
హైదరాబాద్, వెలుగు:
కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను దక్కించుకోవడంలో ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది. నిజామాబాద్, రామగుండం, మీర్‌పేట్, బడంగ్‌పేట్ కార్పొరేషన్లతోపాటు 12 మున్సిపాల్టీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లే మేయర్, చైర్ పర్సన్లు ఎవరో తేల్చనున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీకే ఎక్కువ మున్సిపాల్టీలు దక్కేందుకు ఈ ఓటే ప్రధానం కానుంది. శనివారం సాయంత్రం వరకు ఎక్స్ అఫీషియో ఓటు ఎక్కడ వేస్తారనే విషయం చెప్పే ఆస్కారం ఉండటంతో ప్రజాప్రతినిధులంతా హంగ్ ఏర్పడిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలోనే ఓటేసేందుకు ఆప్షన్ ఇచ్చారు.
నిజామాబాద్తేల్చేది వీరే
నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీ 28 డివిజన్లలో గెలుపొందగా, టీఆర్‌ఎస్ 13, ఎంఐఎం 16, కాంగ్రెస్ రెండు వార్డుల్లో గెలిచాయి. ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలుపొందారు. బీజేపీకి ఎంపీ అర్వింద్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండగా, టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్త, బాజిరెడ్డి గోవర్థన్, ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, ఆకుల లలిత ఆప్షన్ ఇచ్చినట్టు తెలిసింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నిజామాబాద్ కార్పొరేషన్‌కే ఆప్షన్ ఇచ్చినట్టుగా సమాచారం. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటుండటంతో ఇక్కడి నుంచి మరో రాజ్యసభ సభ్యునికి ఎక్స్ అఫీషియో ఆప్షన్ ఇచ్చినట్టుగా తెలిసింది.
మీర్, బడంగ్పేట్లో పోటా పోటీ
మీర్‌పేట్, బడంగ్‌పేట్ కార్పొరేషన్లను దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మీర్‌పేటలో 46 డివిజన్లకు 19 టీఆర్‌ఎస్, 16 బీజేపీ, మూడు కాంగ్రెస్, 8 డివిజన్లలో ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక్కడ మేయర్ పీఠం దక్కాలంటే 24 ఓట్లు కావాలి. ఈ లెక్కన టీఆర్‌ఎస్‌కు ఐదు ఓట్లు తగ్గుతున్నాయి. గెలిచిన 8 మంది ఇండిపెండెట్లలో నలుగురు టీఆర్‌ఎస్ రెబల్సే కావడంతో వారిని దారికి తెచ్చుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు కొందరు ఎమ్మెల్సీలు ఇక్కడ ఎక్స్ అఫీషియో ఆప్షన్ ఇచ్చినట్టుగా తెలిసింది. బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో 32 డివిజన్లకు టీఆర్‌ఎస్ 13, బీజేపీ 10, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్లు రెండు వార్డుల్లో గెలిచారు. కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్లు కలిసి ఈ సీటును దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇండిపెండెంట్లతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో తామే గెలుచుకుంటామని టీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు. రామగుండం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌కు మెజార్టీ రాకున్నా గెలిచిన ఆ పార్టీ రెబల్స్‌ను కలుపుకుని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లతో మేయర్ పీఠాన్ని దక్కించుకోనుంది.