డెంగీ పేరిట దోపిడీ

డెంగీ పేరిట  దోపిడీ
  • ప్లేట్​లెట్లు తగ్గాయంటూ ప్రైవేట్​ దవాఖాన్ల దందా
  • మామూలు జ్వరంతో వెళ్లినా డెంగీ అంటూ అడ్మిట్​ చేసుకుంటున్నరు
  • రకరకాల టెస్టులు చేయించి ఫీజులు గుంజుతున్నరు
  • లక్ష దాకా ప్లేట్​ లెట్స్​ ఉన్నా ఇంకా ఎక్కిస్తున్నరు
  • సర్కారు దవాఖాన్లలో టెస్టులకు కూడా దిక్కు లేదు


హైదరాబాద్​/ ఖమ్మం/ సూర్యాపేట, వెలుగు: ప్రైవేట్​ హాస్పిటళ్లు డెంగీ పేరిట దోపిడీకి తెరలేపాయి. సాధారణ జ్వరంతో దవాఖానకు పోయినా.. ‘మీ కండీషన్​ సీరియస్​గా ఉంది. ప్లేట్​ లెట్స్​ పడిపోయినయ్’ అంటూ రకరకాల టెస్టులు చేయిస్తున్నాయి. అవసరం లేకున్నా ప్లేట్​లెట్స్​ ఎక్కించి పేషెంట్ల నుంచి లక్షలకు లక్షలు గుంజుతున్నాయి. ప్లేట్‌‌లెట్స్‌‌ పేరిట రోగులను ప్రైవేటు హాస్పిటళ్లు దోచుకుంటున్నాయని ఇటీవలే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్  డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు తనకు చాలా ఫిర్యాదులు వచ్చాయని ఆయన చెప్పారు. అయితే.. జిల్లాల్లోని సర్కారు దవాఖానల్లో టెస్టులు చేసేందుకు దిక్కు లేకుండాపోయింది. వరంగల్​ ఎంజీఎంలో సిబ్బంది కొరతతో డెంగీ, మలేరియా టెస్టులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో వైరల్ ​ఫీవర్​ బాధితులు లక్షల్లో ఉండగా, అందులో ఇప్పటి వరకు అధికారికంగా నమోదైన డెంగీ కేసులు 3 వేలు మాత్రమే. అయితే.. నిరుటితో పోలిస్తే కేసులు రెట్టింపు కావడం, జనాల్లోనూ డెంగీ భయం పెరగడంతో ఇదే అదనుగా ప్రైవేట్​ హాస్పిటళ్లు దోపిడీకి తెగబడ్డాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సాధారణ జ్వరం వచ్చినా జనం భయపడిపోతున్నారు. మూడు రోజులకు మించి ఫీవర్  తగ్గకపోతే వెంటనే ఆస్పత్రులకు పరుగు తీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ టెస్టులు పూర్తిస్థాయిలో జరగడం లేదు. కొన్ని ఆసుపత్రుల్లో కిట్ల కొరత ఉంటే, కిట్లు అందుబాటులో ఉన్న చోట సిబ్బంది లేకపోవడం, ప్లేట్ లెట్స్ సెపరేటర్​ మిషన్లు లేకపోవడం లాంటి అనేక సమస్యలున్నాయి. దీంతో మొదట ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్న పేషెంట్లు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్​బాటపడుతున్నారు. 

