ఫేస్ బుక్ లో ఉద్యోగాల పేరుతో మోసం

 హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ జానకీ షర్మిల వివరాల ప్రకారం.. జీడిమెట్ల చింతల్ కు చెందిన యువతికి ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ పోస్ట్ చేసిన వ్యక్తి తాను ఎంబీబీఎస్ పూర్తిచేసి ఎన్.ఎస్.ఈ. కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని వివరాలు పెట్టాడు. ఆ తరువాత యువతి ఫేస్ బుక్ ప్రొఫైల్ లో ఉన్న మొబైల్ నంబర్ కి ఫోన్ చేసి తన కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆమెని నమ్మించాడు. అందుకోసం vasanthnani57@gmail.com కు బయోడేటా పంపాలని సూచించాడు. దీంతో పాటు రూ.10వేలు వి.అనిల్ పేరుతో .. ఎస్బీ ఐ అకౌంట్ లో డిపాజిట్ చేయాలని చెప్పాడు.

అతని మాటలు నమ్మిన యువతి మరో నలుగురితో కలిసి రూ.50వేలు చెల్లించింది. ఆ తరువాత కాల్ లెటర్స్ కోసం ఎదురుచూసింది. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు కోసం మరో రూ. 5వేలు చెల్లించాలని చెప్పాడు. దీంతో బాధితులు ఐదుగురు రూ.1.69 లక్షలు నిందితుడి అకౌంట్ లో డిపాజిట్ చేశారు. రోజులు గడుస్తున్నా ఉద్యోగాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన విజయగిరి అనీల్(28) అతని సోదరుడు విజయగిరి శివ (30)ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఫేస్ బుక్ లో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి నిందితులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు.

 

Latest Updates