విమర్శల దెబ్బకు పరిహారం పెంపు… శ్రీశైలం మృతుల ఫ్యామిలీస్ కు మరో రూ.75లక్షలు

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఎక్స్ గ్రేషియాకు అదనంగా రూ.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. శనివారం తెలంగాణ జెన్ కో బోర్డు సీఎండీ ప్రభాకర్ రావు అధ్యక్షతన విద్యుత్ సౌధలో జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన డీఈ కుటుంబానికి రూ.1.25 కోట్లు, మిగతా ఉద్యోగుల కుటుంబాలకు రూ.1 కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇతర శాఖాపరమైన సహాయం కూడా త్వరితగతిన అందించనున్నట్లు చెప్పారు.

ప్రమాదంలో మరణించిన డీఈకి మొద‌ట రూ.50 లక్షలు, మిగతా ఉద్యోగులకు రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. అయితే దీనిపై బాధిత కుటుంబాల నిరసనలు, చావులో కూడా వివక్ష ఏంటని ఈఏఎస్ శర్మ లాంటి నిపుణులు ప్రశ్నించడంతో సర్కారు తన నిర్ణయం మార్చుకుంది. దీంతో ట్రాన్స్ కో తరఫున అన్ని కుటుంబాలకు సమానంగా రూ.75 లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. సీఎండీతో పాటు డైరెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు సమావేశంలో పాల్గొన్నారు

Latest Updates