కార్మికుల ఆత్మహత్యలకు సీఎందే బాధ్యత

  • గాంధీ సంకల్ప యాత్రలో మాజీ ఎంపీ వివేక్
  • కేసీఆర్‌‌పై ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదు చేయాలి
  • జీతాల్లేక కార్మికుల ఫ్యామిలీలు ఆకలికి అలమటిస్తున్నా సీఎంకు కనికరం లేదు

మంచిర్యాల/ మంచిర్యాల కోల్​బెల్ట్​, వెలుగు: ఆర్టీసీ కార్మికుల మరణాలకు సీఎం కేసీఆర్​బాధ్యత వహించాలని, ఆయనపై ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదు చేయాలని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.  కేసీఆర్ నిరంకుశ, అవినీతి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. గాంధీ సంకల్పయాత్రలో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, నస్పూర్ మున్సిపాలిటీల్లో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యమంలో ముందుండి పోరాడిన ప్రజల్ని, ఆర్టీసీ, సింగరేణి కార్మికులను, నిరుద్యోగులను, స్టూడెంట్లను కేసీఆర్‌‌ మర్చిపోయాడన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపి తనింట్లోనే నాలుగు ఇచ్చుకున్నాడని విమర్శించారు. ప్రతి పేదవాడికి డబుల్‌‌ బెడ్రూం ఇల్లు ఇస్తామని చెప్పిన సీఎం.. గడిచిన ఐదేళ్లలో ఎంత మందికి ఇచ్చారో చెప్పాలన్నారు. దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర పథకాలనే రాష్ట్రంలో అమలు చేస్తూ తానే చేస్తున్నట్టు మోసం చేస్తున్నాడన్నారు.

కార్మికులపై కనీస కనికరం లేదు..

40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా సీఎం కేసీఆర్‌‌కు కనీస కనికరం లేదని, వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించక తప్పదని వివేక్‌‌ అన్నారు. కార్మికులను రెచ్చగొట్టేలా సీఎం, మంత్రులు మాట్లాడుతున్నారని, సమ్మె చట్టబద్ధం కాదంటే వారి హక్కులను హరించడమేనన్నారు. ఇప్పటివరకు 25 మంది కార్మికులు చనిపోయారని, అనుభవం లేని డ్రైవర్ల కారణంగా మరో 25 మంది వరకు ప్రజలు చనిపోయారన్నారు. వీరందరి చావులకు సీఎం బాధ్యత వహించాలన్నారు. రెండు నెలలుగా జీతాల్లేక ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఆకలికి అలమటిస్తున్నారని, ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా ఇన్‌‌చార్జి రాజమౌళిగౌడ్‌‌, నియోజకవర్గ ఇన్‌‌చార్జి రఘునాథ్ వెరబెల్లి, పార్లమెంట్‌‌ నియోజకవర్గ కన్వీనర్ పెద్దపల్లి పురుషోత్తం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మున్నరాజ సిసోడియా, బీఎంఎస్ రీజియన్​ఇన్‌‌చార్జి పేరం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

EX MP Vivek Venkataswamy demands CM KCR to be responsible for RTC workers' deaths

Latest Updates