జాబ్ ఆఫర్లు లేని కోర్సులు గల్లంతేనా..?

engineering courses which don't have job offers

న్యూఢిల్లీ:  ఇంజనీరింగ్ ఇన్‌‌స్టిట్యూట్లలో కంపెనీల హడావుడి ముగుస్తోంది. విద్యార్థులు చేతిలో ఇంజనీరింగ్ పట్టాతో పాటు ఉద్యోగ ఆఫర్‌ నూ పట్టేశారు. ఈ ప్లేస్‌మెంట్ సీజన్ ముగుస్తోన్న నేపథ్యంలో ఉద్యోగ ఆఫర్లు తక్కువగా వస్తోన్న కొన్ని కోర్సులను తీసివేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చేసింది. అయితే ఉద్యోగ ఆఫర్లు తక్కువగా వస్తున్నప్పటికీ ఆయా ప్రొగ్రామ్‌లను విత్‌ డ్రా చేసేందుకు ఇంజనీరింగ్‌ కాలేజీలు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. వాటిలో ఓషియానిక్, అగ్రికల్చర్ , ఇన్‌‌స్ట్రుమెంటేషన్, మెటీరియల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల్లో చాలా ఖాళీలు కూడా ఉన్నాయి. ఈ కోర్సు విద్యా ర్థుల కోసం ఇన్‌‌స్టిట్యూట్లకు వస్తోన్న కంపెనీలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కోర్సుల్లో చేరేవారులేక 60 శాతం సీట్లు ఖాళీగా పడి ఉన్నాయి. ఈ కోర్సులను రద్దు చేసే విషయంపై ఐఐటీల బోర్డులకు, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు మధ్య వివాదం నడుస్తూనే ఉంది. కేంద్ర నిధులతో ఐఐటీల్లో చాలా కోర్సులు భారీ సబ్సిడీతో అందుబాటులోఉంటున్నాయి. ఐఐటీలు సంబంధిత కోర్సులను, పాపులర్ కోర్సులను మాత్రమే ఆఫర్ చేయాలని మంత్రిత్వ శాఖ కోరుతోంది.

అయినా కొనసాగుతున్న కోర్సులు

ఇంజనీరింగ్ డొమైన్‌‌లో ఐఐటీలు, ఇతర ఇంజనీరింగ్ ఇన్‌‌స్టిట్యూట్లు 14 నుంచి 15 స్పెషలైజేషన్ కోర్సులను ఆఫర్ చేస్తుంటాయి. వాటిలో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ వంటివి పాపులర్. మిగతా కొన్ని కోర్సుల నుంచి నెగిటివ్ సిగ్నల్స్ వస్తున్నప్పటికీ వాటిని ఇన్‌‌స్టిట్యూట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఐఐటీల్లో సుమారు 11,500 సీట్లు ఉన్నాయి. ప్రతేడాది వీటిల్లో చేరడానికి 12 లక్షల మంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఎక్కువగా పాపులర్ అయిన కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వ సబ్సిడీని ఉపయోగించాలనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ తక్కువ పాపులర్ అయిన కోర్సును విద్యార్థి ఎంపిక చేసుకున్నా, వారికి ఉద్యోగం దొరకడం కష్టతరమవుతోంది.

Latest Updates