
న్యూఢిల్లీ: టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ టెలికాం బిజినెస్ వైపు చూస్తున్నారు. మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఇప్పటికే తన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్ కోసం వెయ్యికి పైగా శాటిలైట్లను లాంచ్ చేసింది. ప్రస్తుతం స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం అమెరికా, కెనడా, ఇంగ్లండ్‌ల నుంచి కస్టమర్లు రిజిస్టర్ అవుతున్నారు. విమానాలలో ఇంటర్నెట్ కోసం, మారిటైమ్ సర్వీసెస్ కోసం చైనా, ఇండియా నుంచి డిమాండ్ ఉందని, ఒక ట్రిలియన్ డాలర్ల మార్కెట్ దిశగా అడుగులేస్తున్నామని తన ఇన్వెస్టర్లకు స్పేస్ ఎక్స్ చెప్పడం గమనార్హం. అంతేకాకుండా రూరల్ కస్టమర్లకు సర్వీసెస్ అందిస్తామని పేర్కొంది. ఫైబర్ ఆప్టిక్స్ ఖరీదుగా ఉండడంతో పాటు, రూరల్ ఏరియాలకు విస్తరించడంలో ఇబ్బందులు ఉండడంతో శాటిలైట్ ఇంటర్నెట్ వైపు అందరు చూస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి తన ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా స్టార్ లింక్ శాటిలైట్లను స్పేస్ఎక్స్ లాంచ్ చేస్తోంది. బ్యాచ్‌కి 60 చొప్పున శాటిలైట్లను లాంచ్ చేస్తున్న ఈ కంపెనీ, తన 17 వ స్టార్ లింక్ లాంచ్‌ను ఈ నెల 20 న చేపట్టింది. ట్రెడిషనల్ శాటిలైట్లలా కాకుండా స్టార్ లింక్ శాటిలైట్లు ఎర్త్ ఆర్బిట్‌కు చేరువలో ఉంటాయి. ఇప్పటికే లాంచ్ చేసిన శాటిలైట్ల ద్వారా నార్త్ అమెరికా, ఇంగ్లండ్ లలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్‌లను అందించొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. మరిన్ని శాటిలైట్లు పంపి ఈ సర్వీస్‌ను విస్తరించొచ్చని పేర్కొన్నారు. కాగా, ఈ అంశంపై స్పేస్ ఎక్స్ స్పందించలేదు