పాక్ వి పచ్చి అబద్ధాలు: విదేశాంగ శాఖ ఆగ్రహం

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పచ్చి అబద్ధాలు చెప్పారని భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా దాడిపై ఆయన వ్యాఖ్యలు ప్రపంచాన్ని తప్పు దోవ పట్టించాలన్న ప్రయత్నమేనని మండిపడింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

ఉగ్ర బాధితులమని పాక్ ప్రధాని చెప్పడం పచ్చి అబద్ధమని అన్నారాయన.  వాస్తవమేంటన్నది ప్రపంచం మొత్తానికి తెలుసని చెప్పారు. ఉగ్రవాదానికి పాక్ అడ్డా అని అన్నారు.

భారత్ తో చర్చలకు సిద్ధమని ఇమ్రాన్ అంటున్నారని, కానీ గతంలో ఎన్నో సార్లు భారత్ చేసిన ప్రయత్నాలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. పుల్వామా దాడిపై ఆధారాలు కోరడం వింతగా ఉందని, ఈ దాడి తామే చేశామని ప్రకటించిన జైషే ఉగ్ర సంస్థ ప్రకటించిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. జైషే చీఫ్ మసూద్ అజార్ పాక్ లోనే ఉన్నాడని ప్రపంచం మొత్తానికీ తెలుసని, పాక్ చర్యలు తీసుకోవడానికి ఇంత కన్నా ఏం ఆధారాలు కావాలని అడిగారు.

అయినా పాక్ కు గతంలో పఠాన్ కోట్, ముంబైపై జరిగిన దాడులకు సంబంధించిన ఆధారాలు ఇస్తే ఏం చేశారని రవీష్ నిలదీశారు.  ఈ నయా పాక్ మంత్రులు పబ్లిక్ గా హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాదులతో కలిసి తిరిగారని ధ్వజమెత్తారు.

కనీసం పుల్వామా దాడి ఖండించడం గానీ, అమరులైన జవాన్లకు సంతాపం తెలపడం గానీ చేయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి ఇటువంటి స్పందన రావడంలో ఆశ్చర్యమేమీ లేదని రవీష్ అన్నారు.

Latest Updates