మాజీ ఎంపీలు ప్రభుత్వ భవనాలు ఖాళీ చేయకపోతే…

ప్రభుత్వ భవనాలు  ఖాళీ చేయాలని  మాజీ ఎంపీలను  కేంద్రం ఆదేశించింది. వారం  రోజుల్లో  వెళ్లకపోతే  కఠిన  చర్యలు  ఉంటాయని  హెచ్చరించింది. లుటెయిన్స్  ప్రాంగణంలో  2 వందల మంది  మాజీ ఎంపీలు ఇంకా నివాసం ఉన్నట్లు అధికారులు చెప్పారు.

తమ పదవీకాలం ముగిసినా ప్రభుత్వం కేటాయించిన బంగ్లాల్లో కొనసాగుతున్న మాజీ ఎంపీలకు కేంద్రం గడువు విధించింది. వారంలోగా భవనాలు ఖాళీ చేయాలని సూచించింది. ముఖ్యంగా లుటెయిన్స్  ప్రాంగణంలోని బంగ్లాల్లో నివాసముంటున్న మాజీ ఎంపీలు వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మూడు రోజుల్లో విద్యుత్ , నీటి సరఫరా కూడా నిలిపివేయాలని ఆదేశించినట్లు హౌసింగ్  కమిటీ ఛైర్మన్ సీఆర్ పాటిల్ తెలిపారు.

లుటెయిన్స్  ప్రాంగణంలో సుమారు 200 మంది మాజీ ఎంపీలు గడువు ముగిసిన తర్వాత కూడా కొనసాగుతున్నారు. వాస్తవానికి సభ రద్దైన నెల రోజుల్లోగా తమకు కేటాయించిన బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. మే 25న 16వ లోక్ సభ రద్దు కాగా.. జూన్ 25 నాటికే వీరు ఖాళీ చేయాల్సి ఉండగా నేటికీ కొందరు అవే భవనాల్లో కొనసాగుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వికపోవడంతోనే డెడ్ లైన్ విధించాల్సి వచ్చిందని పార్లమెంట్ అధికారులు చెప్పారు.

ఎంపీల బంగ్లాలపై  ప్రధాని మోడీ కూడా స్పందించారు. ఇప్పటికే పార్లమెంట్  సమావేశాలు ప్రారంభమయ్యాయని, కొత్తగా ఎన్నికైన ఎంపీలు నివాసాల కొరత ఎదుర్కొంటున్నారని ప్రధాని ట్వీట్ చేశారు. నియోజకవర్గ సమస్యలు చెప్పేందుకు పార్లమెంట్ కు వచ్చే ఎంపీలకు నివాస వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు ప్రధాని. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొన్ని బంగ్లాలకు మరమ్మతులు అవసరమని, త్వరలోనే వాటినీ పూర్తి చేసి కొత్త ఎంపీలకు అందజేస్తామని ట్విట్టర్ లో తెలిపారు ప్రధాని మోడీ.

Latest Updates