కరోనా ఎఫెక్ట్..స్కూళ్ల నుంచి పెళ్లిళ్ల దాకా అన్నీ బంద్

దేశంలో కరోనాకు ఇంకొకరు బలయ్యారు. ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ ఆర్​ఎంఎల్​ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ తీసుకుంటూ చనిపోయారు. కేసుల సంఖ్య 81కి పెరిగింది. దీంతో రాష్ట్రాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. వైరస్​ మరింత ముదరకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, పబ్బులు, స్విమ్మింగ్​పూళ్లు, బార్లను క్లోజ్​ చేశాయి. కర్నాటక సర్కార్​ కఠిన నిర్ణయాలు తీసుకుంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చేసింది. అంతేకాదు, ఎగ్జిబిషన్లు, సమ్మర్​ క్యాంపులు, కాన్ఫరెన్సులను రద్దు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. అంతేకాదు, కరోనా​ ఎఫెక్ట్​ పెళ్లిళ్లు, బర్త్​డే పార్టీలను వదల్లేదు. ఇకపై ఓ వారం పాటు రాష్ట్రంలో ఎలాంటి పెళ్లిళ్లు, బర్త్​డే పార్టీలను జరపొద్దని కరాఖండిగా తేల్చి చెప్పింది కన్నడ సర్కారు. శుక్రవారం సీఎం బీఎస్​ యెడియూరప్ప రాష్ట్రంలో అన్నింటినీ వారం రోజుల పాటు బంద్​ చేస్తున్నట్టు ప్రకటించారు. షాపింగ్​ మాల్స్​, సినిమా థియేటర్లు, పబ్బులు, నైట్​క్లబ్​లన్నింటినీ మూసేస్తున్నట్టు చెప్పారు.

గుల్బర్గాలో చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు అతడు కాంటాక్ట్​ అయిన 46 మందిని గుల్బర్గాలో క్వారెంటైన్​ చేసినట్టు గుల్బర్గా డిప్యూటీ కమిషనర్​ బి. శరత్​ చెప్పారు. అందులో 31 మంది హై రిస్క్​ కేటగిరీలో,  13 మంది తక్కువ రిస్క్​ కేటగిరీలో ఉన్నారని అన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల్లో నలుగురికి ఫ్లూ లక్షణాలున్నాయని, వాళ్ల శాంపిళ్లను టెస్టుల కోసం పంపించామని తెలిపారు. బెంగళూరులోని గూగుల్​ ఎంప్లాయికి కరోనా​ పాజిటివ్​గా తేలింది. ఇటీవలే గ్రీక్​ నుంచి వచ్చిన 26 ఏళ్ల యువకుడికి వైరస్​ సోకిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అతడు కాంటాక్ట్​ అయిన వారందరినీ గుర్తించామని, వాళ్లలో లక్షణాలు లేవని చెప్పింది. మార్చి 6న గ్రీక్​ నుంచి ముంబైకి, అక్కడి నుంచి బెంగళూరుకు మార్చి 8న వచ్చినట్టు చెప్పింది. ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి సెలవులన్నింటిని ప్రభుత్వం రద్దు చేసింది. హాలిడేస్​లోనూ పనిచేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. రెండో శనివారం, ఆదివారం సహా ఇతర ప్రభుత్వ సెలవు రోజుల్లోనూ డ్యూటీ చేయాల్సిందిగా ఉత్తర్వులిచ్చింది. ఇటలీ, ఫ్రాన్స్​, జర్మనీ, స్పెయిన్, సౌత్​కొరియా, శ్రీలంకలకు ఎయిరిండియా ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ దాకా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 19న నిర్వహించాలనుకున్న 81వ రైజింగ్​ డే వేడుకలను,  51వ బ్యాచ్​ డీఏజీవో పాసింగ్​ అవుట్​ పరేడ్​ను సీఆర్పీఎఫ్​ వాయిదా వేసింది.

