ఏపీలో భారీ ఈఎస్ఐ స్కామ్.. అక్కడా.. ఇక్కడా అవే కంపెనీలు

  • రూ.975 కోట్ల కొనుగోళ్లలో రూ.70 కోట్ల అవినీతి
  • ముందస్తు కొనుగోళ్లతో సర్కారుకు రూ.324 కోట్ల నష్టం
  • బయటపెట్టిన విజిలెన్స్‌, పలు ఆస్పత్రుల్లో రికార్డులు స్వాధీనం
  • తెలంగాణ ఈఎస్‌ఐ స్కామ్‌లో ఉన్న కంపెనీలపైనే అక్కడా ఆరోపణలు

అమరావతి/హైదరాబాద్​, వెలుగు: ఏపీలోనూ భారీ ఈఎస్ఐ స్కామ్‌ బయటపడింది. 2014  –2019 మధ్య ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో మందులు, పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఏపీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆరేళ్లలో ఖర్చు చేసిన రూ.975 కోట్లలో రూ.70 కోట్ల మేర అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా తేల్చిన అధికారులు.. రూ.324.04 కోట్లకు సంబంధించిన కొనుగోళ్లపై లోతుగా విచారణ జరుపుతున్నారు. గత 15 రోజులుగా విజిలెన్స్‌ అధికారులు పలు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టి ఈ స్కామ్‌ను బయటకు తీశారు. మొత్తం నాలుగు ఈఎస్‌ఐ హాస్పిటల్స్‌, 3 డయాగ్నస్టిక్‌ సెంటర్లు, 78 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు మందులు, పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని నివేదిక రూపొందించినట్లు సమాచారం. డాక్టర్‌ బీ.రవికుమార్‌, సీకే.రమేష్‌, జి.విజయ్‌ కుమార్‌ డైరెక్టర్లుగా కొనసాగిన టైమ్‌లోనే అక్రమాలు జరిగినట్లు రికార్డుల ఆధారంగా గుర్తించారు. మన రాష్ట్ర ఈఎస్‌ఐ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓమ్ని మెడి, లెజెండ్ ఫార్మా కంపెనీల నుంచే ఈఎస్‌ఐ అధికారులు మందులు, కిట్స్ కొనుగోలు చేసినట్టు తేలింది.

 ఇలా జరిగింది..

2014 నుంచి 2019 మధ్య ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో మందుల కొనుగోళ్లకు ప్రభుత్వం రూ.293.51 కోట్లు కేటాయించింది. ఈ  కేటాయింపుల కంటే అధికంగా రేట్‌ కాంట్రాక్టు, నాన్‌ రేట్‌ కాంట్రాక్టు కింద పలు సంస్థల నుంచి రూ.698.36 కోట్ల విలువైన మందులను కొన్నారు. అంటే ప్రభుత్వం కేటాయించిన దాని కంటే రూ.404.86 కోట్ల అదనపు కొనుగోళ్లు చేశారు. నాన్‌ రేట్‌ కాంట్రాక్టు సంస్థల నుంచి రూ.89.58 కోట్ల మందుల విలువ.. రేట్‌ కాంట్రాక్టు సంస్థల నుంచి కొనుగోలు చేస్తే రూ.38.56 కోట్లే అవుతుంది. కానీ అదనంగా రూ.51.02 కోట్లు చెల్లించారు. ఇక పరికరాలను ఏ టెండర్లూ పిలువకుండా అప్పటి కార్మిక శాఖ మంత్రి సిఫారసు లేఖతో నామినేషన్‌ పద్ధతిలో లెజెండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఎవంటర్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓమ్ని మెడి సంస్థల నుంచి రూ.237 కోట్లు వెచ్చించి కొన్నారు. వీటిని అసలు రేటు కంటే 36 శాతం అధిక రేటుకు కొన్నట్టు విజిలెన్స్ గుర్తించింది. రూ.47.77 కోట్ల విలువ చేసే సర్జికల్‌ పరికరాలనూ నాన్‌ రేట్‌ కాంట్రాక్టు సంస్థల నుంచే టెండర్లకు వెళ్లకుండా కొన్నారు. డిస్పోజల్‌ సిరంజీలు, ఐవీ కిట్స్‌, బ్యాండేజ్‌, డిస్పోజల్‌ ఫేస్‌మాస్క్‌, బీపీ బ్లేడ్స్‌, క్లినికల్‌ థర్మామీటర్‌, లేక్టస్‌ గ్లౌజ్‌ల కోసం మరో రూ.10.43 కోట్లు అదనంగా చెల్లించారు. వీటిని రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తే రూ.8.6 కోట్లకే వచ్చేవని అధికారులు గుర్తించారు. రూ.6.62 కోట్ల విలువైన ఫర్నీచర్‌ను టెండర్లు లేకుండా మార్కెట్‌ ధరకు 70 శాతం అదనంగా చెల్లించి కొన్నారు. మందులు మినహా ల్యాబ్ ఎక్విప్మెంట్ కావాలని ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు, ఆస్పత్రుల నుంచి ప్రతిపాదనలు రాకుండానే కొనుగోళ్లు చేశారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ ముందస్తు కొనుగోళ్ల ద్వారా ప్రభుత్వానికి రూ.324 కోట్ల మేర నష్టం వచ్చిందని ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం రూ. 975 కోట్ల కొనుగోళ్లలో రూ.70 కోట్లు అధిక ధర చెల్లించినట్లు విజిలెన్స్ తేల్చింది.

ఇందులో ఎవరున్నా వదలం

మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ ఈ స్కామ్‌లో ఉన్నారు. అధికారుల్ని బెదిరించి తమ కంపెనీలకు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇప్పించారు. నెలకు రూ.75 లక్షలు దోచుకోవాలనే ఉద్దేశంతోనే అచ్చెన్నాయుడు సిఫారసు లేఖ ఇచ్చారు. ఇందులో అక్రమాలకు పాల్పడిన ఎవరినీ వదలం.

– ఏపీ మంత్రి జయరామ్‌

నాకేం సంబంధం

ఈ స్కామ్‌కు, నాకు ఎటువంటి సంబంధం లేదు. కేంద్రం సూచనల మేరకు తెలంగాణలో అమలవుతున్న టెలీ హెల్త్ సర్వీసెస్‌నే ఏపీలోనూ ప్రవేశపెట్టాలని సిఫారస్‌ చేశా. ఈ క్రమంలోనే నామినేషన్ పద్ధతిలో కంపెనీలను ఎంపిక చేయాలని ఈఎస్ఐ డైరెక్టర్‌కు మంత్రిగా లేఖ రాశా. ఏ సంస్థకు టెండర్లు లేకుండా కాంట్రాక్టు కేటాయించమని చెప్పలేదు.

– మాజీ మంత్రి అచ్చెన్నాయుడు

Latest Updates