ప‌ది రోజుల్లో రూ.279 కోట్ల‌ పీఎఫ్ విత్ డ్రా: ఇంకా లక్ష‌లాది ఉద్యోగుల రిక్వెస్ట్

క‌రోనా ఎఫెక్ట్ తో ఉద్యోగులు భారీగా ఈపీఎఫ్ సొమ్మును విత్ డ్రాయ‌ల్ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ కార‌ణంగా ప‌లు కంపెనీలు నష్టాల్లోకి జారిపోవ‌డంతో ఉద్యోగుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌డంలేదు. దీంతో మూడు నెల‌ల బేసిక్ జీతం, డీఏ లేదా మొత్తం పీఎఫ్ లో 75 శాతం, రెండింటిలో ఏది త‌క్కువ ఉంటే ఆ సొమ్మును విత్ డ్రా చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తూ గ‌త నెల 26న కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న స్కీంను వినియోగించుకుంటున్నారు వేత‌న జీవులు.
మార్చి 29 నుంచి విత్ డ్రాయ‌ల్ రిక్వెస్ట్ ల‌ను తీసుకోవ‌డం మొద‌లు పెట్టింది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ (ఈపీఎఫ్ఓ). ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు నాలుగు ల‌క్ష‌ల మంది త‌మ పీఎఫ్ డ‌బ్బును తీసుకునేందుకు ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని తెలుస్తోంది. అందులో గ‌డిచిన ప‌ది రోజుల్లోనే ల‌క్షా 37 వేల మంది ఉద్యోగులకు సంబంధించిన‌ రూ.279.65 కోట్ల పీఎఫ్ క్లెయిమ్స్ పూర్తి చేసిన‌ట్లు ఈపీఎఫ్ఓ ప్ర‌క‌టించింది. రిక్వెస్ట్ వ‌చ్చిన 72 గంట‌ల్లోనే ప్రాసెస్ పూర్త‌యిపోతున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఎన్పీఎస్ విత్ డ్రాయ‌ల్ కూ ఓకే

క‌రోనా ట్రీట్మెంట్, ఇత‌ర అవ‌స‌రాల కోసం నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్ లో డిపాజిట్ అయిన సొమ్ములో కొంత భాగాన్ని ఉద్యోగులు విత్ డ్రా చేసుకునే అవ‌కాశం క‌ల్పించింది ప్ర‌భుత్వం. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను శుక్ర‌వారం జారీ చేసింది పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్మెంట్ అథారిటీ (PFRDA). క‌రోనా వైర‌స్ ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రాణాంత‌క వ్యాధిగా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఎన్పీ ఎస్ మెంబ‌ర్లు దీని బారిన‌ప‌డితే చికిత్స, ఇత‌ర ఖ‌ర్చుల కోసం త‌మ సొమ్ములో నుంచి కొంత భాగాన్ని విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించిన‌ట్లు పేర్కొంది. ఎన్పీఎస్ మెంబ‌ర్ భార్య లేదా పిల్ల‌లు ఈ విత్ డ్రాయ‌ల్ రిక్వెస్ట్ పెట్టే అవ‌కాశం ఇస్తున్న‌ట్లు తెలిపింది. అయితే ఈ విత్ డ్రాయ‌ల్ స‌దుపాయం అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న్ మెంబ‌ర్ల‌కు లేద‌ని ఉత్త‌ర్వుల్లో చెప్పింది PFRDA.

Latest Updates