ఒకరిద్దరు చనిపోతే ఇంత బద్నాం చేస్తరా?

పేషెంట్లు వీడియోలు పెట్టడం.. మీడియా ప్రసారం చేయడం సరికాదు: ఈటల

హైదరాబాద్‌, వెలుగు: చెస్ట్‌ ‌హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన రవికుమార్ విషయంలో సర్కారు నిర్లక్ష్యమేమీ జరగలేదని, సడెన్‌‌గా గుండె ఆగిపోవడం వల్లే ఆయన చనిపోయాడని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ‘‘రవికుమార్‌‌‌‌ అనేక హాస్పిటల్స్‌ ‌తిరిగి, అర్ధరాత్రి చెస్ట్ హాస్పిటల్‌కు వచ్చారు. అయినా అడ్మిట్ చేసుకుని ట్రీట్‌మెంట్ ఇచ్చినం. 24 గంటలు ఆక్సిజన్ పెట్టినం. ఆక్సిజన్ తీసేశారు అనడంలో నిజం లేదు. రవికుమార్ పెట్టిన వీడియోలోనూ.. ఆయన ముక్కుకు ఉన్న ఆక్సిజన్ పైప్ స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా పేషెంట్లు, తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి మాత్రమే హాస్పిటల్స్‌‌లో ఇంటర్నెట్‌ సౌకర్యం, ఫోన్ సౌకర్యం పెట్టినం. ఆక్సిజన్ పెట్టలేదని, డాక్టర్లు చూడడం లేదని వీడియోలు తీసిపెట్టడానికి కాదు. ఇలా సోషల్ మీడియాలో బాధ్యత లేకుండా పెట్టిన వీడియోలను మీడియా క్యారీ చేయడం సరికాదు” అని అన్నారు. కోఠిలోని కరోనా కమాండ్ సెంటర్‌‌‌‌లో సోమవారం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. సర్కార్‌ ‌‌‌దవాఖాన్లలో ట్రీట్‌మెంట్ తీసుకున్న వేల మంది పేషెంట్లు రికవరీ అయి వెళ్లిపోతున్నారని, ఎవరో ఒకరిద్దరు చనిపోతే వాటినే పట్టుకుని బద్నాం చేయొద్దని కోరారు. కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందిస్తూ చెస్ట్ హాస్పిటల్‌లో పనిచేసే నర్సు ప్రాణాలు వదిలారని, అలాంటి వాళ్ల ఆత్మస్థైర్యం దెబ్బ తింటుందన్నారు. దేశంలో
కరోనా డెత్‌‌రేట్ 3 శాతం ఉంటే, మన దగ్గర 1.7 శాతం మాత్రమే ఉందన్నారు. ఎక్కడైన ఒకట్రెండు ఘటనలు జరిగినా, వెంటనే వాటిని సవరించుకుంటున్నామని చెప్పారు.

లక్షణాలు ఉన్న వాళ్లందరికీ టెస్టులు
ఇకపై వేలల్లో కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించినట్లు ఈటల వెల్లడించారు. కరోనా శాంపిల్‌ సెంటర్లను మంగళవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నట్టు తెలిపారు. వైరస్ లక్షణాలు ఉన్న వాళ్లందరికీ టెస్టులు చేయిస్తామని ప్రకటించారు. సింప్టమ్స్ లేకుంటే టెస్టులకు రావొద్దని, ప్రైవేటు ల్యాబ్లకు వెళ్లి డబ్బులు దండగ చేసుకోవద్దని సూచించారు. కరోనా అనుమానితులు కింగ్‌ కోఠి, ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్‌కు రావాలని సూచించారు. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌ లాక్‌‌డౌన్ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉందని, కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉండడం వల్లే కేసులు పెరుగుతున్నాయన్నారు. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఇదే పరిస్థితి ఉందని గుర్తుచేశారు. సిటీలో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో మునుపటిలా కంటైన్‌‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహకారంతో ఆయా ప్రాంతాల ప్రజలను పూర్తిగా ఇంటికే పరిమితం చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో టెస్టుల సంఖ్య పెంచుతామన్నారు.

