న్యూఢిల్లీ: శత్రు దేశాల దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే అన్నారు. ఈస్టర్న్ లడఖ్ ప్రాంతంలో చైనాతో ఘర్షణల నేపథ్యంలో ఆ ఏరియాలో భారీగా సైన్యాన్ని మోహరించామని తెలిపారు. దాదాపుగా 50 వేల నుంచి 60 వేల మంది జవాన్లు తూర్పు లడఖ్ సరిహద్దుల్లో నిత్యం పహారా కాస్తున్నారని చెప్పారు. సరిహద్దుల్లో చైనా కదలికల నేపథ్యంలో నరవాణే వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి.
చైనాతో విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని నరవాణే స్పష్టం చేశారు. దౌత్య, మిలటరీ చర్చల ద్వారా సమస్యను కొలిక్కి తెచ్చేందుకు యత్నిస్తున్నామని వివరించారు. కాగా, సరిహద్దులో చైనా మళ్లీ ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. దాదాపు ఏడాది పాటు సరిహద్దుల్లో ఘర్షణలకు కారణమైన డ్రాగన్ సైన్యం.. మళ్లీ తూర్పు లడఖ్ సమీపంలో తన కార్యకలాపాల్ని చేపడుతోందని సమాచారం. చైనా బలగాలు తమ భాభాగంలో 100 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
