
న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్లో 24 శాతం వాటాలు కలిగిన గల్ఫ్ క్యారియర్ ఎతిహాద్.. మళ్లీ ఈ ఎయిర్‌లైన్ సంస్థలో ఇన్వెస్ట్ చేయకూడదని నిర్ణయించుకుంది. జెట్ అప్పుల సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరకకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 17న జెట్ ఎయిర్వేస్ నడవలేక మూత పడిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఇప్పుడు ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌లో ఉంది. ఈ క్యారియర్ కోసం మూడు సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. జెట్ అప్పుల విషయంలో ఎలాంటి పరిష్కారం దొరకకపోతుండటంతో, మరోసారి దీనిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌ను దాఖలు చేయలేదని ఎతిహాద్ తన ప్రకటనలో తెలిపింది. జెట్‌ను దక్కించుకునేందుకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ శనివారంతో ముగిసింది.
అయితే ఈ నిర్ణయం ఇండియాలోని పెట్టుబడుల కమిట్మెంట్పై ఎలాంటి ప్రభావం చూపదని ఎతిహాద్ చెబుతోంది. ‘జెట్ సంక్షోభంలో కూరుకుపోయినప్పటి నుంచి ఆ సమస్యలను పరిష్కరించేందుకు అడ్వాన్స్ సొల్యుషన్స్‌ను ఆఫర్ చేశాం. కానీ మైనార్టీ వాటాదారులం అవడం వల్ల, ఎతిహాద్‌కు అవసరమైన మార్పులు చేయడానికి పరిమితమైన సామర్థ్యం మాత్రమే ఉండేది’ అని ఎతిహాద్ తన ప్రకటనలో పేర్కొంది. జెట్‌లో వాటాలు కొనేందుకు తమకు కూడా ఇంట్రెస్ట్ లేదని అనిల్ అగర్వాల్ ప్రకటించారు. కాగా శనివారంతో ముగిసిన బిడ్డింగ్‌లో అనిల్ అగర్వాల్ కూడా బిడ్ వేసిన సంగతి తెలిసిందే.2013లో జెట్ ఎయిర్వేస్లో 24 శాతం వాటాలను ఈ గల్ఫ్ క్యారియర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. జెట్‌లో వాటాలు కొనడానికి ఎతిహాద్ పలు షరతులు పెట్టింది. వాటికి లెండర్స్ ఒప్పుకోకపోవడంతో కేసు ఎన్సీఎల్టీకి వెళ్లింది.