వీగన్‌‌ క్రికెట్‌‌ బాల్స్‌‌ వచ్చేసాయ్‌‌

లండన్‌‌: జంతువుల నుంచి సేకరించిన పదార్థాలు లేకుండా పూర్తిగా కూరగాయలు, ఆకుకూరలు తినేవారి (వీగన్‌‌) సంఖ్య పెరిగిపోతోంది. విరాట్‌‌ కోహ్లీ సహా పలువురు ఆటగాళ్లు కూడా వీగన్స్‌‌గా మారిపోయారు. వీగనిసమ్‌‌ను ప్రోత్సహించేందుకు ఇంగ్లండ్‌‌కు చెందిన ఎర్లీ క్రికెట్‌‌ క్లబ్‌‌ వినూత్న ప్రయోగం చేసింది. క్రికెట్‌‌లో వాడే లెథర్‌‌ బాల్స్‌‌ స్థానంలో వీగన్‌‌ బాల్స్‌‌ తయారుచేయించింది. సాధారణంగా క్రికెట్‌‌ బాల్స్‌‌ను జంతువుల చర్మంతో తయారు చేస్తారు. అయితే ఎర్లీ క్లబ్‌‌ మాత్రం తోలు స్థానంలో రబ్బర్‌‌, సింథటిక్‌‌ను ఉపయోగించి బాల్స్‌‌ తయారుచేయించింది. తమ క్లబ్‌‌లో జరిగే మ్యాచ్‌‌ల్లో ఈ వీగన్‌‌ బాల్స్‌‌నే ఉపయోగిస్తోంది.

రెగ్యులర్‌‌ వాటితో పొలిస్తే ఈ వీగన్‌‌ బాల్స్‌‌.. ఎక్కువ బౌన్స్‌‌ అవుతాయని, గ్రిప్‌‌ దొరకబుచ్చుకోవడం కాస్త కష్టమని క్లబ్‌‌ నిర్వాహకులు చెబుతున్నారు. లండన్‌‌కు 64 కిలోమీటర్ల దూరంలో 12 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఎర్లీ క్లబ్‌‌లో కొన్నేళ్ల ముందు దాకా ఆటగాళ్లకు మాంసాహారం అందించేవారు. క్లబ్‌‌ యజమాని గ్యారీ షేక్‌‌లేడికి కూడా టీ, హామ్‌‌ శాండ్‌‌విచ్‌‌(పంది మాంసంతో తయారు చేసినది) అంటే చాలా ఇష్టం. తొలుత వీగన్‌‌గా మారిన గ్యారీ తన క్లబ్‌‌లోని ఆటగాళ్లను కూడా ఆ దిశగా ప్రోత్సహించాలని అనుకున్నాడు. టీ నుంచి శాండ్‌‌విచ్‌‌ దాకా క్లబ్‌‌లో అందించే ఏ ఆహారంలోను జంతువుల నుంచి సేకరించిన ఉత్పత్తులు లేకుండా తయారు చేయించడం మొదలుపెట్టాడు. తమ జట్టుతో ఆడడానికి వచ్చిన టీమ్‌‌లకు కూడా అదే ఆహారం వడ్డించడం మొదలుపెట్టారు.

Latest Updates