సెక్రటేరియెట్ షిఫ్టింగ్ మరింత లేటు

సెక్రెటేరియెట్ లోని శాఖల తరలింపు మరికొంత లేటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్కే భవన్​లో ఇంకా రెండు శాఖల షిఫ్టింగ్​ పనులే మొదలుకాలేదు, మరికొన్నింటి పనులు సగంలోనే ఉన్నాయి. దానికితోడు శని, ఆదివారాలు సెలవులు కావడంతో అధికారులు, సిబ్బంది వచ్చే పరిస్థితి లేదు. దీంతో బీఆర్కే భవన్​ ఖాళీ అయ్యేందుకే కనీసం పది రోజుల సమయం పడుతుందని.. ఆ తర్వాతే సెక్రెటేరియట్​ నుంచి శాఖల తరలింపు మొదలవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

మరమ్మతులు, అసెంబ్లీ సమావేశాలతోనూ..

రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున శాఖల తరలింపుపై ఎఫెక్ట్​ పడే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా బీఆర్కే భవన్​ను ఖాళీ చేశాక.. క్లీనింగ్, మరమ్మతులు, పెయింటింగ్, ఆధునీకరణ, ఏసీల ఏర్పాటు, డేటా సెంటర్, ఫైళ్లు భద్రపరిచే ర్యాక్​లు, లాకర్ల ఏర్పాటు రక్షణ పరికరాల వంటి ఏర్పాట్ల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరికొన్ని శాఖలు షిఫ్ట్​ కానున్న ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోనూ మరమ్మతులు, ఇతర ఏర్పాట్లకు అధికారులు సిద్ధమవుతున్నారు.

సీసీ టీవీలు, బందోబస్తు..

బీఆర్కే భవన్ నిఘా నీడలోకి వెళుతోంది. ఇప్పటికే భవనాన్ని పరిశీలించిన పోలీసులు.. ట్రాఫిక్​ మళ్లింపులు, ఆంక్షలు, బారికేడ్ల ఏర్పాటు, రోడ్ల మూసివేత, బందోబస్తు ఏర్పాట్లపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. బీఆర్కే భవన్, ఆవరణలో వంద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఇక బీఆర్కే భవన్​లోని 9వ ఫ్లోర్​లో సీఎం ఆఫీసును ఏర్పాటు చేయాలని అధికారులు తొలుత భావించారు. అయితే చుట్టూ ఎత్తైన భవనాలు ఉన్నందున ఆ ఫ్లోర్​ సురక్షితం కాదని భావించిన అధికారులు.. కింది ఫ్లోర్లలో ఎక్కడైనా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

Latest Updates