వరంగల్​ ఎంజీఎంలో డెంగీ, మలేరియా టెస్టుల కోసం ఒక సూపర్ వైజర్, ఆరుగురు సిబ్బంది ఉండగా..  కొద్దిరోజుల కింద నలుగురు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. మిగిలిన ఇద్దరికి చిల్డ్రన్ వార్డ్ లో బాధ్యతలు అప్పగించారు. దీంతో ఎంజీఎంలో డెంగీ, మలేరియా టెస్టులు నిలిచిపోయాయి. కరీంనగర్ సివిల్ హాస్పిటల్ లో డెంగీ టెస్టు చేస్తే రిజల్ట్​ వచ్చేసరికి 24 గంటలకు పైగా పడుతోంది. ఆలోగా జ్వరం పెరిగిపోవడంతో  చాలా మంది  ప్రైవేట్​ హాస్పిటళ్లకు వెళ్తున్నారు. సర్కారు దవాఖానలోని ఫీవర్​వార్డుకు డాక్టర్​ రోజుకు ఒకసారి మాత్రమే వస్తున్నారని, కనీసం చేయి పట్టి కూడా చూడడం లేదని పేషెంట్లు అంటున్నారు. ఇక్కడ బ్లడ్​ అందుబాటులో లేక బయట రూ. 1,200 పెట్టి యూనిట్​ కొనాల్సి వస్తోంది. ప్లేట్ లెట్స్ కావాలన్నా12 వేల వరకు ఖర్చు చేయాల్సిందే.      ఏజెన్సీకి పెద్దదిక్కయిన ఆదిలాబాద్​ రిమ్స్​లో సింగిల్ బ్లడ్ డోనర్ మిషన్​ అందుబాటులో లేదు.  మూడు పెద్దాసుపత్రుల్లోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన జిల్లాల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో డెంగీ అనే అనుమానం ఉన్న పేషెంట్లంతా ప్రైవేట్​ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. 
ప్రైవేట్​లో టెస్టుల నుంచే దోపిడీ
సర్కారు ఆసుపత్రుల్లో టెస్టులు చేసే దిక్కులేకపోవడంతో ఇదే అదునుగా ప్రైవేట్​ హాస్పిటళ్లు దోపిడీకి తెరలేపుతున్నాయి. నార్మల్​ ఫీవర్​తో వెళ్లినా లేనిపోని టెస్టులు చేసి ప్లేట్‌‌‌‌‌‌‌లెట్స్‌‌‌‌ తగ్గాయని, ఆలస్యం చేస్తే పరిస్థితి సీరియస్​ అవుతుందని భయపెడుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో ప్లేట్‌‌‌‌లెట్‌‌‌‌ కౌంట్‌‌‌‌ లక్ష కంటే ఏ మాత్రం తగ్గినా ప్లేట్‌‌‌‌ లెట్స్‌‌‌‌ రెడీ చేసుకోవాలని సూచిస్తుండడంతో రోగుల బంధువుల్లో టెన్షన్​మొదలవుతోంది. ప్లేట్‌‌‌‌లెట్స్‌‌‌‌ కావాలంటూ వచ్చేవారి సంఖ్య గతంలో కంటే నాలుగైదు రెట్లు పెరిగిందని బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు చెప్తున్నారు. యూనిట్‌‌‌‌ ప్లేట్‌‌‌‌లెట్స్​ కోసం రూ. 11,500 మాత్రమే తీసుకోవాలని ఆదేశాలున్నా.. బ్లడ్ బ్యాంకుల్లో మాత్రం డిమాండ్ ను బట్టి రూ. 15 వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్లేట్ లెట్స్, టెస్టులు, బెడ్ చార్జీల పేరుతో కనీసం రూ. 50 వేల నుంచి లక్ష వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పేషెంట్ల బంధువులు చెప్తున్నారు. వారం కింద సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో నార్మల్ ఫీవర్ తో అడ్మిట్ అయితే డెంగీ ట్రీట్మెంట్ పేరుతో 5 రోజులు చికిత్స చేసి రూ. 60 వేలు బిల్లు  వేశారు. హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పుడు పేషెంట్ కండిషన్ బాగానే ఉన్నా 3 రోజుల తరువాత ప్లేట్‌‌‌‌లెట్స్‌‌‌‌ పడిపోయాయని, మరో 3 రోజులు ఉంచాలని  డాక్టర్లు చెప్పడంతో అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించారు. రూ.60 వేల బిల్లు చేతిలో పెట్టడంతో పేషెంట్ బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి నిర్వాహకులు రూ.50 వేలు తీసుకొని ఎలాంటి బిల్లు ఇవ్వకుండా పంపేశారని బాధితులు చెప్తున్నారు. 

