పరిహారం ఇవ్వకుండా పనులేంది?

కొండపాక, వెలుగు: పూర్తిస్థాయిలో పరిహారం అందించేవరకు పనులు కొనసాగనిచ్చేది లేదంటూ ఎర్రవెల్లి గ్రామస్తులు మంగళవారం మల్లన్న సాగర్ పనులను అడ్డుకున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని ఎర్రవెల్లి గ్రామంలో సుమారు మూడు వేల ఎకరాల వరకు మల్లన్న సాగర్ కు ప్రభుత్వం తీసుకుంది. గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతుండడంతో గ్రామస్తులందరికీ పరిహారం అందించి తరలించాల్సి ఉంది. పరిహారం అంది స్తామని సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ తమకు రావాల్సిన బకాయిలను పూర్తిస్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కన్​స్ట్రక్షన్, ఓపెన్ ల్యాండ్, 18 ప్లస్ ప్యాకేజీ,ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వెంటనే విడుదల చేయాలని, త మకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను
తమకే ఇవ్వాలని అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న తొగుట ఎస్సై శ్రీనివాస్, ఐపీఎస్ అ ధికారి మహదేవ్, తహసీల్దార్​తో వాగ్వివాదానికి దిగారు. పూర్తిస్థాయి పరిహారం అందించేవరకు పనులను కొనసాగినివ్వబోమని  గ్రామస్తులు తేల్చి చెప్పారు.

పరిహారం విషయంలో అన్యాయం

మల్లన్న సాగర్ లో ఎర్రవల్లి గ్రామానికి సంబంధించి సుమారు మూడు వేల ఎకరాల వరకు భూమి, 800 ఇండ్లు ముంపునకు గురవుతున్నాయి. మూడు వేల ఎకరాల్లో చెట్లకు, బావులకు పరిహారం పూర్తిగా చెల్లించారు. ఇండ్లు కోల్పోతున్న వారికి మాత్రం కొంతమందికి పరిహారం చెల్లించలేదు. 18 సంవత్సరాలు నిండిన వారందరికి ఐదు లక్షల ప్యాకేజీ ఇస్తామని ప్రకటించినా పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. ఐదు లక్షల ప్యాకేజీకి సంబంధించి 2016  సంవత్సరం కట్ అఫ్​డేట్​గా పెట్టడంతో ఈ నాలుగేళ్లలో 18 సంవత్సరాలు నిండినవారికి అన్యాయం జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఇల్లు ఉండి బతుకుదెరువు కోసం వలస వెళ్లిన వారికి పరిహారం అందించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 కుటుంబాలకు నయాపైసా పరిహారం అందలేదని, భూములు కోల్పోతున్న వారందరికి పరిహారం అందించాలని కోరుతున్నారు.

Latest Updates