2 కాదు 3 టీంలతో క్రికెట్ మ్యాచ్..

క్రికెట్‌‌ మ్యాచ్‌‌ అంటే రెండు జట్ల మధ్య పోటీ. లిమిటెడ్‌‌ ఓవర్ల ఫార్మాట్‌‌ అయితే చెరో ఇన్నింగ్స్‌‌.. టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌‌ల్లో పోటీ పడుతాయి. ఫార్మాట్లు మారినా ఎన్నో ఏళ్ల నుంచి మనం చూస్తున్న క్రికెట్‌‌ ఇదే. కానీ, ఒక మ్యాచ్‌‌లో మూడు జట్లు పోటీ పడితే ఎలా ఉంటుంది. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా?. అసలు ఎలా సాధ్యం అనిపిస్తోంది కదా?. కరోనా టైమ్‌‌లో వినూత్న ఆలోచన చేసిన సౌతాఫ్రికా క్రికెట్‌‌ బోర్డు.. నమ్మశక్యం కాని ఈ ఫార్మాట్‌‌ను తెరపైకి తెచ్చింది. దీనికి 3 టీమ్‌‌ క్రికెట్‌‌ (3టీసీ) అని పేరు పెట్టింది. ఎనిమిదేసి ప్లేయర్లు ఉన్న మూడు జట్లతో 36 ఓవర్ల మ్యాచ్‌‌కు ప్లాన్‌‌ చేసింది..

కేప్‌‌టౌన్‌‌:  టెస్టులు, వన్డేలు, టీ 20లు, టీ 10లు.. ఇన్నాళ్లూ క్రికెట్లో ఉన్న ఫార్మాట్లివే. ఇందులో టీ10 మ్యాచ్‌‌లు లీగ్‌‌లకే పరిమితమయ్యాయి. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ ది హండ్రెడ్ బాల్ క్రికెట్అంటూ ఓ కొత్త ఫార్మాట్‌‌తో ముందుకొచ్చినా కరోనా పుణ్యమాని అది పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌‌ఏ)… 3టీమ్ క్రికెట్‌‌ పేరుతో ఓ సరికొత్త ఫార్మాట్‌‌ను తెరపైకి తెచ్చింది. ఒకేసారి మూడు జట్లు తలపడే ఈ మ్యాచ్ మొత్తం 36 ఓవర్లలో ముగుస్తుంది. ఫస్ట్‌‌ రాండ్‌‌ బ్యాంక్‌‌ మాజీ సీఈవో పాల్ హరిస్‌, క్రికెట్‌‌ కామెంటేటర్‌‌ మార్క్‌‌ నికోలస్‌‌, సౌతాఫ్రికా రగ్బీ టీమ్‌‌ మాజీ కెప్టెన్‌‌ ఫ్రాంకోసిస్‌‌ పియెనార్‌‌ జాయింట్‌‌ వెంచర్‌‌ అయిన 3టీసీతో సీఎస్‌‌ఏ అసోసియేట్‌‌ అయింది. ‘సాలిడారిటీ కప్’ పేరిట ఈ నెల 27న కొత్త ఫార్మాట్‌‌లో ఓ ఎగ్జిబిషన్‌‌ మ్యాచ్ ప్లాన్‌‌ చేసింది. ఖాళీ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనుంది. ఈ పోరుకు సెంచూరియన్‌‌లోని సూపర్‌‌ స్పోర్ట్‌‌ పార్క్‌‌ ఆతిథ్యం ఇవ్వనుంది. సూపర్‌‌స్పోర్ట్‌‌ చానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. కరోనా దెబ్బకు తమ దేశంలో ఆగిపోయిన క్రికెట్ రీస్టార్ట్‌‌కు ఈ టోర్నీ కిక్ స్టార్ట్‌‌లా పని చేస్తుందని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు భావిస్తోంది. కొన్ని నెలలుగా ట్రెయినింగ్‌‌కు దూరమైన తమ ప్లేయర్లకు దీని ద్వారా మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుందని చెబుతోంది. టోర్నీ కోసం ఎనిమిది మంది సభ్యులతో కూడిన మూడు జట్లను కూడా ఎంపిక చేసింది. కగిసో రబాడ, క్వింటన్ డికాక్, ఏబీ డివిలియర్స్‌‌ను ఆయా టీమ్స్‌‌కు కెప్టెన్లుగా నియమించింది. ఈ మ్యాచ్‌‌లో డేల్‌‌ స్టెయిన్‌‌ మినహా సఫారీ స్టార్‌‌ ప్లేయర్లంతా బరిలో నిలిచారు. ఇందులో పాల్గొనాలని ప్లేయర్లను ఒత్తిడి చేయలేదని, మళ్లీ గ్రౌండ్‌‌లోకి వచ్చేందుకు అంతా ఉత్సాహంగా ఉన్నారని సీఎస్‌‌ ఏ క్రికెట్‌‌ డైరెక్టర్‌‌ గ్రేమ్‌‌ స్మిత్‌‌ చెప్పాడు. సాలిడారిటీ కప్‌‌ కోసం సీఎస్‌‌ఏ ఉత్సాహంగా ఉందన్నాడు. కొత్త ఫార్మాట్‌‌ చాలా థ్రిల్లింగ్‌‌గా ఉంటుందని, ఈ ప్రాజెక్ట్‌‌లో భాగస్వామి అయినందుకు తాము గర్వపడుతున్నామని చెప్పాడు.

ఎలా ఆడతారంటే..

