పాకెట్ మనీ కోసం : గంజాయి అమ్ముతున్న బీటెక్ స్టూడెంట్

మేడ్చల్ జిల్లా : హైదరాబాద్ సిటీ శివారులో గంజాయి స్మగ్లింగ్ కోసం విద్యార్థులను వాడుకుంటున్నారు అక్రమ వ్యాపారులు. ఈ ఉదయం ఘట్ కేసర్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని బోడుప్పల్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్న టైమ్ లో ఓ విద్యార్థి రెడ్ హ్యాండెడ్ గా గంజాయితో దొరికాడు.

బోడుప్పల్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఘట్ కేసర్ సీఐ మల్లయ్య అతని బృందంతో అనుమానిత వాహనాలను తనిఖీలు చేశారు. కొర్ర సందేశ్ అనే యువకుడు ప్రయాణిస్తున్న స్కూటీని కూడా చెక్ చేశారు. వాహనం డిక్కీలో రెండున్నర కేజీల గంజాయిని పట్టుకున్నారు. స్కూటీ, సరుకు, ఓ స్మార్ట్ ఫోన్ ను సీజ్ చేసిన పోలీసులు.. స్టూడెంట్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

సందేశ్ ది పాల్వంచ. సిటీలోని కాచీగూడలో ఉఁటూ.. ఇంజినీరింగ్ చేస్తున్నాడు. వైజాగ్ నుంచి కేజీ 5వేల రూపాయలకు గంజాయి తెస్తుంటారనీ.. దీనిని తాను ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతానని అతడు పోలీసులకు చెప్పాడు. ఖర్చుల కోసం.. పాకెట్ మనీ కోసం తాను గంజాయి అక్రమంగా అమ్ముతున్నానని పోలీసులకు చెప్పాడు ఆ స్టూడెంట్. శివారు ప్రాంతాలనుంచి గంజాయి సరఫరా ఎక్కువగా ఉందని తెలుసుకున్న పోలీసులు… తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు.

Latest Updates