ఆనాటి వైభవానికి ఆఖరి రోజులు

అద్భుతాలను సృష్టించటం ఎంత కష్టమో వాటిని కాపాడుకోవటం కూడా అంతే కష్టంగా మారింది.  ముంబై  మహానగరంలోని అలాంటి అద్భుతాల్లో ‘ఎస్‌ప్లనైడ్‌​ మాన్షన్‌’ కూడా ఒకటి. ఈ బిల్డింగ్​కి 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. మరెన్నో  ప్రత్యేకతలు దీని సొంతం. అవన్నీ కొద్ది రోజుల్లో చరిత్రలో కలిసిపోనున్నాయి.  మహారాష్ట్ర సర్కారు ఏం చేస్తుందనే సస్పెన్స్ సిటీ జనాల్లో నెలకొంది.

సౌత్​ ముంబైలోని కాలా ఘోడా ఏరియాలో ఉన్న ఈ పెద్ద బిల్డింగ్​ పేరు ఎస్‌ప్లనైడ్‌ మాన్షన్​. దీన్ని 1871లో క్యాస్ట్​ ఐరన్ ​(పోత ఇనుము)తో కట్టారు. ఇండియాలోని ఈ తరహా నిర్మాణాల్లో ఇదే ఓల్డ్​. ఈ భవనానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది మన దేశంలోనే మొదటి లగ్జరీ హోటల్​. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ కాంప్లెక్స్​లోని ఒక రూమ్​లోనే సినిమాల్ని ప్రదర్శించారు. ఈ బిల్డింగ్​ ప్రస్తుతం ‘వరల్డ్ మోస్ట్​ ఎన్​డేంజర్డ్ మాన్యుమెంట్స్​’ లిస్టులోకి చేరిపోయింది.

1960 నాటికి ఈ బిల్డింగ్‌ వయసు 90 ఏళ్లు పైబడింది. అందులోని రూమ్​లను కమర్షియల్​గా, రెసిడెన్షియల్ పరంగా అద్దెలకు ఇవ్వటంతో   పాడుబడటం మొదలైంది. ఎస్‌ప్లనైడ్‌ మ్యాన్షన్​ డ్యామేజ్​ అవుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏ క్షణంలోనైనా కూలే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. సరిగ్గా ఏడాది క్రితం ఈ బిల్డింగ్​లోని ఓ బాల్కనీ కూలిపోవటంతో ఒక వ్యక్తి కిందపడి చనిపోయాడు. ఈ ఘటనను మహారాష్ట్ర హౌసింగ్​ అండ్​ ఏరియా డెవలప్​మెంట్​ అథారిటీ సీరియస్​గా తీసుకుంది.  కాంప్లెక్స్​లో అద్దెకు ఉంటున్నవాళ్లను అప్పటినుంచి ఖాళీ చేయించటం ప్రారంభించింది. ఈ పాత బిల్డింగ్​ని రిపేర్​ చేయాల్సి ఉందని, అందుకే అందరినీ పంపించేస్తున్నామని అప్పట్లో చెప్పుకొచ్చింది. ‘ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ–ముంబై’ పోయిన నెలలో ఈ కట్టడానికి సంబంధించి ఒక రిపోర్ట్​ని రిలీజ్​ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్‌ప్లనైడ్‌ మాన్షన్​ని కూల్చివేయటమే కరెక్ట్​ అని తేల్చిచెప్పింది.​ రిపేర్​ కోసం ప్రయత్నించటం లాజికల్​గా, ఎకనామికల్​గా సరికాదని, నిర్మాణపరంగా చూస్తే అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది.

