ఎయిడ్స్ భూతం ఇడుస్తలే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎయిడ్స్ కంట్రోల్ కావట్లేదు. ఏటా10 వేల కొత్త హెచ్ఐవీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. హెచ్ఐవీ కేసుల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాల తర్వాత తెలంగాణే టాప్​లో ఉంది. కొత్త హెచ్ఐవీ కేసుల సంఖ్యను చూస్తే రాష్ట్రంలో గత ఏడాదిలో పెద్దగా మార్పేమీ రాలేదు. ఈ విషయంలో జాతీయ స్థాయి కంటే రాష్ట్రం వెనకబడిపోయింది. ఈ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాల్సి ఉన్నా, అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.

ట్రీట్ మెంట్ తీసుకుంటున్నోళ్లు 88, 800 

రాష్ట్రంలో ఏటా కొత్తగా 10 వేలకు పైగా బాధితులు హెచ్ఐవీ బారిన పడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 5942 మంది హెచ్ఐవీ బాధితులుగా మారారు. ప్రస్తుతం రాష్ట్రంలో1.20 లక్షల మందికి హెచ్ఐవీ సోకినట్లు అంచనా. వీరిలో 88,800 మంది మాత్రమే హెచ్ఐవీ మందులు వాడుతున్నారు. హెచ్ఐవీ సోకినా, ఆ విషయం తెలియనివారు మరో 50 వేల మందికి పైగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించటానికి ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

గ్రేటర్ లోనే ఎక్కువ 

రాష్ట్రంలో గ్రేటర్ హైదరాద్ ప్రాంతంలోనే ఎక్కువగా హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో మూడో వంతు కేసులు ఇక్కడే ఉంటున్నాయి. గ్రేటర్ పరిధిలో సుమారు 24,780 మంది హెచ్ఐవీ పేషంట్లు ఇక్కడే మందులు తీసుకుంటున్నారు. వ్యభిచారం ఎక్కువగా ఉండటం, రక్షణ లేని శృంగారం కారణంగా హెచ్ఐవీ బాధితుల సంఖ్య ఇక్కడే ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. రక్షణ లేని శృంగారం కారణంగానే 98 శాతం హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నాయని, రక్త మార్పిడి, సిరంజీల ద్వారా 2 శాతమే ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

నేడు సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ డే

ఆదివారం వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ అవగాహన ర్యాలీ నిర్వహిస్తామని, తర్వాత రవీంద్ర భారతి లో ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర ఎయిడ్స్ ప్రాజెక్ట్ డెరైక్టర్ ప్రసన్న కుమారి వెల్లడించారు. ఈ ఏడాది హెచ్ఐవీ కేసులను14 శాతం తగ్గించగలిగామన్నారు. గత నెల14 నుంచే హెచ్ఐవీ టెస్ట్​లు చేస్తున్నామని, ఇప్పటికే 50 వేల మందికి టెస్టులు చేసినట్లు తెలిపారు.

Latest Updates