మిగతా రాష్ట్రాలూ

ఒడిశాలో విద్యా సంస్థలన్నింటినీ మార్చి 31 వరకు క్లోజ్​ చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ తెలిపారు. కొవిడ్​పై పోరాటానికి రూ.200 కోట్లు విడుదల చేశారు. సెమినార్లు, వర్క్​షాపులు, కాన్ఫరెన్స్​లన్నింటినీ రద్దు చేశారు. పెళ్లిళ్లు, బర్త్​డే పార్టీలు, మత సంబంధ కార్యక్రమాల వంటి వాటికి స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని  ఆదేశించారు. సినిమాహాళ్లు, స్విమ్మింగ్​ పూళ్లు, జిమ్ములు బంద్​ అవుతాయన్నారు. మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​, జమ్మూకాశ్మీర్​, హర్యానా, ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, పంజాబ్​, తమిళనాడు వంటి రాష్ట్రాలూ స్కూళ్లు, కాలేజీలకు మార్చి 31 వరకు సెలవులిస్తున్నట్టు ప్రకటించాయి. మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో మరో రెండు కొవిడ్​ పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. పోయిన వారం అమెరికా నుంచి భార్యతో పాటు ఇండియాకు వచ్చిన 46 ఏళ్ల వ్యక్తికి వైరస్​ ఉందని, అతడిని కలిసిన 15 మందిని క్వారెంటైన్​లో పెట్టి టెస్టులు చేయగా, అతడి భార్య, స్నేహితుడికి కొవిడ్​ పాజిటివ్​ వచ్చిందన్నారు. హర్యానాలోని మనేసర్​లో ఉన్న ఆర్మీ క్వారెంటైన్​లో ఉన్న వ్యక్తికీ పాజిటివ్​ వచ్చింది. గ్రేటర్​ నోయిడాలోని ఓ లెదర్​ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి కొవిడ్​ పాజిటివ్​ రావడంతో, ఆ కంపెనీలో పనిచేస్తున్న 707 మందిని క్వారెంటైన్​లో పెట్టారు. ఢిల్లీలోని జేఎన్​యూ, జామియా మిలియా, ఢిల్లీ యూనివర్సిటీలకు మార్చి 31 దాకా సెలవులిచ్చారు.

బ్రెజిల్​ ప్రెసిడెంట్​కు.. కెనడా ప్రధాని భార్యకు.. ఆస్ట్రేలియా మంత్రికి​

సామాన్యులకే కాదు.. పాలకులనూ కరోనా వదలట్లేదు. మొన్నటికి మొన్న ఇరాన్​ ఎంపీలకు వైరస్​ సోకితే, తాజాగా ఓ దేశాధినేతకు, ఓ దేశాధినేత భార్యకూ కరోనా వైరస్​ అంటింది. బ్రెజిల్​ ప్రెసిడెంట్​ జెయిర్​ బోసనారోకు కొవిడ్​ పాజిటివ్​ వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఆయన ప్రెస్​ సెక్రటరీ ఫాబియో వనగార్టెన్​కు పాజిటివ్​ వచ్చింది. దీంతో ఆయన శాంపిళ్లనూ టెస్టులకు పంపించారు. కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడూ భార్య సోఫీ గ్రెగరీకి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. గురువారం ఆమె శాంపిళ్లను టెస్టులకు పంపించగా పాజిటివ్​ వచ్చిందని, ఆమె సెల్ఫ్​ క్వారెంటైన్​ అయ్యారని ప్రధాని ఆఫీస్​ అధికారులు తెలిపారు. దీంతో ప్రధాని కూడా ఆఫీసుకు రాకుండా ఇంట్లోనే ఐసోలేట్​ అయ్యారని, ఇంటి నుంచే పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ట్రూడూ ఆరోగ్యం బాగానే ఉందని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి పీటర్​ డుట్టన్​కు కొవిడ్​ పాజిటివ్​ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కొద్ది రోజుల కిందట అమెరికాలో  ట్రంప్​ కూతురు ఇవాంక ట్రంప్​తో ఆయన సమావేశమయ్యారట.

