40 ఏండ్ల తర్వాత ఓల్డ్ సిటీ రోడ్ల విస్తరణ

V6 Velugu Posted on Jan 26, 2022

ట్రాఫిక్ ఎక్కువగా ఉండే 15 ఏరియాల గుర్తింపు

 • కొనసాగుతున్న ఆస్తుల సేకరణ 
 • 200 కోట్లతో 30కి.మీ. వైడెనింగ్​కు బల్దియా ప్లాన్​

హైదరాబాద్​, వెలుగు: ఓల్డ్ సిటీ రోడ్లపై నాలుగు దశాబ్దాల తరువాత జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే 15 రోడ్లను విస్తరిస్తోంది. అన్నిచోట్ల ఒకేసారి వైడెనింగ్ పనులను ప్రారంభించింది. గతంలో రోడ్లు విస్తరించాలని బల్దియా అధికారులు అనుకున్నా ఆస్తుల సేకరణకు ఇబ్బందులు ఎదురవడంతో ప్రతిపాదనలకే పరిమితం అయ్యారు. కానీ రోజురోజుకు పెరుగుతున్న జనాభా, వెహికల్స్​తో చిన్నచిన్న రోడ్లపై ట్రాఫిక్ ​పెరిగిపోతోంది. 40 ఏండ్ల కింద చార్మినార్ డెవలప్ మెంట్​లో భాగంగా అప్పట్లో కొన్ని రోడ్లను విస్తరించారు. ఆ తర్వాత ఎంతో మంది మేయర్లు, కమిషనర్లు వచ్చి పోతున్నారే తప్ప ఇప్పటివరకు ఓల్డ్​సిటీలోని ఒక్క రోడ్డునూ విస్తరించలేదు. ప్రస్తుతం 20 నుంచి 40 ఫీట్లు ఉన్న రోడ్లను 60 నుంచి 80 ఫీట్ల దాక పెంచనున్నారు. మొత్తం 30 కిలోమీటర్ల మేర రోడ్డు వైడెనింగ్​ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. పనులు పూర్తయితే చాలా వరకు ట్రాఫిక్ సమస్య తీరనుందంటున్నారు. వైడెనింగ్​ పనులతో పాతబస్తీకి కొత్త కళ వచ్చే అవకాశముంది. ఏడాదిలోపు పనులు మొత్తం పూర్తి చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. నిర్ణయించిన ఏరియాల్లో మొత్తం 600 ఆస్తులను సేకరించాల్సి ఉంది. ఆస్తుల సేకరణతోపాటు రోడ్ల విస్తరణకు మొత్తం రూ.200 కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. 

స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా..
పాతబస్తీలో రోడ్ల వైడెనింగ్​కి ప్రాపర్టీదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతోనే ఇన్నేండ్లుగా పనులు చేయలేకపోయారు. రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్​నేపథ్యంలో విస్తరణ తప్పక చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు స్థానికులకు నచ్చజెప్పి ఆస్తులు సేకరిస్తున్నారు. కొందరు స్వచ్ఛందంగా ముందుకొస్తుండగా, మరికొందరు  వెనక్కి తగ్గుతున్నారు. అవసరమైతే ఆస్తుల యజమానులతో స్థానిక లీడర్లతో మాట్లాడించి సేకరిస్తున్నారు. ప్రతిఒక్కరూ వైడెనింగ్​పనులకు సహకరించాలని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రాపర్టీలను ఇవ్వాలని బల్దియా ఆఫీసర్లు కోరుతున్నారు. 

 చార్మినార్ జోన్​లోనే ఎక్కువ

గ్రేటర్​పరిధిలో ఎల్బీనగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, చార్మినార్ జోన్లు ఉండగా.. అన్నిజోన్లలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు రోడ్ల విస్తరణ చేస్తున్నారు. ఒక్క చార్మినార్ జోన్​లోనే కొన్నేండ్లుగా వైడెనింగ్ పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ కూడా ఆస్తులు ఇచ్చేందుకు ప్రజలు ముందుకొస్తుండటంతో పనులు స్టార్ట్​చేశారు.
 
విస్తరిస్తున్న రోడ్లు ఇవే..

 • వజీర్ అలీ మసీదు నుంచి హుస్సేనీ వరకు
 • హిమ్మత్ పురా నుంచి  చందూలాల్ బరాదరి వరకు
 • టిప్పు కాన్ మసీదు నుంచి పురానాహవేలి వరకు
 • అజఖాన్ జైరా నుంచి డేరా మీర్ మోహిన్ వరకు 
 • ఓల్డ్​ఛత్రినాక పీఎస్​ నుంచి మహాకాళి టెంపుల్ వరకు
 • బండ్లగూడ నుంచి ఎర్రకుంట జంక్షన్ వరకు
 • చాంద్రాయణగుట్ట నుంచి పీర్​ దర్గా వరకు
 • హాజరబి దర్గా దగ్గరిలోని రోడ్డు
 • గుల్జార్ హౌస్ నుంచి రాయల్ ఫంక్షన్ హాల్ వరకు
 • మిట్టి కా షేర్ నుంచి లాడ్ బజార్ వరకు
 • చార్మినార్ ట్రాఫిక్ పీఎస్ నుంచి కాళీ కమాన్ వరకు
 • లాడ్ బజార్ నుంచి జుల్కాన్ కమాన్ వరకు 
 • గుల్జార్ హౌజ్ సమీపంలోని మరో మూడు రోడ్లు

మెయిన్​ రోడ్లనూ విస్తరించాలె

అలియాబాద్, చాంద్రాయణగుట్ట, లాల్ దర్వాజ, తలాబ్ కట్ట, మీరాలం మండి  ప్రాంతాల్లో వైడెనింగ్ ​చేస్తే తప్ప ట్రాఫిక్ సమస్య తీరదు. 1986లో చార్మినార్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 80 నుంచి వంద ఫీట్ల వరకు రోడ్డుని విస్తరిస్తామని అప్పటి ఎంసీహెచ్ సుప్రీంకోర్టుకి చెప్పింది. కానీ పనులు చేయలేదు. ఇప్పుడైనా అలా ఓల్డ్ సిటీలోని అన్ని మెయిన్​రోడ్లను డెవలప్ చేయాలె. 
- మోహన్​లాల్, ఫలక్ నుమా, హైకోర్టు లాయర్

Tagged hyderabd, GHMC, Roads, old city, expansion, years, charminar , zone

Latest Videos

Subscribe Now

More News