ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ఈడీల కమిటీ భేటీ

  • బస్​ భవన్​లో రోజంతా చర్చ
  • ఒక్కో డిమాండ్​కు రెండు రకాల సమాధానాలు!
  • నేడూ చర్చించనున్న కమిటీ 

హైదరాబాద్‌‌, వెలుగు:

ఆర్టీసీ కార్మికుల 21 డిమాండ్ల పరిశీలనకు ఏర్పాటైన ఎగ్జిక్యూటివ్‌‌ డైరెక్టర్‌‌ల కమిటీ బుధవారం బస్‌‌భవన్‌‌లో సమావేశమైంది. ఉదయం 10 గంటలకు నుంచి రాత్రి 8.30 గంటల దాకా సుదీర్ఘంగా ఈ భేటీ కొనసాగింది. డిమాండ్లను ఈడీలు పరిశీలించారు. సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప 21 డిమాండ్ల పరిశీలనకు ఈడీల కమిటీని నియమిస్తున్నట్లు మంగళవారం సీఎం కేసీఆర్​ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  కమిటీ అధ్యక్షుడు టి.వెంకటేశ్వర్‌‌రావు నేతృత్వంలో ఈడీలు ఎ.పురుషోత్తం, సి.వినోద్ కుమార్, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు ఎన్.రమేశ్​ బస్​భవన్​లో సమావేశమయ్యారు. వీరు 50 శాతం డిమాండ్లను పరిశీలించినట్లు తెలిసింది. పీఆర్సీ, జీహెచ్‌‌ఎంసీ నుంచి రావాల్సిన నిధులు, ఉద్యోగ భద్రతతోపాటు పలు అంశాలను చర్చించినట్లు సమాచారం.

డిమాండ్లలో ఆర్థికంగా భారమైనవి ఏమిటి? ఆర్థికంగా భారం కానివి ఏమిటి? వెంటనే  పరిష్కరించేవి ఏమిటి? పరిష్కారానికి ఎక్కువ టైం తీసుకునేవి ఏమిటి? అనే దాన్ని ఈడీలు చర్చించారు. డిమాండ్లలో కొన్నింటికి పరిష్కారం కూడా వారు కనుగొన్నట్లు సమాచారం. ఒక్కో డిమాండ్​కు రెండు రకాల సమాధానాలను వారు సిద్ధం చేసినట్లు తెలిసింది. గురువారం కూడా సమావేశమై చర్చించనున్నారు. 21 డిమాండ్లను పరిశీలించాక, రిపోర్ట్‌ తయారు చేసి వీలైతే గురువారం రాత్రే ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మకు అందజేయనున్నారు. లేకుంటే శుక్రవారం ఇచ్చే అవకాశం ఉంది. ఈడీలు అందజేసిన రిపోర్టును సునీల్‌ శర్మ  ప్రభుత్వానికి సమర్పిస్తారు. రిపోర్టులోని అంశాలను ఈ నెల 28న జరగనున్న విచారణలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తేనుంది.

 

Latest Updates