కంప్లైంట్ చేయండి
గతేడాదితో పోలిస్తే ఈసారి డెంగీ కేసులు పెరిగాయి. సగం కేసులు గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లో వస్తే, ఇంకో సగం మిగిలిన జిల్లాల్లో వస్తున్నాయి. కొత్తగూడెం, ఖమ్మంలో ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ దవాఖాన్లలో ఏర్పాట్లు చేశాం. 22 హాస్పిటళ్లలో ప్లేట్‌‌‌‌లెట్ సెపరేషన్  మిషన్లు ఉన్నాయి. జనాలు అనవసరంగా భయపడి ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్తున్నారు. ఆ భయాన్ని ప్రైవేటు వాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ప్లేట్‌‌‌‌లెట్‌‌‌‌ కౌంట్ 70వేలు, 80 వేలకు తగ్గగానే ట్రాన్స్‌‌‌‌ఫ్యుజన్ చేస్తున్నారు. లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. ఈ దోపిడీ మీద పేషెంట్లు కంప్లైంట్స్‌‌‌‌ చేస్తే చర్యలు తీసుకుంటున్నాం. ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌లో లోపాలు, అధిక చార్జీలపై వాట్సప్‌‌‌‌ ద్వారా (వాట్సప్​ నెంబర్​: ​9154170960) ఫిర్యాదు చేయాలి.
                                                                                                                                                                                ‑ డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. 


అప్పు తెచ్చి కట్టిన్రు
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎల్లంకి ఎస్టేట్ కాలనీకి చెందిన పానుగంటి సత్యనారాయణ వ్యవసాయ కూలీ. ఇటీవల వైరల్ ఫీవర్ రావడంతో కల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నడు. రూ. 15 వేలు ఖర్చు చేసినా ఫలితం లేకపోవడంతో ఖమ్మంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్​ అయిండు.  అక్కడ చేసిన టెస్టుల్లో సత్యనారాయణకు డెంగీ అని తేలింది.  ప్లేట్ లెట్స్ 36 వేలకు పడిపోవడంతో రూ. 16 వేలు ఖర్చు చేసి ప్లేట్ లెట్స్ ఎక్కించిన్రు.   సత్యనారాయణ ఆసుపత్రిలో ఉండగానే ఆయన భార్య ఉషకు కూడా వైరల్ ఫీవర్ రావడంతో అదే ఆస్పత్రిలోనే జాయిన్ అయింది. భార్యాభర్తలిద్దరికీ కలిపి హాస్పిటల్​లో రూ. 60 వేల బిల్లు వేశారు. కూలినాలి చేసుకొని బతికే కుటుంబం కావడంతో బయట అప్పులు తెచ్చి  బిల్లులైతే  కట్టారుగాని, ఇప్పుడు వాటిని ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నరు. 


ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్లేట్ లెట్స్ కౌంట్ లోనూ మోసమే
డెంగీ పేరుతో ప్రైవేట్​ హాస్పిటళ్లు అడ్డగోలుగా దోచుకుంటున్నయ్​. మా బంధువుకు జ్వరం వస్తే ప్రైవేట్​ దవాఖానకు తీసుకపోయిన. వెంటనే డెంగీ, మలేరియా, ప్లేట్లెట్ కౌంట్‌‌‌‌ పరీక్షలు చేసిన్రు. ప్లేట్ లెట్స్​ 60 వేలు ఉన్నాయని, అడ్మిట్ చేయాలని చెబితే డబ్బులు లేవని బయటకు వచ్చినం. తెలిసిన ల్యాబ్​కు వెళ్లి పరీక్ష చేపిస్తే ప్లేట్ లెట్స్ లక్షా ఇరవై వేలు ఉన్నట్లు తేలింది. ఇంటికి వెళ్లి మందులు వాడితే సరిపోతుందని ఇంటికి వచ్చినం.                                                                                                                                                               - పోతుల సుదర్శన్, మద్దులపల్లి, ఖమ్మం జిల్లా 

