టెర్రర్‌ గ్రూపుల పనిపట్టండి..పాక్​కు అమెరికా సలహా

end-terrorist-groups-americas-advice-to-pakistan

వాషింగ్టన్: భారత ప్రధానిగా నరేంద్రమోడీ తిరిగి ఎన్నికైన తర్వాత రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్​ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటంపై అమెరికా స్పందించింది. దక్షిణాసియాలో శాంతి కొనసాగాలంటే ఆ బాధ్యత పాక్​పైనే ఉందని, టెర్రర్​ గ్రూపులను పాకిస్థాన్​ దూరం పెడితేనే అది సాధ్యమవుతుందని వైట్​ హౌస్​ స్పష్టం చేసింది. కాశ్మీర్​ సహా అన్ని అంశాలనూ చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధమని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్.. ఇటీవల లోక్​సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోడీకి రెండు లేఖలు రాశారు. చర్చలకు ముందుకు వస్తే ఇరు దేశాల్లో పేదరికాన్ని పారద్రోలడంతోపాటు ప్రాంతీయ అభివృద్ధికి కలసి పనిచేయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. అయితే పాక్​ ఆఫర్​ను ఇండియా తిరస్కరించింది. టెర్రరిస్టులు, చర్చలు ఒకేసారి కొనసాగలేవని, కిర్గిస్థాన్​లో ఈ నెల 13–14 తేదీల్లో జరిగే షాంఘై కోఆపరేషన్​ సమ్మిట్(ఎస్ సీవో)లోనూ రెండు దేశ ప్రధానుల సమావేశం ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు టెర్రరిస్టులను అరెస్ట్​ చేసి, వారిని ప్రాసిక్యూట్​ చేయాలని, దేశంలో స్వేచ్ఛగా తిరిగేందుకు, కార్యకలాపాలు నిర్వహించేందుకు వారికి అనుమతి ఇవ్వొద్దని, ఆయుధాలతో భారత్​లో చొరబడి దాడులకు పాల్పడటాన్ని అడ్డుకోవాలని వైట్​హౌస్​లోని ఓ సీనియర్​ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదులకు కళ్లెం వేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, టెర్రరిస్టు సంస్థలు కార్యకలాపాలు నిర్వహించినంత కాలం.. ఇండియా–-పాకిస్థాన్​ మధ్య శాంతి నెలకొనడం అసాధ్యమని చెప్పారు. అందువల్ల శాంతిని కొనసాగించాల్సిన బాధ్యత పాక్​పైనే ఉందని, అందువల్ల టెర్రర్​ సంస్థలను నేలమట్టం చేస్తామని నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఆ దేశంపైనే ఉందని తెలిపారు.