కమీషన్లకోసం రూ.30 వేల కోట్లను లక్షకోట్లకు పెంచిన ఘనత కేసీఆర్ దే

మందమర్రి, వెలుగు:

సింగరేణికి విద్యుత్​సంస్థల నుంచి రూ.9 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, ఆ నిధులను సీఎం కేసీఆర్​ కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించారని మాజీ ఎంపీ, బీజేపీ నేత జి.వివేక్​వెంకటస్వామి ఆరోపించారు. రూ.9 వేల కోట్ల బకాయిలకు 10% చొప్పున ఏటా రూ.900 కోట్ల వడ్డీ వస్తే సింగరేణి కార్మికులకు బోనస్​ఎక్కువగా దొరికేదని, కేసీఆర్​ నిర్వాకం వల్ల రెండేండ్లుగా బకాయిలు, వడ్డీ రాకుండా పోయాయని చెప్పారు. సింగరేణి నిధులను కాళేశ్వరానికి ఎలా మళ్లిస్తారని, రాబోయే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కేసీఆర్​ను ఓడించి గట్టి బుద్ది చెప్పారని ఆయన పిలుపునిచ్చారు. గురువారం మందమర్రి ఏరియాలోని కేకే5 బొగ్గు గని, ఏరియా సింగరేణి వర్క్​షాప్​లో బీఎంఎస్​ఆధ్వర్యంలో ‘బాయి బాయి అలయ్​ బలయ్-హక్కుల సాధనకై లడాయి’బొగ్గు గనుల యాత్రను నిర్వహించారు. దీనికి ముఖ్య​అతిథిగా వివేక్​ హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.

ఇప్పుడు ఆర్టీసీ.. రేపు సింగరేణి

రూ.30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్లకు ఆశపడి రూ.లక్ష కోట్ల ప్రాజెక్టుగా మార్చిన సీఎం కేసీఆర్.. ఆంధ్రా కాంట్రాక్టర్​ మేఘా కృష్ణారెడ్డికి పనులు అప్పగించి ప్రజల సొమ్ము దోచుకున్నారని వివేక్​ ఆరోపించారు. కాళేశ్వరం నుంచి కమీషన్లు ఆగిపోవడంతో కేసీఆర్​కన్ను ఆర్టీసీపై పడిందని, దానిని ప్రైవేట్​పరం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఆర్టీసీ, రేపు సింగరేణి, తర్వాత మిగతా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటుపరం చేసే కుట్రలకు కేసీఆర్​ తెరతీస్తున్నారన్నారు. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉందని, ఎట్టి పరిస్థితిలో ప్రైవేటుపరం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరికీ వర్తింపజేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ హామీ నెరవేర్చడంలో విఫలమయ్యారని వివేక్​ అన్నారు. 30 శాతం మంది కార్మికుల వారసులకే ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.

ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలి

ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా ఉండి సమ్మె చేస్తున్నారని, సీఎం నాలుగుసార్లు బెదిరించినా భయపడలేదని వివేక్​ చెప్పారు. ప్రపంచంలో సెల్ఫ్​డిస్మిస్​ అనేది ఉండదని, కార్మికులను డిస్మిస్​చేసే దమ్ము కేసీఆర్​కు ఉందా? అని ప్రశ్నించారు. పండుగలు జరుపుకోకుండా.. రెండు నెలలుగా పస్తులుంటున్న ఆర్టీసీ కార్మికులకు సలాం చేస్తున్నానని చెప్పారు. కొత్తగా రెవెన్యూ సిబ్బంది, ప్రజల మధ్య సీఎం చిచ్చుపెట్టాడన్నారు. సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షాలు, కార్మికులు, ప్రజలు ఉండకుండా తుగ్లక్​లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి కార్మికులు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలువాలని, ప్రజలు, కార్మికులు ఐక్యంగా ఉండి కేసీఆర్​నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కొడుకు, బిడ్డ కోసం కల్వకుంట్ల తెలంగాణగా మార్చుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని, సగటున ఒక్కొక్కరిపై రూ.లక్ష అప్పు పడుతుందని అన్నారు.

ఆదాయపు పన్ను రద్దు

సింగరేణి కార్మికుల ఇన్​కమ్​ట్యాక్స్​మినహాయింపు పరిమితిని తాను ఎంపీగా ఉన్న సమయంలో రూ.2 లక్షలకు తగ్గించేందుకు కృషి చేసినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, బీజేపీ, బీఎంఎస్​నేతలుసింగరేణి కార్మికుల ఆదాయపు పన్ను మినహాయింపుపై చర్చించామని, రానున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో బీఎంఎస్​ను గెలిపిస్తే పన్ను రద్దుకు కృషి చేస్తామన్నారు. మైనింగ్​సెస్​కింద సింగరేణి ఏటా రూ.2 వేల కోట్లను చెల్లిస్తోందని, కార్మికులు ఇన్​కమ్​ట్యాక్స్​గా రూ.230 కోట్లు చెల్లిస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే మైనింగ్​సెస్​లోనే కార్మికుల ఇన్​కమ్​ట్యాక్స్​ను మినహాయించేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Latest Updates