ఏకపక్ష ఎగ్జిట్‌‌కు 8 కారణాలు!

exit-results-8-reasons-for-modis-favor

ఎగ్జిట్ పోల్స్‌‌లో దేశమంతా ఎన్డీయేకి మంచి మార్కులు పడ్డాయి. అందరూ పాజిటివ్‌‌గా చూస్తున్నారు. ఎన్నికలకు ముందున్న ఆలోచనలకు, పోలింగ్‌‌ ముగిసిపోయి ఫలితాలకోసం ఎదురుచూస్తున్న గ్యాప్‌‌లో అంచనాలకు తేడా ఉంది. దీనికి  ప్రధానంగా ఎనిమిది  కారణాలు కనబడుతున్నాయి.

1) మోడీ సైలెంట్ వేవ్

2014లో మోడీ గాలి దేశమంతా స్పష్టంగా కనబడింది. ఈసారి అలాంటి గాలి లేదని అందరూ అనుకున్నారు. అయితే చాలా నిశ్శబ్దంగా మోడీ ప్రభంజనం వీచిందంటున్నారు విశ్లేషకులు. పుల్వామా ఘటనతో సెక్యూరిటీ ఇష్యూ తెర మీదకు వచ్చింది. దీంతో నిరుద్యోగం వంటి కీలక అంశాన్ని యూత్ మరచిపోయింది. చైనా, పాకిస్థాన్ వంటి పొరుగుదేశాలతో ఇండియాకు చాలా ఏళ్లుగా సరిహద్దు తగాదాలున్నాయి. టెర్రరిస్టు మసూద్ అజార్ విషయంలో చైనా మనకు వ్యతిరేక వైఖరి తీసుకుంది. ఈ మధ్యే ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గి ఇండియా డిమాండ్‌‌కి ఓకే చెప్పింది. బలమైన చైనాని, కయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్‌‌ని కట్టడి చేయాలంటే నరేంద్ర మోడీ వంటి పవర్ ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఉండాల్సిందేనని ప్రజలు కూల్ గా డిసైడ్ అయ్యారన్నది ఎనలిస్టులు చెబుతున్న పాయింట్.  ఇక, మోడీకి ఉన్న క్లీన్ ఇమేజ్ కూడా ఎగ్జిట్ పోల్స్‌‌లో ఎన్డీయేకి ప్లస్ పాయింట్‌‌గా చెబుతున్నారు. రాఫెల్ జెట్‌‌ ఫైటర్ల కొనుగోలు

2)కొత్త ఓటు బ్యాంక్

బీజేపీకి మొదటి నుంచి పెద్ద కులాలు అండగా ఉన్నాయి. బనియాలు, ఠాకూర్లు, రాజ్ పుత్‌‌లు ఇందులో ముఖ్యులు. రాజకీయంగా తమకు న్యాయం జరగలేదన్న కోపంతో కొన్ని పెద్ద కులాలు బీజేపీకి దూరమయ్యాయి. రాజస్థాన్‌‌లో బలమైన రాజ్‌‌పుత్‌‌ నాయకుడిగా పేరున్న కల్నల్‌‌ మానవేంద్ర సింగ్ (జశ్వంత్‌‌ సింగ్‌‌ కొడుకు) కాంగ్రెస్‌‌లోకి వెళ్లిపోవడాన్ని ఈ కోణంలో నుంచే చూడాలి. అయితే పోలింగ్ టైం దగ్గర పడేకొద్దీ దూరమైన కులాలు మళ్లీ ఆలోచనలో పడ్డాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హిందీ బెల్ట్‌‌లోని దాదాపు అన్ని  పెద్ద కులాలు మోడీకి అండగా నిలిచాయి. పెద్ద కులాల్లోని నిరుపేదలను ‘ఎకనమికల్లీ వీకర్‌‌ సెక్షన్‌‌’గా గుర్తించి, వారికి విద్య, ఉపాధి రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తెచ్చారు. మోడీ సర్కార్ చేసిన ఈ చట్టం ఎన్డీయేకి అనుకూలంగా మారిందంటున్నారు.

3)రామమందిరంపై తొందరపడకపోవడం

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై మోడీ సర్కార్ ఏమాత్రం  తొందరపడలేదు. ఐదేళ్లుగా కేంద్రంలోనూ, రెండేళ్లుగా ఉత్తరప్రదేశ్‌‌లోనూ బీజేపీ అధికారంలో ఉండి కూడా అయోధ్య లో రామమందిర నిర్మాణంపై ఎక్కడా తొందరపడలేదు. ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్‌‌తో పాటు శివసేన వంటి రాజకీయ మిత్రపక్షం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా బీజేపీ బ్యాలెన్స్ తప్పలేదు. అయోధ్య కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందువల్ల జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదంటూ తేల్చి చెప్పింది. మోడీ వ్యవహారశైలి హిందువులకే కాదు, ఇతర మతస్తులకుకూడా నచ్చిందన్నది ఒక కథనం.

