అద్భుతం : లక్ష ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించింది

లక్ష 36వేల ఏళ్ల కిందటే అంతరించిన పక్షి జాతి

హిందూ మహాసముద్రంలోని ఓ పగడపు దీవిలో కనిపించిన పక్షి

ఇదో అద్భుతం అనే చెప్పాలి. లక్షలు, కోట్ల ఏళ్లుగా ఈ విశ్వంలో ఎన్నో జీవజాతులు పుట్టి… పెరిగి… అంతరించిపోయాయి. అంతరించినపోయిన జీవజాతి మళ్లీ పుట్టుకొచ్చిన సందర్భాలే లేవు. ఉన్నా.. అవి అత్యంత తక్కువ. అలా జరిగితే.. అది అద్భుతం కిందే లెక్క. ఇప్పుడు ఓ అరుదైన పక్షి జాతి మళ్లీ రికార్డులకెక్కింది. తాము ఈ నేలపై ఒకప్పుడు బాగా బతికినవారమే అంటూ.. ఓ పక్షి మళ్లీ సజీవంగా కనిపించింది.

రెయిల్ జాతికి చెందిన పక్షి అది. గొంతు భాగంలో తెల్లని రంగు దాని ప్రత్యేకత. పొడవాటి ముక్కుతో వేట సాగిస్తుంది.  పెద్దగా ఎగరలేదు. సముద్ర తీర ప్రాంతాల్లో మనుగడ సాగిస్తుంటుంది. ఓ శతాబ్దం కాదు.. ఓ సహస్రాబ్ది కూడా కాదు. 1లక్ష 36వేల ఏళ్ల కిందట ఈ జాతి భూమిపై సంచరించింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత.. పరిశోధకులు దీనిని చూసి.. ఆశ్చర్యపోతున్నారు.

హిందూ మహా సముద్ర తీరంలో సైంటిస్టుల కంటపడింది ఈ పక్షి. అల్ దబ్రా అనే పగడపు దీవిలో..  కెమెరాకు చిక్కింది. యూకేలోని పోర్ట్స్ మౌత్ యూనివర్సిటీ, నేచురల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకులు ఈ పక్షి జాతిని గుర్తించారు. ఇటరేటివ్ ఇవొల్యూషన్ అనే అరుదైన సిద్ధాంతం ప్రకారం.. ఈ అరుదైన జీవరాశి దాదాపు లక్షన్నర ఏళ్ల తర్వాత తిరిగి జన్మించగలిగిందని భావిస్తున్నారు. రెయిల్స్ జాతి పక్షుల్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారు.

అరుదైనవిగా గుర్తింపుతెచ్చుకున్న అత్యంత ప్రత్యేకమైనవాటిలో.. ఈ పక్షి జాతి పుట్టుక అనేది అత్యంత ప్రాధాన్యమైనదని.. లిన్నియన్ సొసైటీ పబ్లిష్ చేసిన జువాజికల్ జర్నల్ లో సైంటిస్టుల బృందం తెలిపింది.

ఈ అరుదైన రెయిల్ జాతి పక్షికి అనుబంధంగా కొన్ని పక్షి జాతులు ఇంకా.. హిందూ మహాసముద్ర దీవులైన మడగాస్కర్, మారిషస్, ఈస్ట్ కోస్ట్ ఆఫ్రికా ప్రాంతాల్లో ఉన్నాయని పరిశోధకులు చెప్పారు. మడగాస్కర్ లోని ఓ పక్షి జాతి… అత్యంత అరుదైన సందర్భాల్లో మరో రెండు విభిన్నమైన పక్షి జాతుల పుట్టుకకు కారణం అవుతుందనడానికి ఆధారాలు ఉన్నాయన్నారు.