
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రం క్షేత్ర స్థాయిలో బీజేపీ పుంజుకుంటోందని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ బాగా పెరిగిందని చెప్పారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో జితేందర్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జితేందర్.. బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నడ్డాకు అభినందనలు తెలిపినట్లు చెప్పారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన బీజేపీ ఓటు శాతమే అందుకు నిదర్శనమని అన్నారు. టీఆర్ఎస్ కు ధీటుగా మహబూబ్ నగర్ లో బీజేపీ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై నడ్డా తో చర్చించినట్లు చెప్పారు.