కొవిడ్.. టెర్రరిజం కన్నా డేంజర్.

బీజింగ్: ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్​2019 (కరోనా వైరస్​ డిసీజ్​) టెర్రరిజం కన్నా డేంజర్​ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) చీఫ్​ టెడ్రోస్​ అధనోమ్​ ఘెబ్రియేసస్​ అన్నారు. టెర్రరిస్టుల అటాక్​ కన్నా ప్రమాదకరంగా మారిందన్నారు. జనాలకు ఇదే మొదటి శత్రువుగా ప్రపంచం గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘‘రాజకీయ, సామాజిక, ఆర్థిక సంక్షోభాలను సృష్టించడంలో టెర్రరిస్ట్​ అటాక్​ కన్నా కరోనా వైరస్​కే ఎక్కువ శక్తి ఉంది. కొవిడ్​కు వ్యాక్సిన్​ వచ్చేందుకు కనీసం మరో 18 నెలలైనా పడుతుంది. కాబట్టి అది మరింత వ్యాపించకుండా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన అన్నారు. మంగళవారం కరోనా వైరస్​కు డబ్ల్యూహెచ్​వో అధికారికంగా ‘కొవిడ్​2019’గా పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

కొవిడ్​ జోక్​ చేశాడు.. జైలు పాలయ్యాడు

కొవిడ్​ ప్రాంక్​ చేయబోయిన ఓ యువకుడు జైలు పాలయ్యాడు. రష్యా రాజధాని మాస్కోలో ఈ ఘటన జరిగింది. మాస్కో మెట్రో ఎక్కిన యువకుడు, కొవిడ్​ వైరస్​ సోకినట్టు ప్రాంక్​ చేశాడు. ఫిట్స్​తో కిందపడిపోయి నటించాడు. అతడితో పాటు వచ్చిన ప్రాంక్​స్టర్లు, కొవిడ్​ పేషెంట్​ అంటూ అరిచారు. దీంతో మెట్రోలోని ప్రయాణికులంతా గాబరా పడిపోయారు. ఆ వీడియో వైరల్​ కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు. గూండాయిజం కింద కేసు నమోదు చేశారు. అతడికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు.

జపాన్​ షిప్పులో ఇద్దరు ఇండియన్లకు కొవిడ్

జపాన్​ క్రూయిజ్​ షిప్పు డైమండ్​ ప్రిన్సెస్​లో చిక్కుకుపోయిన ఇద్దరు ఇండియన్​ క్రూకు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. జపాన్​లోని ఇండియన్​ ఎంబసీ అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘కొవిడ్​ ఇన్​ఫెక్షన్​ నేపథ్యంలో ఫిబ్రవరి 19 వరకు షిప్పును క్వారెంటైన్​లోనే పెడతారు. ఇప్పటిదాకా ఇద్దరు ఇండియన్లు సహా షిప్పులోని 175 మందికి వైరస్​ సోకింది’’ అని ప్రకటించారు. కాగా, చైనాలో ఇప్పటిదాకా కొవిడ్​తో చనిపోయిన వారి సంఖ్య 1,113కి పెరిగింది.

కరోనా లక్షణాలతో గాంధీకి మరో నలుగురు

హైదరాబాద్, వెలుగు: కరోనా లక్షణాలతో గాంధీ హాస్పిటల్‌లో బుధవారం మరో నలుగురు అడ్మిట్ అయ్యారు. వీళ్లను ఐసోలేషన్ వార్డుల్లో అబ్జర్వేషన్‌లో ఉంచామని, శాంపిల్స్‌ సేకరించి టెస్టుల కోసం పంపించామని ఆరోగ్య శాఖ ప్రకటించింది. నలుగురికి టెస్ట్‌ చేయగా, ఒకరికి నెగెటివ్‌ వచ్చిందని తెలిపింది. మిగతా ముగ్గురి రిజల్స్ట్‌ రావాల్సి ఉందని చెప్పింది. ఇక మంగళవారం ఏడుగురికి టెస్ట్‌ చేయగా, అందరికీ నెగెటివ్‌ వచ్చిందని వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తంగా 85 మందికి పరీక్షలు చేయగా, 82 మందికి వైరస్ లేదని నిర్ధారణ అయ్యిందని పేర్కొంది.

Latest Updates