కరోనా వ్యాక్సిన్​ ఫేజ్ 1 ట్రయల్స్ సక్సెస్

  • చైనాలో 108 మందిపై ప్రయోగం.. బాగా పనిచేసిన వ్యాక్సిన్
  • ఇమ్యూన్ రెస్పాన్స్ పెంచింది.. సేఫ్ అని తేలింది
  • వైరస్ నుంచి పూర్తి రక్షణ ఇస్తుందా? లేదా?
  • తదుపరి ట్రయల్స్ తర్వాతే తేలుతుందంటున్న సైంటిస్టులు

న్యూఢిల్లీ/బీజింగ్:  చైనా సైంటిస్టులు తయారు చేస్తున్న మొదటి కరోనా వ్యాక్సిన్ మనుషులపై ఫేజ్1 క్లినికల్ ట్రయల్స్ లో బాగా పని చేసింది. ట్రయల్స్ లో భాగంగా 18 నుంచి 60 ఏండ్ల మధ్య ఉన్న108 మందిపై వ్యాక్సిన్ ను ప్రయోగించారు. ఇది కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ఇమ్యూన్ సిస్టం రెస్పాన్స్ ను పెంచింది. మనుషులకు సురక్షితమేనని కూడా తేలింది. బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ చేస్తున్న ఈ రీసెర్చ్ వివరాలు ‘ది లాన్సెట్’ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి. టీకా తీసుకున్న వాలంటీర్లలో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలు తయారయ్యాయని, దీంతో ఇమ్యూన్ సిస్టంలో వైరస్ ను నిర్మూలించే టీ సెల్స్ వైరస్ కూడా ఉత్పత్తి అయ్యాయని సైంటిస్టులు వెల్లడించారు. అయితే, ఈ టీకా కరోనా వైరస్ నుంచి పూర్తిస్థాయిలో రక్షణ ఇస్తుందా? లేదా? అన్నదానిపై తదుపరి ట్రయల్స్ జరగాల్సి ఉందన్నారు. ఫైనల్ రిజల్ట్స్ ను ఆరు నెలల తర్వాత పరిశీలిస్తామన్నారు. సాధారణ జలుబు కలిగించే న్యూ అడినోవైరస్ టైప్ 5 వెక్టర్ ఆధారంగా తయారు చేసిన ఈ టీకా (ఏడీ5–ఎన్ కోవ్).. 14 రోజుల్లో వైరస్ స్పెసిఫిక్ యాంటీబాడీలు, టీ సెల్స్ ను ఉత్పత్తి చేసిందని రీసెర్చ్ కో ఆథర్ వీ చెన్ వెల్లడించారు. ఇమ్యూన్ సిస్టం రెస్పాన్స్ ను పెంచినంత మాత్రాన ఈ వ్యాక్సిన్ కరోనా నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందని చెప్పలేమని, ఫైనల్ ట్రయల్స్ ద్వారానే ఈ విషయం తేలుతుందన్నారు.

మన వ్యాక్సిన్ ఇంకా ఫస్ట్ స్టేజ్ లోనే..

కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు వ్యాక్సిన్ తయారీ ప్రాజెక్టులు మనదేశంలో ఇంకా తొలి దశలోనే ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ ఏడాదిలోగా టీకా తయారీలో గట్టి బ్రేక్ త్రో సాధించే అవకాశం లేదని అంటున్నారు. దేశంలో కరోనా టీకా తయారీ ప్రాజెక్టుల కోసం కేంద్రం పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ. 100 కోట్లు కేటాయించింది. జైడస్ క్యాడిలా, సీరం ఇనిస్టిట్యూట్, బయోలజికల్ ఇ, భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యునోలజికల్స్, మైన్వాక్స్ సంస్థలు టీకా తయారీలో బిజీగా ఉన్నాయి. ఇండియాలో కరోనా టీకా తయారీ ఎర్లీ స్టేజ్ లోనే ఉందని ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ అన్నారు. ఈ ఏడాది చివరినాటికి యానిమల్ ట్రయల్స్ వరకు మాత్రమే వెళ్లే చాన్స్ ఉందన్నారు. అంతర్జాతీయ రీసెర్చ్ లతో పోలిస్తే మనం ఇంకా అడ్వాన్స్ స్టేజ్ లోకి వెళ్లలేదని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అభిప్రాయపడ్డారు.

రెమ్ డెసివిర్ పైనే ఆశలు..

కరోనాను అంతం చేసే టీకా వచ్చేందుకు ఇంకా టైం పట్టనుండటంతో ప్రస్తుతానికి పాత మందులతో ట్రీట్ మెంట్ చేయడంపైనా డాక్టర్లు ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే వేర్వేరు రోగాలకు వాడుతున్న మందుల్లో కరోనాకు ఏది బాగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం యాంటీవైరల్ మందులు ఫావిపిరావిర్, రెమ్ డెసివిర్, యాంటీ మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎక్కువగా వాడుతున్నారు. అయితే కరోనా ట్రీట్ మెంట్ కు రెమ్ డెసివిర్ మందే పవర్ ఫుల్ గా పని చేయొచ్చని భావిస్తున్నారు. ఐదేండ్ల క్రితం ఎబోలా వైరస్ ను అంతం చేసేందుకు తయారు చేసిన రెమ్ డెసివిర్.. కరోనా పేషెంట్లు త్వరగా కోలుకునేందుకు కూడా తోడ్పడుతుందని ఇదివరకే తేలింది. మొత్తంగా కరోనా ట్రీట్ మెంట్ కోసం130 మందులపై ట్రయల్స్ జరుగుతుండగా, వీటన్నింటిలోనూ రెమ్ డెసివిర్ మందే టాప్ లో ఉందని నిపుణులు చెప్తున్నారు.

Latest Updates