డబుల్​ బాదుడు! ఫీజులు భారీగా పెంచనున్న ఇంజనీరింగ్​ కాలేజీలు

హైదరాబాద్​, వెలుగు: ఆరు ప్రైవేట్​ ఇంజనీరింగ్​ కాలేజీల్లో ఫీజుల మోత మోగనుంది. గత బ్లాక్​ పీరియడ్​లో నిర్ణయించిన ఫీజు గడువు ముగియడంతో ఫీజులు పెంచాలని కోరుతూ ఆరు కాలేజీలు కోర్టు మెట్లెక్కాయి. దీంతో కొన్ని షరతులతో ఫీజును పెంచుకునేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఆ ఆరు కాలేజీలకు అనుకూలంగా తీర్పు రావడంతో మరో 50 కాలేజీలూ అదే బాటలో వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. రాష్ట్ర అడ్మిషన్లు​,​ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్​ఆర్​సీ)కి చైర్మన్​ లేకపోవడమే ఈ ఫీజుల పెంపుకు కారణమన్న విమర్శలొస్తున్నాయి. మూడేళ్ల కింద 2016–17 నుంచి 2018–19 విద్యా సంవత్సరం వరకు ఇంజనీరింగ్​ సహా అన్ని వృత్తి విద్యా కాలేజీల ఫీజులను  ఏఎఫ్​ఆర్​సీ నిర్ణయించింది. కన్వీనర్​ కోటాలో ₹35 వేల నుంచి ₹1.13 లక్షల వరకు ఫీజుకు పరిమితిని పెట్టింది. ప్రస్తుతం ఆ గడువు తీరిపోయింది.

కొత్త ఫీజులను నిర్ణయించాలి.  కానీ ఏఎఫ్​ఆర్​సీ చైర్మన్​ లేక.. కాలేజీల ఆదాయ వ్యయాలను ఉన్నత విద్యామండలి సేకరించింది. విద్యా సంవత్సరం మొదలవుతున్నా  ఏఎఫ్​ఆర్​సీకి చైర్మన్​ ను నియమించక పోవడంతో పాత ఫీజులనే కొనసాగిస్తారన్న ప్రచారం జరిగింది. దీంతో వర్థమాన్​ ఇంజనీరింగ్​ కాలేజీ, గోకరాజు రంగరాజు ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇంజనీరింగ్​ అండ్​ టెక్నాలజీ, శ్రీనిధి ఇనిస్టిట్యూట్​ ఆఫ్​​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ, సీవీఆర్​ ఇంజనీరింగ్​ కాలేజీ, కేశవ్ ​మెమోరియల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ, గీతాంజలి కాలేజ్​ ఆఫ్​ ఇంజనీరింగ్​ అండ్​ టెక్నాలజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఆ కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులకు హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. భవిష్యత్తులో మాత్రం ఏఎఫ్​ఆర్​సీ నిర్ణయానికి లోబడే ఫీజులు ఉండాలని షరతు పెట్టింది. ఇప్పుడున్న ఫీజు కన్నా తక్కువగా నిర్ణయిస్తే, విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులో మిగతా మొత్తాన్ని తిరిగిచ్చేయాలని సూచించింది.

అయితే, తీర్పుపై అప్పీల్​కు వెళ్లే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఫీజుల పెంపుపై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో, కాలేజీలే అధికారికంగా 5 శాతం పెంచుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ, దానికి మేనేజ్​మెంట్లు ఆసక్తి చూపించట్లేదు. దీంతో ఆ ఆరు కాలేజీల తరహాలోనే ఇప్పుడు మరో 50 కాలేజీలూ హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. రెండు మూడు రోజుల్లో కోర్టుకు వెళతామని ఓ కాలేజ్​ ప్రతినిధి తెలిపారు.

Latest Updates