60 శాతమే అక్యురసీ: స్పెషల్ సీఎస్
కరోనా టెస్టుల్లో 60 శాతం మాత్రమే అక్యురసీ ఉంటుందని స్పెషల్ సీఎస్ శాంతకుమారి తెలిపారు. అందువల్లే కొంతమందికి ఒకసారి పాజిటివ్, మరోసారి నెగటివ్ వస్తోందన్నారు. కరోనా అనుమానితులు అందరూ కింగ్ కోఠి హాస్పిటల్‌కు వెళ్లాలని, 24 గంటల్లో ఎప్పుడొచ్చినా అక్కడ అడ్మిట్ చేసుకుంటారని చెప్పారు.

104కు కాల్ చేయండి: సీఎస్
గ్రేటర్ హైదరాబాద్‌లో 10,666 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇందులో 7,250 యాక్టివ్ కేసులున్నాయని సీఎస్ సోమేశ్‌‌కుమార్‌‌‌‌ వెల్లడించారు. చాలా మందికి హోమ్‌ ఐసోలేషన్‌‌లోనే కరోనా తగ్గిపోతోందన్నారు. హోమ్‌ ఐసోలేషన్‌‌లో ఉన్న వాళ్లలో 26 మంది మాత్రమే హాస్పిటల్స్‌‌కు షిఫ్ట్ అయ్యారని చెప్పారు. హాస్పిటల్‌‌కు వెళ్లాలనుకుంటే 104కు కాల్ చేయాలని, అంబులెన్స్‌‌లోనే హాస్పిటల్‌‌కు చేర్చుతామని సూచించారు. కొత్తగా 150 అంబులెన్స్‌‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.

17,081 బెడ్లు ఉన్నయి
రాష్ర్టంలో కరోనా పేషెంట్లకోసం 17,081 బెడ్లు రెడీగా ఉన్నాయని ఈటల తెలిపారు. ఇందులో 3,500 బెడ్లకు ఆక్సిజన్ సప్లై ఉందని, మరో 6,500 బెడ్లకు ఆక్సిజన్‌‌ సప్లై పెట్టిస్తున్నామని చెప్పారు. వెయ్యి వెంటిలేటర్లు ఉన్నాయని, ప్రస్తుతం గాంధీలో పది మంది మాత్రమే వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నారని చెప్పారు. మొత్తం 9 వేల యాక్టివ్ కేసుల్లో వెయ్యి మంది వరకు ప్రభుత్వ హాస్పిటల్స్‌‌లో, మరో వెయ్యి మంది ప్రైవేటు హాస్పిటల్స్‌‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. చాలా మంది హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉన్నారన్నారు. ప్రైవేటు టీచింగ్ హాస్పిటల్స్‌‌ను కూడా కరోనా ట్రీట్‌మెంట్‌కు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్‌‌కు వెళ్లిడబ్బు వృథా చేసుకోవద్దని, అవసరమైన వాళ్లందరికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను నమ్మొద్దని ప్రజలను కోరారు.

ఇష్టమొచ్చిన ఆస్పత్రికి పోతరు
ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్లకు ఇష్టమైన హాస్పిటల్‌కు వెళ్తారని, ఆ విషయాన్ని పెద్ద సీన్ చేయాల్సిన అవసరం లేదని ఈటల కామెంట్ చేశారు. కొంతమందికి ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారని, వాళ్ల దగ్గరకే వెళ్తారని చెప్పారు. ‘అక్కడికి వెళ్లొద్దు , గాంధీకే రావాలి’ అని చెప్పలేమన్నారు.

For More News..

మోసపూరిత రాజకీయాలకు ప్రతినిధి పీవీ

ఎంట్రెన్స్ టెస్టులు ఉంటయా..? ఉండవా..?

హైదరాబాద్ తాగునీటిపై ఏపీ కిరికిరి

Latest Updates