కరోనా మృతులు 5 వేలు

ఇటలీలో మరణాల రేటు దారుణంగా పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 5 వేల మంది కొవిడ్​కు బలయ్యారు. 1,32,000 మంది దాని బారిన పడ్డారు. చైనాలో మరణాలు, కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 80,815 కేసులు అక్కడ రికార్డవగా, 3,177 మంది చనిపోయారు. ఇటలీలో చనిపోయిన వాళ్ల సంఖ్య వెయ్యి దాటేసింది. 1,016 మంది కొవిడ్​కు బలయ్యారు. 15,113 కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం 10 వేల కేసులే ఉండగా, ఇప్పుడు 15 వేల మార్కును దాటేశాయి. ఇరాన్​లో 514 మంది చనిపోయారు. దక్షిణ కొరియాలో 71, స్పెయిన్​లో 120, ఫ్రాన్స్​లో 61 మంది చనిపోయారు. అమెరికాలో చనిపోయిన వారి సంఖ్య 41కి పెరిగింది. కేసులు 1,832 నమోదయ్యాయి.

అనవసరంగా కలిశానా?​

అనవసరంగా అందరినీ కలుస్తున్నానంటూ సన్నిహితుల దగ్గర అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ వాపోయినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం  మారా లాగోలో ఆయన బ్రెజిల్​ ప్రెసిడెంట్​ బోసనారోతో పాటు వనగార్టెన్​తో సమావేశమయ్యారు. వాళ్లిద్దరికీ కరోనా పాజిటివ్​ రావడంతో ట్రంప్​లో కలవరం మొదలైందని అధికార వర్గాలు అంటున్నాయి.  ఆయనకు మాత్రం ఎలాంటి లక్షణాలు లేవని, టెస్టులూ అవసరం లేదని వైట్​హౌస్​ అధికారులు చెబుతున్నారు. టెస్టులూ అవసరం లేదంటున్నారు. ఇటు, తాజాగా అమెరికా మొత్తం నేషనల్​ ఎమర్జెన్సీని ప్రకటించారు ప్రెసిడెంట్​ ట్రంప్​. వైరస్​ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు.

ప్రపంచ దేశాలూ క్లోజ్​ చేసినయ్​​

అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను బంద్​ పెట్టారు. జపాన్‌‌‌‌‌‌‌‌ ఎమర్జెన్సీ చట్టాన్ని చేసింది.  కొవిడ్​ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ‘ఎమర్జెన్సీ గవర్నమెంట్​’ను ఏర్పాటు చేయాల్సిందిగా ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహూ కోరారు. ఫ్రాన్స్​లో అన్ని స్కూళ్లను వారం పాటు మూసేయనున్నారు. పాకిస్థాన్​ మే  31 దాకా సెలవులిచ్చేసింది. స్కూళ్లు, కాలేజీలను బంద్​పెట్టిన లగ్జెంబర్గ్​ సర్కార్, హాస్పిటళ్లు, నర్సింగ్​ హోంలలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న వృద్ధులను కలిసేందుకు పరిమితులు విధించింది. రోమ్​లో ​చర్చిలన్నీ ఏప్రిల్​ 3 వరకు బంద్.  స్పెయిన్​లో ఎమర్జెన్సీ ప్రకటించారు. దాదాపు అన్ని టౌన్లను మూసేశారు.

ఇరాన్​ నుంచి మరో 44 మంది

కొవిడ్​ ప్రభావిత ఇరాన్​ నుంచి మరో 44 మంది ఇండియన్లు దేశానికి తిరిగొచ్చారు. శుక్రవారం ఇరాన్​ ఎయిర్​కు చెందిన విమానంలో వాళ్లంతా ముంబైకి వచ్చారని విదేశాంగ శాఖ మంత్రి ఎస్​ జై శంకర్​ తెలిపారు. ‘‘రెండో బ్యాచ్​లో ఇరాన్​ నుంచి 44 మంది ఇండియాకు తిరిగొచ్చేశారు. మిగతా వాళ్లనూ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇరాన్​లోని ఇండియన్​ ఎంబసీ అధికారులు, మెడికల్​ సిబ్బంది కలిసి అక్కడి వాళ్లకు టెస్టులు చేస్తున్నారు. ఇరాన్​ అధికారులు సపోర్ట్​ చేస్తున్నారు’’ అని ఆయన ట్వీట్​ చేశారు.

Latest Updates