అద్వానీ లేఖాస్త్రం : మోడీ, అమిత్ షాలే టార్గెట్

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీ లెజెండరీ లీడర్, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం తీరుపై బాంబ్ పేల్చినంత పనిచేశారు. నరేంద్రమోడీ, అమిత్ షాలపై ఆయన పరోక్షంగా విమర్శలుచేస్తూ.. ఓ లేఖ విడుదల చేశారు. ఏప్రిల్ 6న పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన కేడర్ ను ఉద్దేశిస్తూ రాసిన లెటర్ ను తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు.

ఏప్రిల్ 6న బీజేపీ తన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. పార్టీ పరిస్థితిని సమీక్షించుకోవడానికి, అంచనా వేయడానికి ఇది ఒక కీలకమైన సందర్భం. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకడిగా నా అభిప్రాయాలను, అనుభవాలను భారత ప్రజలు, కోట్లాది మంది పార్టీ కార్యకర్తలు, నాకు అత్యంత గౌరవం ఇచ్చినవారితో పంచుకోవాలని భావిస్తున్నా

ఈ భావాలు పంచుకునేముందు… గాంధీ నగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.1991 నుంచి గాంధీ నగర్ ప్రజలు నన్ను వరుసగా గెలిపించి లోక్ సభకు పంపించారు. వారు తమ ప్రేమాభిమానాలతో నన్ను అన్నివేళలా ఆదరించారు

RSSలో 14 ఏళ్లప్పుడే చేరాను. అప్పటినుంచే మాతృభూమికి సేవ చేయడమే నా ఇష్టంగా భావించా. అదే మిషన్ గా నిర్ణయించుకున్నా. మొదట భారతీయ జన సంఘ్ తో… తర్వాత భారతీయ జనతా పార్టీతో… ఏడు దశాబ్దాలుగా పార్టీతో వీడిపోని రాజకీయ అనుబంధం నాది. ఈ రెండు పార్టీల వ్యవస్థాపక సభ్యుల్లో నేనూ ఒకడిని. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్ పేయి లాంటి ఎందరో గొప్ప , స్ఫూర్తిమంతమైన, స్వార్థం లేని నాయకులతో సన్నిహితంగా పనిచేసే అవకాశం రావడం నాకు దక్కిన అరుదైన అదృష్టంగా భావిస్తున్నా.

నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్… సెల్ఫ్ లాస్ట్.. అనే సిద్ధాంతమే నన్ను నడిపించింది. నాకు ఎదురైన అన్ని పరిస్థితుల్లోనూ ఇదే సూత్రానికి కట్టుబడి ఉన్నాను. అనుసరించాను

భిన్నత్వంలో ఏకత్వం… ఏదైనా మాట్లాడగలిగే స్వేచ్ఛ.. ఈ రెండు భారత ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైనవి. బీజేపీ తన ప్రస్థానం ప్రారంభించినప్పటినుంచీ.. రాజకీయంగా తమతో విభేదించినవారిని శత్రువులాగా భావించలేదు. ప్రత్యర్థులుగా మాత్రమే చూశాం. అలాగే… భారతీయత అనే భావనలోనూ.. మనతో రాజకీయంగా ఏకీభవించని వారిని దేశ వ్యతిరేకులుగా ఎన్నడూ చూడలేదు. ప్రతి పౌరుడి వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలను పార్టీ గౌరవిస్తూ వచ్చింది

“ప్రజాస్వామ్య రక్షణ, ప్రజాస్వామ్య సంప్రదాయాలు జాతీయ స్థాయిలో బీజేపీకి గర్వకారణంగా ఉంటూ వస్తున్నాయి. దేశ స్వాతంత్ర్యం, సమగ్రత, న్యాయానికి రక్షణ కల్పించాలని కోరడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది. ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పారదర్శకత, అవినీతి లేని రాజకీయం పార్టీకి ఇతర ప్రాధాన్యాలు”

వాస్తవం, దేశంపట్ల అంకితభావం, పార్టీలోనూ – పార్టీ బయట ప్రజాస్వామ్యం.. పోరాట క్రమంలో బీజేపీని నిలబెట్టిన అంశాలు. వీటన్నింటి సమ్మేళనమే సంప్రదాయ జాతీయవాదం- సురాజ్యం. ఈ అంశాలను నిలబెట్టేందుకే.. ఎమర్జెన్సీ సమయంలో వీరోచిత పోరాటం సాగింది”

“భారత ప్రజాస్వామ్య కట్టడాన్ని నిలబెట్టేందుకు అందరం కలిసి పనిచేయాలనేదే నా వినమ్ర విన్నపం. నిజం, ఎన్నికలే.. ప్రజాస్వామ్యానికి పండుగ లాంటివి. పార్టీలు, మీడియా, సంస్థల్లోని ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా ఆత్మ శోధన చేసుకుని ప్రజాస్వామ్యానికి కాపాడేందుకు ముందుకు రావాలి

అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు.”

ఎక్కడా ఎవరి పేరు చెప్పకపోయినా ఈ లెటర్లో వ్యాఖ్యలు.. నరేంద్ర మోడీ, అమిత్ షాలను ఉద్దేశించి చేసినవే అనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 92 ఏళ్ల వయో భారం కారణంగా ఈసారి గాంధీ నగర్ నుంచి అద్వానీకి టికెట్ నిరాకరించింది పార్టీ. అక్కడి నుంచి అమిత్ షా పోటీ చేస్తున్నారు. మోడీ, షాల హయాంలో పార్టీలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ లేకుండా పోయిందని … ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ఉందని అద్వానీ పరోక్షంగా చెప్పినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest Updates