శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫేస్ రికగ్నిషన్ ట్రయల్స్

face-recognition-trails-in-shamshabad-airport

భారత ప్రభుత్వ డిజియాత్ర కార్యక్రమంలో భాగంగా GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం ఫేస్ రికగ్నిషన్ ట్రయల్స్ ప్రారంభించింది. జులై 1న ప్రారంభమైన ఈ ట్రయల్స్ జులై 31 వరకు కొనసాగనున్నాయి. ప్రయాణికులు తమ వివరాలను ఈ ట్రయల్స్ లో నమోదు చేసుకోవచ్చని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ నమోదు ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి పది రోజులలో విశేష స్పందన వస్తోందని అధికారులన్నారు.

ఫేస్ రికగ్నిషన్ లో తమ వివరాలు నమోదు చేయించుకోవాలనే ప్రయాణికులు.. ప్రభుత్వ ఐడీ కార్డు, కాంటాక్ట్ వివరాలతో విమానాశ్రయంలోని ఫేస్ రికగ్నిషన్ కౌంటర్ల వద్ద తమ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి ముఖాన్ని ఫోటో తీస్తారు. ఇది జరిగిన తర్వాత సీ.ఐ.ఎస్.ఎఫ్. అధికారులు ప్రభుత్వ ఐడీ కార్డును భౌతికంగా పరిశీలించి.. అనంతరం ఫేస్ రికగ్నిషన్ కోసం నమోదు చేసుకున్న ప్రయాణికుల పేరిట ఒక యునీక్ డిజియాత్ర ID జనరేట్ చేస్తారు. ఈ ఐడీ ఉన్న ప్రయాణికులకు  సెక్యూరిటి కౌంటర్ల వద్ద ఎలాంటీ తనిఖీలుండవు.

ఫేస్ రికగ్నిషన్ అనేది ఒకేసారి జరిగే ప్రక్రియ. ఒకసారి ఈ నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యాక ట్రయల్ పీరియడ్ లో ప్రయాణికులు తమ డిజియాత్ర ఐడీని ఉపయోగించుకోవచ్చు.

ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయంలో ఫేస్ రికగ్నిషన్ ట్రయల్స్ కేవలం ఎంపిక చేసిన పట్టణాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడకు వెళ్లే ప్రయాణికులు, అదీ కేవలం హ్యాండ్ బ్యాగుతో మాత్రమే ప్రయాణించే ప్రయాణికులకు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే దీనిని ఇతర ప్రయాణికులకూ విస్తరిస్తారు

Latest Updates