుత్వపరంగా ఈ ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్​ పెట్టారు.

Latest Updates