ఆడబిడ్డ పుడితే ఊరంతా పండుగే

ఆడపిల్ల పుడితే పురిటిలో చిదిమేసే వాళ్లున్న ఈ రోజుల్లో.. మాకు ఆడపిల్లే కావాలని దేవుడిని కోరుకునే వాళ్లు ఎంతమంది ఉంటారు! అలాంటిది ఈ ఊరు ఊరంతా ‘మాకు ఆడపిల్లలే పుట్టాల’ని కోరుకుంటున్నారు. ఆ ఊళ్లో ఎవరికి ఆడపిల్ల పుట్టినా.. ఊరంతా కలిసి పండుగ చేసుకుంటున్నారు.

ఆడపిల్ల పుడితే ఆ ఊళ్లోవాళ్లకి పట్టరాని సంబురం. తల్లిదండ్రులకు ఆడపిల్ల భారం కాకూడదని చేయూతనిస్తున్న ఆ ఊరి పేరు హరిదాస్​పూర్​. సంగారెడ్డి జిల్లా కొండాపూర్​ మండలంలో ఉంది. ఈ ఊరివాళ్లు ఆడపిల్లలను కాపాడుకునేందుకు తమకు తాముగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజంలో ఆడపిల్లను చిన్నచూపు చూస్తుండడం హరిదాస్​పూర్​ ప్రజలను కలచివేసింది. అంతేకాక ఆ ఊళ్లో అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య ఎక్కువ. అందుకే ఊరివాళ్లు, పంచాయతీ పాలక వర్గం కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అవి.. ఊళ్లో ఎవరికి ఆడపిల్ల పుట్టినా ఊరంతా పండుగ చేసుకోవాలి. ఆ బిడ్డ పెంపకానికి కొంత డబ్బు ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే పథకాలు అందేలా చూడాలి. జిల్లా యంత్రాంగం కూడా దీనికి సహకరించడంతో 2020 జనవరి 1నుంచి ఈ నిర్ణయాలను అమలు చేస్తున్నారు.

మూడు కుటుంబాల్లో..

గ్రామంలో కొత్త సంవత్సరం రోజున సత్యవతి నగేష్​గౌడ్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులు మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని సంతోషంగా ఉన్నారు. అంతకుముందే డిసెంబర్‌‌‌‌చివరి వారంలో వెన్నెల దినకర్‌‌కు ఆడబిడ్డ పుట్టింది. ఆ తర్వాత బానోత్​ సంగీత విజయ్‌‌కి మొదటి సంతానంగా ఆడబిడ్డ పుట్టింది. వారం తిరక్కుండానే ఊళ్లో ముగ్గురికి ఆడపిల్లలు పుట్టారు. అందుకే ఆ ఊళ్లో వారంలో మూడు రోజులు పండుగ చేసుకున్నారు. ఊరంతా కలిసి పంచాయతీ ఆఫీస్‌‌ను రంగు రంగుల లైట్లతో అలంకరించారు. ఆడబిడ్డ పుట్టిన దంపతులను సన్మానించి, కుటుంబ సభ్యులకు దావత్‌‌ఇచ్చారు. కులమత బేధాలు ఊరంతా అంతా కలసి సంబురాలు చేసుకున్నారు.

ఆడపిల్ల భారం కాదు

మా ఊళ్లో మగవాళ్లు ఎక్కువగా, ఆడపిల్లలు తక్కువగా ఉన్నట్లు 2‌‌‌‌జనాభా లెక్కల్లో తేలింది. పల్లె ప్రగతి పనుల్లో భాగంగా ఊరును బాగు చేసుకున్నాం. కానీ మానవ మనుగడను కాపాడే ఆడ పిల్లల సంఖ్య తక్కువగా ఉండడంతో బాధపడ్డాం. పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో గ్రామసభ నిర్వహించి ఆడపిల్లను కన్న తల్లిదండ్రులకు అండగా ఉండాలని నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా అకౌంట్​ ఓపెన్​ చేసి పుట్టిన ఆడబిడ్డ పేరు మీద ఆరు నెలల ఆర్థిక సాయం జమచేస్తున్నాం.

– షఫీ, సర్పంచ్

Latest Updates