ఎగ్జిట్​పోల్స్​ అంచనాలు తప్పినయ్

ఎగ్జిట్​పోల్స్​ అంచనాలు తప్పినయ్
  • ఎన్డీఏకు భారీగా తగ్గిన సీట్లు
  • అనూహ్యంగా పుంజుకున్న ఇండియా కూటమి
  • 400 సీట్లు వస్తాయన్న మేజర్ సర్వే సంస్థలు
  • అతి కష్టం మీద 290 స్థానాలు దాటిన ఎన్డీఏ
  • యూపీలో సగానికిపైగా స్థానాల్లో బీజేపీ ఓటమి

న్యూఢిల్లీ: లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పాయి. అన్ని సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమికి 350కు పైగా సీట్లు వస్తాయని చెప్పాయి. ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా, ఇండియా టీవీ సీఎన్ఎక్స్, న్యూస్ 24 టు డేస్ చాణక్య మేజర్ సర్వే సంస్థలు మాత్రం బీజేపీ నేతృత్వంలోని కూటమికి 400 సీట్లు దాటుతాయని ప్రకటించాయి.

జీగా మ్యాజిక్ ఫిగర్ (272) దాటుతుందని అన్ని సంస్థలు వెల్లడించాయి. కానీ.. వాస్తవానికి మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. చాలా కష్టంగా ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఏ సర్వే సంస్థ కూడా ఊహించని రీతిలో ప్రత్యర్థి ఇండియా కూటమికి సీట్లు దక్కాయి. ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య టగ్ ఆఫ్ వార్ కొనసాగింది.

గ్జిట్ పోల్స్ చెప్పిన వాటి కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని ఎన్డీఏ కూటమి నేతలు చెప్పారు. కానీ.. పరిస్థితి రివర్స్ అయింది. ఇండియా కూటమి నేతలు కూడా ఎగ్జిట్ పోల్స్​పై తమకు నమ్మకం లేదని, ప్రజా తీర్పునే విశ్వసిస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే ఇండియా కూటమి పెద్ద సంఖ్యలో లోక్​సభ స్థానాలను కైవసం చేసుకున్నది.

‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదంతో..

14 ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమికి 365కుపైగా సీట్లు వస్తాయని ప్రకటించాయి. ఇండియా కూటమికి 146 స్థానాలు వస్తాయని చెప్పాయి. బీజేపీ నేతలు కూడా ‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. బీజేపీకి కనీసం 370 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలతో పోలిస్తే సుమారు 70 నుంచి 80 స్థానాల్లో ఎన్డీఏ కూటమి వెనుకబడింది.

అయితే, ఇంత భారీగా సీట్లు తగ్గడానికి కారణం యూపీలో బీజేపీ చతికిలపడటమే అని తెలుస్తున్నది. 2019 లోక్​సభ ఎన్నికల్లో 62 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. ఈసారి సగానికిపైగా స్థానాల్లో ఓడిపోయింది. కాంగ్రెస్, సమాజ్​వాది పార్టీ పుంజుకున్నాయి. గతంలో కంటే రెట్టింపు స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. 

2014, 2019 ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి?

గతంలో జరిగిన లోక్​సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనాలు తప్పాయి. 2019 లోక్​సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 285 సీట్ల వరకు వస్తాయని చాలా వరకు సర్వే సంస్థలు ప్రకటించాయి. ఎన్డీఏ కూటమియే అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కానీ.. రిజల్ట్స్ రోజు మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారయ్యాయి. ఎన్డీఏ కూటమికి ఏకంగా 353 సీట్లు వచ్చాయి.

అందులో బీజేపీ ఒంటరిగా 303 స్థానాల్లో గెలిచింది. ఇక యూపీఏ కూటమి 93 స్థానాల్లో విజయం సాధించింది. అందులో కాంగ్రెస్​కు 52 సీట్లు వచ్చాయి. 2014 లోక్​సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా తప్పాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 270 నుంచి 282 సీట్లు వస్తాయని మేజర్ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు తెలిపాయి. యూపీఏ కూటమికి 92 నుంచి 102 వరకు వస్తాయని ప్రకటించాయి.

కానీ.. అనూహ్యం ఎన్డీఏ కూటమికి 336 స్థానాలు వచ్చాయి. అందులో బీజేపీ 282 సీట్లు సాధించింది. ఇక యూపీఏ కూటమికి 59 సీట్లు రాగా, అందులో కాంగ్రెస్​కు 44 స్థానాలు దక్కాయి. బంపర్ మెజారిటీతో నరేంద్ర మోదీ ఇండియాకు ప్రధానమంత్రి అయ్యారు.

యాక్సిస్ మై ఇండియా చైర్మన్ కంటతడి

లోక్​సభ ఎన్నికల ఫలితాలపై ఇండియా టుడే న్యూస్ చానెల్​లో పెట్టిన లైవ్​లో యాక్సిస్ మై ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ గుప్తా కన్నీరు పెట్టుకున్నారు. యాక్సిస్ మై ఇండియా రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారు కావడంతో ఆయనపై లైవ్​లోనే పలువురు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఆయన లైవ్ డిబేట్​లోనే ఏడ్చేశారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ సారి ఎన్డీఏ కూటమికి 361 నుంచి 401 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ఇండియా కూటమికి 131 నుంచి 166 సీట్లు వస్తాయని చెప్పింది. 8 నుంచి 20 సీట్లు ఇతర పార్టీలకు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడించింది. కానీ.. మంగళవారం రిలీజ్ అయిన ఫలితాల్లో యాక్సిస్ మై ఇండియా అంచనాలన్నీ తలకిందులయ్యాయి.

దీంతో పలువురు ఆయనపై డిబేట్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ..‘‘పదేండ్లుగా యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే చేస్తున్నది. మొత్తం 69 ఎలక్షన్లలో పని చేశాం. అందులో రెండు లోక్​సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. 65 సార్లు మా అంచనాలు నిజమయ్యాయి.

ఈ 65 అంచనాల్లో ప్రతి సారి అపోజిషన్ పార్టీ (కాంగ్రెస్​తో సహా) మేము చెప్పినట్టే ఒకటిరెండు సార్లు గెలిచింది. మా విశ్వసనీయత సంబంధించినంత వరకు మమ్మల్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరూ మా ట్రాక్ రికార్డు చూడాలి. అప్పుడే వాళ్లు సంతృప్తి చెందుతారు’’అని తెలిపారు.