4)అభివృద్ధి నినాదం

బీజేపీకి గతంలో అయోధ్య ఇష్యూనే నినాదంగా ఉండేది. ప్రస్తుతం బీజేపీ దృష్టి అయోధ్య నుంచి అభివృద్ది వైపు మళ్లింది.  ఇందులో భాగంగా ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి అనేక పథకాలను మోడీ సర్కార్ తీసుకువచ్చింది. ఏ రంగంలో అయినా అభివృద్దికే మోడీ ప్రభుత్వం పట్టం కట్టింది. మోడీ విదేశీ పర్యటనల్లోనూ అభివృద్దే సెంటర్ పాయింట్‌‌గా మారింది. అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో ఇండియా దూసుకుపోవాలని కోరుకునేవారు అభివృద్ది ఇష్యూకు ఫిదా అయినట్లు రాజకీయ పండితుల విశ్లేషణ.

5)కాశ్మీర్ పై మారిన వైఖరి

కాశ్మీర్ విషయంలో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు బుజ్జగింపు ధోరణితో వ్యవహరించాయన్న అభిప్రాయం బాగా ఉంది. ప్రజల్లోనూ ముఖ్యంగా ఉత్తరాదిన ఇది ఎక్కువ. కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చాక కాశ్మీర్ విషయంలో వైఖరి మారింది. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్–370 విషయంలో ఎన్డీయే సర్కార్ గట్టిగా ఉంది. దీన్ని రద్దు చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. ఈ ఆర్టికల్ ఉండటం వల్లనే టెర్రరిస్టులు పెట్రేగుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయిందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. అయితే ఆర్టికల్–370 రద్దు చేస్తే కాశ్మీర్ అల్లకల్లోలం అవుతుందని నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలు హెచ్చరించాయి. దీంతో దేశ భద్రత దృష్ట్యా ఆర్టికల్–370ని రద్దు చేయాలని కోరేవారంతా బీజేపీకి అనుకూలంగా మారారన్నది ఒక కథనం.

6)మహిళల ఆదరణ

ఎన్డీయే సర్కార్ తీసుకువచ్చిన  ఉజ్వల్​ పథకం సక్సెస్ అయింది. కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే గ్రామీణ ప్రాంత ఆడవారికి ఉజ్వల్​ పథకం లో భాగంగా వచ్చిన గ్యాస్ సిలిండర్ ఓ పెద్ద ఊరట కలిగించింది. అలాగే మారుమూల పల్లెల్లో  టాయిలెట్ల నిర్మాణం చేయడంతో కులమతాలకతీతంగా ఆడవారు ఎన్డీయే సర్కార్ కు అనుకూలంగా మారిపోయారని సోషల్ సైంటిస్టులు అంటున్నారు.

7)మౌలిక వసతులు

దేేశంలో ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ని అభివృద్ధి చేయడానికి ఎన్డీయే సర్కార్ చేసిన కృషిని అందరూ గుర్తించారంటున్నారు రాజకీయ పండితులు. మరీ ముఖ్యంగా జాతీయ రహదారులు, ఓడరేవులు, వంతెనల నిర్మాణానికి మోడీ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇవ్వడంతో రాజకీయాలకతీతంగా చాలా మంది బీజేపీకి అనుకూల వైఖరి తీసుకున్నారన్న టాక్  పొలిటికల్ సర్కిల్స్‌‌లో వినిపిస్తోంది.

8)వారసత్వ రాజకీయాలపై అయిష్టం

చాలామంది విద్యావంతుల్లో వారసత్వ రాజకీయాలపై ఏవగింపు ఉంది. ఈ కారణంతోనే చాలా మంది రాహుల్ గాంధీని దూరంగా పెట్టారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మోడీది భిన్నమైన రాజకీయ నేపథ్యం. చాయ్‌‌వాలా స్థాయి నుంచి ఆరెస్సెస్  ఆ తర్వాత బీజేపీలో ఎంట్రీ ఇచ్చారు. అంచెలంచెలుగా ఎదిగారు. కమిట్మెంట్‌‌తో జీవితంలో పైకి వచ్చిన మోడీ దేశంలోని చాలా మంది సామాన్య ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారంటున్నారు సోషల్ సైంటిస్టులు

 

 

 

 

 

 

Latest Updates