ముఖమే ఓటర్ కార్డు.. ఫేస్​ చూసి ఓటేయించారు

  • కొంపల్లి మున్సిపాలిటీలో పైలట్​ ప్రాజెక్టుగా ఫేస్‌‌ రికగ్నైజేషన్‌‌  సిస్టం

హైదరాబాద్‌‌ :  దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్​ శివార్లలోని కొంపల్లి మున్సిపల్​పోలింగ్​లో ‘ఫేస్‌‌ రికగ్నైజేషన్‌‌ టెక్నాలజీ’ని ఉపయోగించారు. ఇక్కడి ఆరు వార్డులకు సంబంధించిన పది పోలింగ్‌‌ బూత్​లలో పైలెట్‌‌ ప్రాజెక్టుగా పరీక్షించారు. పోలింగ్‌‌ అధికారులు తమకిచ్చిన మొబైల్‌‌ ఫోన్లలోని ‘ఫేస్‌‌ రికగ్నైజేషన్‌‌ యాప్‌‌’ ద్వారా ఓటర్లను ఫొటో తీశారు. అప్పటికే అప్‌‌లోడ్‌‌ చేసి ఉన్న డేటాతో ఫొటోను యాప్​ సరిపోల్చి.. ‘వ్యాలిడ్‌‌ ఓటర్‌‌’ అంటూ కన్ఫర్మేషన్‌‌ ఇచ్చాక ఓటింగ్‌‌కు అనుమతిచ్చారు. అయితే ఈ ప్రక్రియ వల్ల పోలింగ్​ ప్రక్రియలో జాప్యం జరిగింది. మున్సిపాలిటీలోని 36 పోలింగ్‌‌ స్టేషన్లలో 66.03 శాతం పోలింగ్‌‌ నమోదవగా.. ఈ యాప్‌‌ ఉపయోగించిన 10 పోలింగ్‌‌ బూత్‌‌లలో ఐదు శాతం తక్కువగా ఓట్లు పడ్డాయి.

జాప్యంపై ఓటర్ల ఆగ్రహం

కొంపల్లి మున్సిపాలిటీలోని 13, 15, 16, 21, 22, 23, 24, 31, 32 నంబర్​ పోలింగ్​ బూత్​లలో ‘ఫేస్‌‌ రికగ్నైజేషన్‌‌’ యాప్‌‌ను ఉపయోగించారు. ఓటేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని పోలింగ్‌‌ సిబ్బంది ఫొటో తీయడం, ఆ ఫొటో ఎలక్టోరల్‌‌ రోల్స్‌‌లోని డేటా, ఫొటోలతో మ్యాచ్‌‌  అయ్యాకే ఓటేసేందుకు పంపడంతో ఆలస్యమైంది. ఈ యాప్‌‌ ద్వారా ఓటర్ల గుర్తింపునకు పది సెకండ్ల టైమ్‌‌ మాత్రమే పడుతుందని అధికారులు చెప్పినా.. 20 సెకన్ల నుంచి అరనిమిషానికిపైగా పట్టిందని ఓటర్లు చెప్పారు. ఇది ఓటింగ్‌‌ ప్రక్రియపై ప్రభావం చూపింది. ఫొటోలు తీసేందుకు అంతసేపు నిలబెట్టడంపై కొందరు ఓటర్లు అధికారులపై మండిపడ్డారు.

ఇది ప్రైవసీకి దెబ్బ: ఎంఐఎం

మున్సిపల్‌‌ ఎలక్షన్లలో ఫేస్‌‌ రికగ్నైజేషన్‌‌ యాప్‌‌ ఉపయోగించడాన్ని ఎంఐఎం వ్యతిరేకించింది. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ జాఫ్రీ  ఎలక్షన్​ కమిషన్​కు ఫిర్యాదు చేశారు. ఇక ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ఒవైసీ బుధవారం ట్విట్టర్‌‌లో దీనిపై ట్వీట్​ చేశారు. ‘ఫేస్‌‌ రికగ్నైజేషన్‌‌ యాప్‌‌’ ద్వారా తీసుకునే డేటా పౌరుల వ్యక్తిగత సమాచారమని, అది భవిష్యత్‌‌లో దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని ఆందోళన
వ్యక్తం చేశారు. ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఎలక్షన్​ కమిషన్​ చర్య మానవ హక్కులను హరించడమేనని విమర్శించారు.

Latest Updates