పట్టపగలు ఇంట్లోకి చొరబడి గొడ్డలితో నరికిన్రు

కమలాపూర్ మాజీ సర్పంచ్ కొడుకు హత్య

నవీపేట్, వెలుగు: పట్టపగలు ఇంట్లోకి చొరబడి మాజీ సర్పంచ్ కొడుకుని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు . ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్​మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి కొడుకు కుంచె రమణారెడ్డి వడ్ల వ్యాపారం చేస్తుంటారు. ముగ్గురు కూతుళ్లు. కుటుంబ తగాదాలతో రమణారెడ్డి భార్య నాగ సులోచన పెద్ద, చిన్న కూతుళ్లతో విడిగా నిజామాబాద్‌‌లో ఉంటున్నారు. శివరాత్రి కావడంతో రెండో కూతురితో కలిసి నందిపేట కేదారేశ్వర ఆలయానికి కారులో వెళ్లేందుకు శుక్రవారం మండల కేంద్రంలోని ఇంటి దగ్గర రెడీ అవుతున్నారు.

ఇంతలో గుర్తుతెలియని దుండగులు ఇంటి ఆవరణలో ఉన్న ఆయనపై గొడ్డలితో దాడి చేశారు. మెడ, తలపై నరకడంతో రమణారెడ్డి అక్కడే పడిపోయాడు. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు . కొద్దిసేపటికి రెండో కూతురు రక్షిత కమలాపూర్‌లో ఉండే తాతయ్య దగ్గరి నుంచి స్కూటీపై ఇంటికి వచ్చింది. ఆవరణలో రక్తపు మడుగులో కొనఊపిరితో ఉన్న తండ్రిని చూసి కేకలు వేసింది. చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు జీపులో జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. డాగ్ స్క్వాడ్ స్థానిక ఎస్బీఐ వరకు వెళ్లి తిరిగి వచ్చింది. వ్యాపార లావాదేవీలు హత్యకు కారణం కావచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates