అప్పుడు కేసీఆర్‌‌ను బండ బూతులు తిట్టిన

‘భగీరథ’ నచ్చి టీఆర్‌‌ఎస్‌‌లో చేరా: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్‌‌ను బండబూతులు తిట్టానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు గుర్తు చేసుకున్నారు. నాటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశానని, కానీ మిషన్ భగీరథ పథకం అమలు తీరు చూసి టీఆర్ఎస్‌‌లో చేరానని చెప్పారు. అసెంబ్లీ లాబీల్లో కొప్పుల ఈశ్వర్, సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఆయన చిట్‌ చాట్ చేశారు. భగీరథ నీళ్లు రావడం లేదని కాంగ్రెస్ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి చెప్పిన అంశం వాళ్ల మధ్య చర్చకొచ్చింది. ‘భగీరథ లేనప్పుడు ప్రతి ఎండకాలంలో ప్రతి ఊరిలో నీటి సమస్య ఉండేది. బోర్లు వేసేందుకు రూ. కోట్లు ఖర్చయ్యేది. ఇప్పుడు ఆ సమస్య లేదు’ అని దయాకర్‌‌రావు అన్నారు. వెంకట వీరయ్య స్పందిస్తూ ‘కోమటిరెడ్డి మాటల్లో నిజం ఉంది. ఇండ్లకు నీళ్లు రాక ముందే నీళ్లొచ్చినట్టు ప్రజల నుంచి సంతకాలు తీసుకోవడం బాగలేదు’ అన్నారు. ఈ విషయాన్ని ఖమ్మం జిల్లా మిషన్ భగీరథ రివ్యూలో సీఎంకు వివరిస్తానని తెలిపారు.

Latest Updates