హైకోర్టు నిర్ణయంతో అంతా షాక్​
ఈ బిల్డింగ్​ని ఏం చేయాలనేదానిపై తుది నిర్ణయాన్ని బాంబే హైకోర్టు మహారాష్ట్ర హౌసింగ్​ అథారిటీకే వదిలేసింది. భవనాన్ని కూల్చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్త చర్యలనుమాత్రం చెప్పాలని కోరింది. హైకోర్టు ఇలా అనటం సిటీలోని హిస్టారియన్లు, ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు, హెరిటేజ్​ ప్రేమికుల్ని షాక్​కి గురి చేసింది. మాన్షన్​ని కూల్చేయకుండా బాగు చేయాలని ఎక్స్​పర్ట్​లు సూచిస్తున్నారు. ఇలాంటి ‘లివ్డ్​–ఇన్​​ హెరిటేజ్​ స్ట్రక్చర్ల’ను స్టేట్​ సర్కార్​,​ సివిక్​ అథారిటీ పట్టించుకోకపోతే వారసత్వ సంపదను కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చట్టమూ కారణమే
ముంబైలోని అతి పురాతన బిల్డింగ్​లు పాడుబడిపోవటానికి ‘ది మహారాష్ట్ర రెంట్​ కంట్రోల్​ యాక్ట్​–1999’ కూడా ఒక కారణమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చట్టం ప్రకారం అద్దెలను ఓనర్లు ఇష్టమొచ్చినట్లు పెంచటానికి వీల్లేదు. దీంతో ఇలాంటి హెరిటేజ్​ బిల్డింగ్​ల మెయింటనెన్స్​ ఖర్చులను యజమానులు భరించలేకపోతున్నారు. రెంట్​కి ఉండేవాళ్లేమో హౌసింగ్​ అథారిటీ ఆధ్వర్యంలోని రిపేర్​ ఫండ్​కి కొద్ది మొత్తంలోనే సెస్​ కడుతున్నారు. ఫలితంగా ఆ అథారిటీ ఇలాంటి కట్టడాల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేకపోతోంది.

130 రూములు.. 20 సూట్లు..
ఎస్‌ప్లనైడ్‌ మాన్షన్​కి సంబంధించిన ఆర్కిటెక్చరల్​, కల్చరల్​ అంశాలను ‘బాంబే గొథిక్’ బుక్​లో క్రిస్టోఫర్​ లండన్​ అనే రైటర్​ రాశారు​. అరుదుగా దొరికే పోత ఇనుముతో కట్టిన ఈ బిల్డింగ్​కి 1860లో రౌలాండ్​ మ్యాసన్​ ఆర్డిష్ అనే బ్రిటిష్​ ఇంజనీర్​ డిజైన్​ చేశాడు. కన్​స్ట్రక్షన్​ మెటీరియల్​ని ఇంగ్లండ్​ నుంచి తెప్పించి ఇక్కడ అసెంబుల్​ చేశారు. ఈ కాంప్లెక్స్​లో 130 రూమ్​లు, 20 సూట్లు ఉన్నాయి. ఒక పెద్ద బారు, ఆరు బిలియర్డ్​ టేబుళ్లు; హ్యాండ్​సమ్​ డైనింగ్​ రూమ్​ ఏర్పాటు చేశారు. ఫర్నీచర్, ఉడ్​ ఫినిషింగ్​ వర్క్​ కోసం టేకు, దేవదారు కలపను వాడారు.

జంషెడ్​ టాటా కోపానికి కారణం
ఈ మాన్షన్​ పేరు తొలి రోజుల్లో వాట్సన్స్​​ హోటల్.​ నాడు ఇండియాను బ్రిటిషర్లు పాలించేవారు.  బ్రిటిష్‌ ఇండియా జమానాలో లగ్జరీ సౌకర్యాలు ఈ హోటల్​లో తప్ప మరెక్కడా లేవు. అందువల్ల ఈ హోటల్​లోకి యూరోపియన్లను మాత్రమే రానిచ్చేవారు. ఒకసారి మన దేశ పారిశ్రామిక పితామహుడు జంషెడ్​ టాటానికూడా రానివ్వలేదు. దీంతో ఆయన పట్టుబట్టి 1903లో తాజ్​ మహల్​ ప్యాలెస్​ హోటల్​ని కొలాబా (ముంబై)లో కట్టించారు. సాహసంతో బ్రిటిష్​వాళ్లను ఎదిరించి నిలిచారు. వాట్సన్స్​ హోటల్​ 1920లో మూతపడింది. ఆ బిల్డింగ్​ని తర్వాత వేరేవాళ్లకు అమ్మేశారు. 1944 నుంచి ఎస్‌ప్లనైడ్‌ మాన్షన్​గా​ వ్యవహరిస్తున్నారు. మునిసిపల్​​ కమిటీ దీనికి గ్రేడ్​–2 హెరిటేజ్ స్ట్రక్చర్ హోదా ఇచ్చింది.

Latest Updates