ఈజీగా అరిగే ఫుడ్​ తీసుకోవాలి
డెంగీ వచ్చిన వాళ్లలో మెడిసిన్ వాడినా, 3 నుంచి 5 రోజులు జ్వరం అలాగే ఉంటుంది. ఆ టైమ్‌‌‌‌లో ప్లేట్‌‌‌‌లెట్స్‌‌‌‌ తగ్గడం సహజం. జ్వరం తగ్గిన తర్వాత 3 రోజుల వరకూ కౌంట్ తగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంప్రూవ్‌‌‌‌ అవుతుంది. చాలా కేసుల్లో 30 వేల వరకూ వచ్చి మళ్లీ పెరుగుతాయి. డెంగీ, మలేరియా సహా ఫీవర్ ఏదైనా మెడికేషన్ సేమ్ ఉంటుంది. జ్వరం తగ్గేందుకు మెడిసిన్స్‌‌‌‌, డీహైడ్రేషన్ అవకుండా ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. బొప్పాయి ఆకుల జ్యూస్ తాగితే, కివీ, డ్రాగన్ ఫ్రూట్స్‌‌‌‌ తింటే ప్లేట్‌‌‌‌లెట్స్ ఇంప్రూవ్ అవుతాయని వాటిని ఎక్కువగా తినడం మంచిది కాదు. అలా అతిగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఫీవర్ వచ్చినప్పుడు ద్రవపదార్థాలు, ఈజీగా అరిగే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. బీపీ కంట్రోల్ ఉండేలా చూసుకోవాలి.
                                                                                                                                                                                                                 - డాక్టర్ రాజేంద్రప్రసాద్‌‌‌‌, కియా హాస్పిటల్, కరీంనగర్

డెంగీ వస్తే భయపడొద్దు
డెంగీ కేసుల్లో 10% మందికే హాస్పిటల్ అడ్మిషన్ అవసరం. కానీ, చాలా మంది జ్వరం వచ్చిన మరుసటిరోజే వెళ్లి డెంగీ టెస్ట్, సీబీపీ చేయించుకుంటున్నారు. డెంగీ పాజిటివ్ అని వచ్చినా, ప్లేట్‌‌‌‌లెట్స్‌‌‌‌ కౌంట్ కొంచెం తగ్గినా హాస్పిటల్‌‌‌‌లో అడ్మిట్ అవుతున్నారు. డెంగీ విషయంలో ఇంతలా భయపడాల్సిన అవసరం లేదు. జ్వరం వచ్చినప్పుడు ప్లేట్‌‌‌‌లెట్ కౌంట్ తగ్గడం చాలా సహజం. అది మళ్లీ పెరుగుతుంది.  ప్లేట్​లెట్స్​ కౌంట్ 50 వేల కంటే తగ్గితే, అప్పుడు డాక్టర్ల మానిటరింగ్ అవసరం. 30 వేల కంటే తగ్గితే ఐసీయూ కేర్‌‌‌‌‌‌‌‌లో ఉండాలి. కౌంట్ పది వేల కంటే తగ్గితే ట్రాన్స్‌‌‌‌ఫ్యుజన్ చేయాల్సి ఉంటుంది. జనాలు ఫస్ట్ భయాన్ని వదిలేయాలి. హైఫీవర్ ఉంటే డాక్టర్‌‌‌‌‌‌‌‌ను కలిసి, వాళ్లు చెప్పిన మెడిసిన్ వాడాలి. నాలుగైదు రోజుల తర్వాత కూడా ఫీవర్ అలాగే ఉంటే, అప్పుడు  టెస్టులు చేయించుకోవాలి.
                                                                                                                                                                                              ‑ డాక్టర్ నందన జాస్తి,  జనరల్ ఫిజీషియన్‌‌‌‌, మెడికవర్ హాస్పిటల్స్‌‌‌‌