  • ప్రతి జట్టులో ఎనిమిది మంది ప్లేయర్లు ఉంటారు. మ్యాచ్‌‌లో మొత్తం 36 ఓవర్లు ఉంటాయి. దీన్ని 18 ఓవర్ల చొప్పున రెండు భాగాలుగా ఆడిస్తారు. మధ్యలో బ్రేక్‌‌ ఉంటుంది.
  • ఫస్టాఫ్‌‌లో ఓ టీమ్.. ఒక ప్రత్యర్థితో ఆరు ఓవర్లు ఆడుతుంది. సెకండాఫ్​లో ఆ జట్టు మరో ప్రత్యర్థితో ఆరు ఓవర్లు ఆడుతుంది. ఇలా ప్రతి జట్టుకు 12 ఓవర్లు (బ్యాటింగ్, బౌలింగ్) ఆడే అవకాశం లభిస్తుంది.
  • ఫస్టాఫ్‌‌లో తొలుత ఎవరు బ్యాటింగ్‌‌ చేయాలి, ఎవరు బౌలింగ్‌‌ చేయాలి, ఎవరు డగౌట్‌‌లో ఉండాలనేది ముందుగానే డ్రా ద్వారా నిర్ణయిస్తారు.
  • ఫస్టాఫ్‌‌లో హైయెస్ట్‌‌ స్కోరు చేసిన టీమ్‌‌ సెకండాఫ్‌‌లో మొదట బ్యాటింగ్‌‌ చేస్తుంది. ఒకవేళ స్కోర్లు టై అయితే.. ఫస్టాఫ్​లో ఆడిన స్థానాలను రివర్స్​ చేస్తారు.అంటే మొదట బ్యాటింగ్‌‌ చేసిన టీమ్‌‌తో బౌలింగ్‌‌.. బౌలింగ్‌‌ చేసిన జట్టుతో బ్యాటింగ్‌‌ చేయిస్తారు.
  • ఫస్టాఫ్‌‌లో ఒక జట్టు ఏడో వికెట్‌‌ కోల్పోయినట్టయితే అక్కడితోనే ఆ ఇన్నింగ్స్‌‌ ముగుస్తుంది. సెకండాఫ్‌‌లో ఏడో వికెట్‌‌ పడిన తర్వాత కూడా చివరి బ్యాట్స్‌‌మన్‌‌ ఒక్కడే ఇన్నింగ్స్‌‌ కొనసాగిస్తాడు. కానీ, అతను 2, 4, 6 పరుగులు చేసేందుకే అనుమతిస్తారు.
  • బౌలింగ్‌‌ చేసే ప్రతి జట్టు మొత్తం 12 ఓవర్ల (రెండు భాగాలు కలిపి) ను ఒకే న్యూ బాల్‌‌తో వేస్తుంది. ఒక బౌలర్‌‌ గరిష్టంగా మూడు ఓవర్లు బౌలింగ్‌‌ చేయొచ్చు.
  • చివరకు రెండు భాగాల్లో కలిపి ఎక్కువ రన్స్‌‌ చేసిన జట్టు విజేతగా నిలిచి గోల్డ్‌‌ మెడల్‌‌ దక్కించుకుంటుంది. సెకండ్‌‌ ప్లేస్‌‌కు సిల్వర్‌‌, థర్డ్‌‌ ప్లేస్‌‌కు బ్రాంజ్‌‌ మెడల్‌‌ ఇస్తారు.
  • ఒకవేళ రెండు జట్లు సమాన పరుగులు చేస్తే సూపర్‌‌ ఓవర్‌‌ ఆడించి గోల్డ్‌‌ మెడలిస్ట్‌‌ను డిసైడ్‌‌ చేస్తారు. ఒకవేళ మూడు జట్ల రన్స్‌‌ సమానంగా ఉంటే అందరికీ గోల్డ్‌‌ ఇస్తారు. సెకండ్‌‌ ప్లేస్‌‌కు టై అయినప్పుడు సిల్వర్‌‌ మెడల్‌‌ను షేర్‌‌ చేస్తారు.

టీమ్స్‌‌:

కేజీస్ కింగ్‌ఫిషర్స్‌
కగిసో రబాడ (కెప్టెన్‌),
రీజా హెండ్రిక్స్‌, జనెమన్‌ మలాన్‌, ఫా డుప్లెసిస్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, క్రిస్‌ మోరిస్‌, గ్లెంటన్‌ స్టర్‌మన్‌, తబ్రియాజ్‌ షంసి.
క్విన్నీస్ కైట్స్‌
క్వింటన్‌ డికాక్‌ (కెప్టెన్‌), టెంబా బవూమ, జెజె స్మట్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, డ్వేన్‌ ప్రెటోరియస్‌, లుతో సిపమ్లా, బ్యూరెన్‌ హెండ్రిక్స్‌, అన్రిచ్‌ నోర్జ్‌.
ఏబీస్‌ ఈగల్స్‌
ఏబీ డివిలియర్స్‌ (కెప్టెన్‌), ఐడెన్‌ మార్‌క్రమ్‌, వాండర్‌ డుసెన్‌, కైల్‌ వెరెన్‌, ఆండిల్ ఫెలుక్వాయో, సిసండ మగాల, జూనియర్‌ డాలా, లుంగి ఎంగిడి.
90 ఓవర్ల వెర్షన్​ కూడా
3 టీసీ ఫార్మాట్‌లో 90 ఓవర్ల వెర్షన్‌ను కూడా డిజైన్‌ చేశారు. ఈ వెర్షన్‌లో ఒక్కో జట్టులో 11 మంది ప్లేయర్లు ఉంటారు. కానీ, ఎనిమిది మందికే బ్యాటింగ్​ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి జట్టు ఫస్టాఫ్​లో ఓ ప్రత్యర్థితో 15 ఓవర్లు.. సెకండాఫ్​లో ఇంకో అపోనెంట్‌తో మరో 15 ఓవర్లు ఆడుతుంది.

Latest Updates