ట్రంప్‌ పోస్టులను డిలీట్‌ చేసిన ట్విట్టర్‌‌, ఫేస్‌బుక్‌

  • కరోనా గురించి తప్పుడు పోస్టులు పెట్టినందుకే

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెట్టిన పోస్టులను ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థలు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌‌ తొలగించాయి. కరోనాపై తప్పుడు సమాచారం ఇచ్చేలా ఆయన పోస్టులు ఉన్నాయని ఆరోపిస్తూ వాటిని డిలీట్‌ చేస్తున్నట్లు చెప్పారు. చిన్న పిల్లలు కరోనా వైరస్‌ నుంచి రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని చెప్పిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఉన్నాయి అంటూ వాటిని డిలీట్‌ చేశారు. “ ఒక ప్రత్యేక వయసుకు చెందిన వారు కరోనా రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారనే సమాచారం ఉంది. ఇది తప్పుదోవ పట్టిస్తోంది. అది మా సంస్థ నిబంధనలకు విరుద్ధం. అందుకే డిలీట్‌ చేస్తున్నాం” అని ఫేస్‌బుక్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. ట్విట్టర్‌‌ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది. కాగా ఆ ఆరోపణలను ట్రంప్‌ అధికారులు ఖండించారు. అధ్యక్షుడి పట్ల పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నాయని నిందించారు. ఫిబ్రవరి 24 నుంచి జులై 12 మధ్య వైరస్‌ బారినపడిన 60లక్షల మందిలో 5 నుంచి 14 ఏండ్ల వయసు వారు 4.6 శాతంగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. దానిపైనే ట్రంప్‌ మరోసారి కామెంట్‌ చేశారు. పిల్లల్లో వైరస్‌ను తట్టుకునే శక్తి ఉందని ఆయన వైట్‌హౌస్‌లో జరిగిన ఇంటర్వూలో చెప్పారు.

Latest Updates